జీఎస్డీపీ పెరిగితే.. జీవితాలు మారినట్లేనా?

0
56

కన్నెగంటి రవి

అధికారంలో ఉన్న పార్టీ ఎప్పుడైనా తన పాలన గురించీ, చేసిన అభివృద్ధి గురించి గొప్పగా చెప్పుకుంటుంది. ఏటా పెరుగుతున్న బడ్జెట్ పరిమాణంపై జబ్బలు చరుచుకుంటుంది. పైకి ఎగబాకుతున్న జీ‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌డీ‌‌‌‌‌‌‌‌పీ వృద్ధి, సగటు తలసరి ఆదాయం గురించి కూడా ప్రచార హోరు సాగిస్తుంటుంది. ఈ ప్రచారంలో కొట్టుకుపోకుండా, నిజాలేమిటో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.రాష్ట్రం ఏర్పడిన మొదటి ఆర్ధిక సంవత్సరం 2014 – 2015లో రాష్ట్ర జీ‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌డీపీ రూ. 4,30,599 కోట్లు కాగా , 2021 – 2022 నాటికి అది రూ.11,55,000 కోట్లకు పెరిగిపోయిందని, రాష్ట్ర సగటు తలసరి ఆదాయం కూడా రూ. 2,73,000కు చేరుకుందని, ఇది దేశ సగటు కంటే చాలా ఎక్కువని రాష్ట్ర సర్కారు చెబుతున్నది. నిజమే, ఇవి అత్యంత ఆకర్షణీయమైన సంఖ్యలే. కానీ ఇప్పుడు కొనసాగుతున్న అభివృద్ధి నమూనా వల్ల జీఎస్‌‌‌‌‌‌‌‌డీపీ వృద్ధి రేటు అన్ని చోట్లా ఒకే రకంగా లేదని, సగటు తలసరి ఆదాయాల మధ్య కూడా తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయని ప్రభుత్వ సామాజిక ఆర్ధిక నివేదికల గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా రూ.1,93,507 కోట్ల జీడీడీపీతో మొదటి స్థానంలో ఉంటే , ములుగు జిల్లా రూ. 5,746 కోట్లతో చివరి స్థానంలో ఉండడానికి కారణాలేమిటో విశ్లేషించాలి. జిల్లా సగటు తలసరి ఆదాయం రూ. 6,58,757తో రంగారెడ్డి మొదటి స్థానంలో ఉంటే, కేవలం 1,32,479 రూపాయలతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది. జీ‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌డీపీ, తలసరి ఆదాయం పెరుగుతున్నాయంటే, రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయని, ప్రజలంతా సుఖ సంతోషాలతో వెలిగిపోతున్నారని ప్రభుత్వం మనల్ని నమ్మమంటున్నది. కానీ ఆయా జిల్లాల మధ్య ఇంత వ్యత్యాసాలు ఎందుకు ఉన్నాయో, ఎనిమిదేండ్లు గడిచినా ఈ వ్యత్యాసాలు ఎందుకు తగ్గడం లేదో ఎప్పుడూ చెప్పడం లేదు. రాష్ట్రంలో ఇప్పటికీ 81,80,000 కుటుంబాలకు ఆహార భద్రతా కార్డులు ఉన్నాయి. మరో 5,60,000 కుటుంబాలకు అంత్యోదయ అన్న యోజన కార్డులు ఉన్నాయి. రాష్ట్రంలో రేషన్ కార్డు జారీ చేయాలంటే గ్రామాల్లో 1,50,000 లోపు, పట్టణాల్లో 2,00,000 లోపు కుటుంబ ఆదాయం ఉండాలి.  ఇప్పటికీ 80 శాతం కుటుంబాలు రేషన్ బియ్యంపై ఆధారపడుతున్నాయని చెబుతున్న ప్రభుత్వం, మరో వైపు సగటు తలసరి ఆదాయం గణనీయంగా పెరుగుతున్నదని చెప్పడంలో తీవ్ర వైరుధ్యం ఉంది. దీన్ని అర్థం చేసుకోవడమే మనమిప్పుడు చేయాల్సిన పని.

కష్టాల్లో కార్మిక లోకం
రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతున్నాయని,  పరిశ్రమలు పరిగెత్తుకొస్తున్నాయని ప్రభుత్వం చెబుతున్నది. మరో వైపు ఉన్నత విద్య చదువుకున్న వాళ్లలో నిరుద్యోగం తాండవిస్తొందని, ప్రభుత్వం పూర్తి స్థాయి నియామకాలు చేపట్టకపోవడం వల్ల, నిరుద్యోగుల్లో నిరాశా నిస్పృహలు పెరిగిపోతున్నాయని రోజూ మనకు కనపడుతున్న వాస్తవం. మెజారిటీ యువతలో విద్యా సామర్థ్యాలు, సాంకేతిక నైపుణ్యాలు, ఆంగ్ల భాషా పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఉద్యోగార్థులుగా పోటీలో నిలబడలేకపోతున్నారని కూడా అనేక నివేదికలు ఘోషిస్తున్నాయి. రాష్ట్రంలో నెలకొల్పుతున్న పరిశ్రమల్లో తెలంగాణ యువతకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు అందడం లేదని, తక్కువ వేతనాలతో కట్టు బానిసలుగా పని చేయడానికి సిద్ధపడే ఇతర రాష్ట్రాల వలస కార్మికులను ఆయా సంస్థలు పనిలో పెట్టుకుంటున్నాయని కూడా మనం గమనిస్తున్నాం. నిజంగా స్థానిక యువతలో ఎంతమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరికాయో ప్రకటించడానికి ప్రభుత్వం దగ్గర నిర్దిష్ట గణాంకాలు కూడా లేవు. కార్మిక శాఖను నిర్వీర్యం చేయడం వల్ల, గత నాలుగేండ్లుగా రాష్ట్రంలో కనీస వేతనాలను కూడా సవరించడం లేదు. ఇప్పటికీ  అనేక రంగాల్లో నెలకు కేవలం రూ.10 వేలకు మాత్రమే కనీస వేతనాలుగా ఉన్నాయంటే, ఈ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు ఏ మేరకు పెరుగుతాయో మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీత భత్యాలను చూపించి మురుసుకునే వాళ్లు, రాష్ట్రంలో అన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో కాంట్రాక్ట్, క్యాజువల్ కార్మికులకు ఇప్పటికీ రోజూ రూ. 250 కంటే మించి వేతనాలు చెల్లించడం లేదని, మహిళా కార్మికులకు కూలీ రేట్లు ఇంకా తక్కువగా ఉంటున్నాయని, ఈ కార్మికులకు కార్మిక చట్టాలేవీ అమలు కావడం లేదని కూడా అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితులన్నిటినీ లోతుగా అధ్యయనం చేసినప్పుడే నిజంగా తెలంగాణ అభివృద్ధి నమూనా మనకు అర్థం అవుతుంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం శ్రామిక జనాభాలో10 శాతం కూడా కార్మికులుగా, ఉద్యోగులుగా సంఘటిత రంగంలో లేరు. మిగిలిన 90 శాతం అసంఘటిత రంగంలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి నమూనాలో, చర్చల్లో వీళ్ల సంక్షేమం భాగంగా లేదు.  బీడీ కార్మికులు, భవన నిర్మాణ, హమాలీ కార్మికులు, ఆటో, క్యాబ్, మోటార్  డ్రైవర్లు లాంటి వాళ్లు లక్షలాదిమంది శ్రామికులుగా, అసంఘటిత రంగంలో  జీవిస్తున్నారు. వారిని గుర్తించి, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం వద్ద కావాల్సిన విధి విధానాలు, పటిష్ట యంత్రాంగం లేవు.

పల్లె కుటుంబాల జీవనం
తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ 60 శాతం జనాభా జీవిస్తున్నది. సొంత భూమి ఉన్న వాళ్లకు మాత్రమే కొన్ని ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. కానీ మిగిలిన వారు ప్రభుత్వ అభివృద్ధి నమూనాలో భాగంగా లేరు. గ్రామీణ ప్రాంతంలో మెజారిటీ కుటుంబాలకు ఆదాయాలు తక్కువగా ఉన్నాయి. 93 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాయని ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఓ నివేదికలే బయట పెట్టాయి. వ్యవసాయ కూలీలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, పశు పోషకులు, మేకల, గొర్రెల పెంపకం దారులు, మత్స్య కారులు ఇలా అనేక సామాజిక వర్గాల కుటుంబాలు.. పెరిగిన ఖర్చులకు సరిపోను ఆదాయాలు లేక ఇబ్బంది పడుతున్నాయి. రేషన్ బియ్యం, ప్రభుత్వం ప్రతి నెలా ఇచ్చే పెన్షన్ లాంటి సహాయ పథకాల కోసం ఆశగా ఎదురు చూడటం, ఆయా కుటుంబాల ఆర్థిక దుస్థితిని బయట పెడుతున్నది. ఆయా సామాజిక వర్గాలు కొన్ని ప్రత్యేక సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. వాటిపై చర్చ జరగడం లేదు. రాష్ట్రంలో లక్షల మంది ఒంటరి, వితంతు మహిళల పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. అనేక కుటుంబాల్లో వృద్ధాప్యం మోయలేని భారంగా మారింది. మొత్తంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాలనా వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి.

నిరంకుశ విధానాలతో..
ఏకపక్ష, ఏక వ్యక్తి పాలన రాష్ట్రంలో ప్రజాస్వామిక వాతావరణాన్ని పూర్తిగా దెబ్బ తీసింది. ప్రజలతో, ప్రతిపక్ష రాజకీయ పార్టీలతో, ప్రజా సంఘాలతో, ఆయా రంగాల నిపుణులతో కనీస చర్చలు చేయకుండా ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు, రూపొందిస్తున్న విధానాలు, ప్రజలను, రాష్ట్రాన్ని కూడా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశాయి. వివిధ రూపాల్లో ప్రజలు ఈ ఏకపక్ష నిర్ణయాల బాధితులుగా ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరుగుతున్న నష్టాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి బీమా పరిహారం, ఇన్​పుట్ సబ్సిడీలు అందక రైతులు నిరాశలో కూరుకుపోయి ఉన్నారు.  2020 నుంచి భారీ వర్షాల వల్ల నష్ట పోయిన రైతులు, కాళేశ్వరం రిజర్వాయర్లు సృష్టిస్తున్న ముంపుతో ఏటా పంటలు కోల్పోతున్న రైతులే ఇందుకు సాక్ష్యం. సమగ్ర భూ సర్వే చేయకుండానే, రూపొందించిన ధరణి పోర్టల్​వల్ల వేదనకు గురవుతున్న రైతులు ప్రభుత్వ పాలనా వైఫల్యాన్ని చెప్పకనే చెబుతున్నారు. సరైన పంటల ప్రణాళిక లేక ఏటా మార్కెటింగ్ లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు మనం చూస్తున్నవే. దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్నా అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు అందని ఆదివాసీ రైతులు, రాష్ట్రంలో రెండు కౌలు రైతుల చట్టాలు ఉనికిలో ఉన్నా, ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ, కౌలు రైతులను గుర్తించకపోవడం వల్ల, తీవ్రంగా నష్ట పోతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న కౌలు రైతులు మన కళ్ళముందే ఉన్నారు. ప్రభుత్వ అభివృద్ధి నమూనా సృష్టిస్తున్న ఈ విధ్వంసాన్ని ఆయా రంగాల వారీగా లోతుగా పరిశీలించి ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలను బట్టబయలు చేయాలి. ముఖ్యమంత్రి పాలనా తీరు మారేలా ఒత్తిడి పెంచాలి.

రైతు స్వరాజ్య వేదిక

Leave a Reply