గ్రేటర్‌ రోడ్లు ప్రైవేటుకు!

0
247
  • రహదారుల నిర్మాణం, నిర్వహణ అప్పగింత
  • 709 కిలోమీటర్లకు రూ.1,827 కోట్లు ఖర్చు
  • శరవేగంగా ఉత్తర్వులు.. నోటిఫికేషన్‌ ప్రకటన
  • ఎన్నికల నేపథ్యంలో సర్కారు మాస్టర్‌ ప్లాన్‌

ఏమిటీ రోడ్లు..? వీటిపై ప్రయాణమెలా..? ఇదేనా విశ్వనగరం!? సీజన్‌తో సంబంధం లేకుండా మహానగర రహదారులపై పౌరుల అసంతృప్తి ఇది. సామాజిక మాధ్యమాలు వేదికగా అధ్వాన రోడ్ల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూడా. మరో 16 నెలల్లో గ్రేటర్‌ ఎన్నికలున్న నేపథ్యంలో ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌ వేసింది. సమగ్ర రహదారుల నిర్వహణ కాంట్రాక్టు (సీఆర్‌ఎంసీ) పేరిట ప్రైవేట్‌ సంస్థలకు రోడ్లను అప్పగించాలని నిర్ణయించింది. తాజాగా సీఆర్‌ఎంసీ మార్గదర్శకాలతో పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్ల కాల వ్యవధిలో రూ.1,827 కోట్ల అంచనా వ్యయంతో 709 కి.మీ.ల రోడ్లను ఏడు ప్యాకేజీలుగా ఎంపికైన సంస్థలకు అప్పగించనున్నారు. వీటిలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఆర్‌డీసీఎల్‌, టీఎ్‌సఐఐసీకి చెందిన రహదారులున్నాయి. సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో బిడ్‌లు ఆహ్వానిస్తూ జీహెచ్‌ఎంసీ టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటించింది. ఈనెల 31న కాంట్రాక్టు ఏజెన్సీలతో ప్రీ బిడ్‌ సమావేశం ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వచ్చే నెల 8న బిడ్‌ దాఖలు గడువు ముగియనుంది. అనంతరం వారం రోజుల్లోనే అగ్రిమెంట్‌ పూర్తయ్యేలా అధికారులు పావులు కదుపుతున్నారు. ప్రభుత్వం సీరియ్‌సగా ఉండడంతో ఉత్తర్వుల జారీ నుంచి టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటన వరకు శరవేగంగా ప్రక్రియ పూర్తయింది.

రోడ్ల పూర్తి బాధ్యత ఆ సంస్థలదే!…ప్రైవేట్‌కు అప్పగిస్తున్న రహదారులకు సంబంధించి పూర్తి బాధ్యత ఎంపికైన సంస్థలదేనని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. రోడ్లతోపాటు ఫుట్‌పాత్‌లు, గ్రీనరీ, సెంట్రల్‌ మీడియన్లు, వంతెనలు, స్ర్డామ్‌ వాటర్‌ డ్రైన్‌లు, డ్రైనేజీ వ్యవస్థ, బ్లింకర్లు, క్యాట్స్‌ ఐ, స్పీడ్‌ బ్రేకర్లు, లేన్‌/బార్‌ మార్కింగ్‌, కెర్బ్‌ పెయింటింగ్స్‌, సైనేజ్‌ల ఏర్పాటు/నిర్వహణ బాధ్యత కూడా ప్రైవేట్‌ సంస్థలదే. స్వీపింగ్‌, ఫుట్‌పాత్‌లపై నిర్మాణ రంగ వ్యర్థాల తొలగింపు కూడా అవే చూసుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వార్షిక నిర్వహణలో భాగంగా రోడ్లపై గుంతల పూడ్చివేత, బ్యాడ్‌ ప్యాచ్‌ల మరమ్మతు, పాడైన మ్యాన్‌హోళ్ల రిప్లే్‌సమెంట్‌, క్యాచ్‌పిట్లు/డ్రైన్‌ల క్లీనింగ్‌ కాంట్రాక్టు ఏజెన్సీలు చూసుకోవాలి. వర్షాకాలంలో మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ బృందాల ఏర్పాటు, డ్రైనేజీ ఓవర్‌ ఫ్లోను అరికట్టే బాధ్యత కూడా వాటిదే. రోడ్లకు సంబంధించి పౌరుల నుంచి ఫిర్యాదులనూ పరిష్కరించాలి. వాటిని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయకపోతే జీహెచ్‌ఎంసీకి పెనాల్టీ విధించే అధికారం ఉంటుంది. ఎంపికైన సంస్థలు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసుకోవడంతోపాటు అవసరమైన యంత్రాలు సమకూర్చుకోవాలి.

Courtesy Andhrajyothi…

Leave a Reply