– 5 నుంచి 12శాతానికి పెంపు
– కుదేలు కానున్న చేనేత రంగం
– పేరుకుపోయిన వస్త్ర నిల్వలు
– పట్టించుకోని ప్రభుత్వం, టెస్కో
నల్లగొండ : వ్యవసాయ రంగం తర్వాత దేశంలో అత్యధికులకు జీవనోపాధి కల్పిస్తున్నది చేనేత రంగం. కానీ, కాలం గడుస్తున్న కొద్దీ ఈ రంగాన్ని పాలకులు పట్టించుకోవడం లేదు. చేసిన పనికి సరైన మార్కెటింగ్ సౌకర్యం.. గిట్టుబాటు ధర రావడం లేదు. ఉపాధి లేక కుటుంబాలు ఆత్మహత్య చేసుకుంటున్నాయి.. అయినా పాలకులకు చీమకుట్టినట్టుగా కూడా లేదు.. మొదటి నుంచీ పన్ను మినహాయింపులో ఉన్న ఈ రంగంపై జీఎస్టీ వేసిన మోడీ ప్రభుత్వం.. తాజాగా ఐదు నుంచి 12 శాతానికి పెంచడానికి నిర్ణయించింది. దీంతో ఈ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 86 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. అందులో సుమారు 30వేల మందికిపైగా సభ్యులున్నారు. సొసైటీలో సభ్యత్వం లేకుండా చేనేత రంగంలో స్థిరంగా పనిచేస్తున్న వారు మరో 15వేల మంది వరకు ఉంటారు. వీరంతా కలిసి నెలకు సుమారు రూ.3కోట్ల వరకు వస్త్ర ఉత్పత్తి చేస్తారని అంచనా. అందులో రూ.2కోట్లు సిల్క్, కోటి వరకు కాటన్ ఉత్పత్తులు ఉంటాయి. సంప్రదాయమే కాక, మారుతున్న అభిరుచులకి, జాతీయ అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకి అనుగుణంగా తమ కళను, నైపుణ్యాన్ని మార్చుకుంటూ వస్తున్నారు చేనేత కళాకారులు. అయితే, ప్రస్తుతం ఏ సోసైటీ కూడా సభ్యులకు ఉపాధి కల్పించే పరిస్థితి లేదు.
రూ.100కోట్ల వరకు పెరిగిన నిల్వలు
చేనేత రంగానికి అండగా ఉంటామని చెప్పే పాలకులు చేనేత కార్మికులకు మొండి చేయి చూపిస్తున్నారు. సంఘాల ద్వారా కార్మికులకు పనిచేప్పాల్సిన బాధ్యత టెస్కో సంస్థది. దానికి అండగా ఉండాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఏ ఒక్క కార్మికుడికీ పని చూయించడం లేదు. అయితే, కార్మికులే సొంతంగా బట్టలు తయారు చేస్తున్నారు. వాటిని కొనుగోలు చేసి, ఉపా ధికి పరోక్షంగా సహకరించాల్సిన పాలకులు పట్టించుకో వడం లేదు. చేనేత సహకార సంఘాల్లో పేరుకుపోయిన వందల కోట్ల వస్త్ర నిల్వలను రాష్ట్ర ప్రభుత్వ సంస్థ టెస్కో కొనుగోలు చేయకపోవడంతో సంఘాలు నష్టాల్లో కూరు కుపోయాయి. దాదాపు ఇప్పటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే రూ.100కోట్ల ఉత్పత్తుల నిల్వలు పేరుకుపోయా యి. ముడి సరుకుల ధరలు రెట్టింపయ్యాయి. సిల్కు యార న్‌తోపాటు రంగులు, రసాయనాల ధరలు విపరీతంగా పెరిగాయి. పెరిగిన నూలు ధరలకు అనుగుణంగా చీరల ధరలు పెంచితే మార్కెట్లో కొనుగోలుదారులు వస్త్రాలను కొనలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో చేనేత రంగంపై ఐదు నుంచి 12శాతం జీఎస్టీని విధించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధమైంది.
జీఎస్టీ పెంపుతో అదనపు భారం
మొదటి నుంచి చేనేత కార్మికుల ఉత్పత్తులపై పన్ను లేదు. వాజ్‌పేరు ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో చేనేత ఉత్పత్తులపై 9.5శాతం పన్ను విధించారు. దాంతో ఆ రంగానికి సంబంధించిన నాయకత్వం కేంద్ర ప్రభుత్వానికి సమస్యలను వివరించడంతో దానిని రద్దు చేశారు. ఇక ఆ తర్వాత ఏ ప్రభుత్వం కూడా పన్ను విధించలేదు. అయితే, మోడీ అధికారంలోకి వచ్చాక చేనేత రంగాన్ని జీఎస్టీ పరిధిలోకి తేవ డంతో ఒక్కసారిగా పన్నుల భారం పెరిగిపోయింది. మొద ట్లో ఈ రంగంపై మొదట్లో 5శాతం జీఎస్టీ విధించగా, ఇప్పు డు మరో 7శాతం పెంచి మొత్తంగా 12శాతం జీఎస్టీని చేనే త రంగంపై విధిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వచ్చే జనవరి ఒకటో తేదీ నుంచి అమలు కానున్నట్టు అందు లో పేర్కొన్నారు. కేవలం చీరలపైనే కాకుండా చేనేత రంగా నికి అనుబంధంగా ఉన్న వాటిపై కూడా జీఎస్టీ అమలు చేస్తున్నారు. నూలు, రంగులు, రసాయనాలు, తయారైన వస్త్రాలపైనా జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఇప్పటికే ఉత్ప త్తులు కొనుగోళ్లు లేక.. పని లేక అల్లాడుతున్న కార్మికులకు జీఎస్టీ అగాధంలోకి నెట్టేసేలా ఉంది. దానివల్ల ప్రయివేటు కొనుగోళ్లు కూడా పెద్దఎత్తున తగ్గే అవకాశం ఉంది.
ఉపాధిలేక 300చేనేత కార్మికుల ఆత్మహత్య
ఉపాధి లేదు.. ప్రభుత్వ సహకారం లేదు చేసిన ఉత్పత్తు లను కొనుగోలు చేసే దిక్కులేదు.. ఈ క్రమంలో వచ్చిన కరోనా వారిని నిలువునా కుంగదీసింది. ఇక కార్మికుల ఆర్థిక పరిస్థితి వర్ణనాతీతం.. వీటన్నింటినీ తట్టుకుని నెట్టుకొస్తున్న కార్మిక కుటుంబాలు.. చివరకు ఆత్మహత్య చేసుకుంటున్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 300 మంది చేనేత కార్మికులు ఇప్పటికే తనువు చాలించారు. కనీసం చనిపోయిన తర్వాతనైనా ఆ కుటుంబానికి తోడుగా ఉంటామన్న భరోసా ప్రభుత్వం నుంచి రాలేదు. కుటుంబ యజమానిని కోల్పోయి రోడ్డున పడిన వారి పిల్లలకు కనీసం విద్య, వైద్యం కూడా రాయితీ కల్పించలేదు.
Courtesy Nava Telangana