పాల ఉత్పత్తులపై జిఎస్‌టి వద్దు

0
209

వి. కృష్ణయ్య,

దేశవ్యాపితంగా 9 కోట్ల మంది పేద రైతులు పాడిని నమ్ముకుని బతుకుతున్నారు. అందులో 75 శాతం మంది మహిళలే. ఇలాంటి రంగంలో కూడా పేదల జీవనాన్ని దెబ్బ తీసేటట్లుగా పెరుగు, మజ్జిగ, లస్సీ, వెన్న లాంటి పాకెట్లు అమ్మితే 5 శాతం టాక్స్‌…పాలు పితికే యంత్రాలు, నిల్వ చేసి కూలింగ్‌ చేసే యంత్రాలపై 12 శాతం నుండి 18 శాతం టాక్స్‌ కొత్తగా కేంద్ర మోడీ ప్రభుత్వం వేసింది. ఎలాంటి ప్రజాభిప్రాయం కాని, పార్లమెంట్‌లో వివిధ పక్షాల అభిప్రాయాలు గాని వినకుండానే ఈ నెల 18వ తేదీ నుండి వసూలు చేయడం అప్రజాస్వామ్యం. మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేకమైన ప్రభుత్వమని మరోసారి రుజువు చేసుకుంది.

ఈ బలవంతపు టాక్స్‌ వల్ల పాల ఉత్పత్తులను వినియోగించుకునే ప్రజలపై కూడా అనివార్యంగా భారం పడుతున్నది. ఈ చర్యతో పేద మధ్యతరగతి ప్రజానీకానికి కొద్దో గొప్పో అందుబాటులో ఉన్న పౌష్టికాహారం దూరం కానున్నది. పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్న దశలో ఈ భారం సాధారణ ప్రజానీకానికి చాలా కష్టతరమైనది.

ఒకటి రెండు గేదెలతో ప్రారంభమై 100 గేదెలు సాకుతున్న వాళ్ళకు కూడా అన్ని ఖర్చులు పెరిగి గిట్టుబాటు కావడం లేదు. ఈ రంగంలో 2014 నుండి ఇప్పటివరకు చూస్తే గిట్టుబాటు కాక 55 లక్షల చిన్న, మధ్యతరగతి రైతులు ఈ రంగంను వదిలివేశారు. కేరళ ఎల్‌.డి.ఎఫ్‌ ప్రభుత్వం ఉపాధి పథకం కింద పట్టణ పేదలు ఆవులను పెంచుకొని రోజుకు 10 లీటర్ల చొప్పున 100 రోజుల పాటు సొసైటీ కేంద్రానికి పాలు పోస్తే సంవత్సరానికి రూ.34 వేలు చెల్లిస్తున్నది. ఈ పద్ధతి దేశవ్యాపితం కావాలి.

కొత్త విధానం ప్రకారం 25 లీటర్లు అంతకన్నా ఎక్కువ మొత్తంలో సింగిల్‌ పాకెట్‌ పాలు, ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేసిన వ్యాపారస్థులకి ఎలాంటి జిఎస్‌టి చార్జీలు అదనంగా ఉండవు కాని… విడివిడి పాకెట్లపై 5 శాతం టాక్స్‌ ఉంటుంది. ఇది చిన్న వ్యాపారస్థులని, వినియోగదారులని దెబ్బతీస్తుంది.
పాల ఉత్పత్తులపైన, పరికరాల పైన జి.ఎస్‌.టి ని విధించడం వలన పాలు, పెరుగు, మజ్జిగ పాకెట్ల వినియోగదారులపై భారం పడుతుంది.

పాల సొసైటీలకు పన్నుల భారం, కన్వర్షన్‌ ఖర్చులు పెరగడం భారం అవుతుంది. రైతులకు చెల్లించే బోనస్‌ ఇవ్వలేని స్థితి ఏర్పడుతుంది.

పాడి సొసైటీలు బోనస్‌ చెల్లించకపోతే రైతులకు గిట్టుబాటు కాదు. సొసైటీలు మూత పడితే రైతులు పాలు అమ్ముకోలేక జీవనం కోల్పోతారు.

పాలు పితికే యంత్రాలపై గాని, పాల మిషనరీలపై 12 శాతం నుండి 18 శాతం టాక్స్‌ అదనంగా ఉంటుంది. అంటే ఇప్పటికే సంక్షోభంలో ఉన్న పాల సొసైటీ వ్యవస్థలపై మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా అవుతుంది.

పశువుల ద్వారా మరియు పాల ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయం మొత్తం వ్యవసాయ రంగంలో వచ్చే ఆదాయంలో నాల్గవ వంతు ఉన్నది. ఇది గణనీయమైనది. ఇది దెబ్బ తింటే పాల రంగంలో జీవనం సాగిస్తున్న 9 కోట్ల పేదలపై చాలా నష్టదాయకమైన ప్రభావాన్ని చూపుతుంది. మోడీ ప్రభుత్వం ధనికుల మీద డైరెక్ట్‌ టాక్స్‌ పెంచే బదులు రైతులు, కార్మికులు, కష్టజీవులందరి మీద పరోక్ష పన్నులు పెంచుతోంది. ఈ కార్పొరేట్‌ అనుకూల విధానాలే ధరల పెరుగుదలకు, నిరుద్యోగం పెరగడానికి, దారిద్య్ర వ్యాప్తికి ఫలితంగా మోజారిటీగా ఉన్న కష్టజీవులు ఇంకా దోపిడీకి గురవ్వడానికి కారణం అవుతున్నది.
కేంద్ర ప్రభుత్వం ఎలాంటి టాక్స్‌ లేకుండానే విదేశీ, కార్పొరేట్‌, పెట్టుబడిదారులు పాల పొడి, పాలు, పాల ఉత్పత్తులు దేశంలో అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు. దీని ఫలితం దేశంలోని పేద పాడి రైతుల పొట్ట కొట్టడమే. ఇప్పటికైనా కొత్త జిఎస్‌టి విధానాన్ని ఉపసంహరించుకోవాలి. పాల ఉత్పత్తిదారుల పైన, కొనుగోలుదారుల పైన ఈ భారం పడకుండా పేదలను ఈ భారం నుండి బయడ వేయాలంటే ప్రభుత్వం జిఎస్‌టి పెంపును వెనక్కి తీసుకోవాలి. పాడి రైతులు ఉద్యమించాలి. రైతు సంఘాలు, ట్రేడ్‌ యానియన్‌లు ప్రజా సంఘాలు, ప్రజలు ఈ పోరాటానికి మద్దతునివ్వాలి.
డిమాండ్లు ఇవీ…

  • పాలు, లస్సీ, పెరుగు, మజ్జిగ పాకెట్లపై జిఎస్‌టి ఉపసంహరించుకోవాలి. – కేరళ తరహాలో 2 గేదెలు లేదా ఆవులు పెంచుకునే రైతులను ఉపాధి హామీలో చేర్చాలి.
  • రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన లీటరుకు రూ.4 బోనస్‌ వెంటనే అమలు చేయాలి. అన్ని రకాలుగా పాడిరైతులను ఆదుకోవాలి.

ఆంధ్రప్రదేశ్‌ పాల ఉత్పత్తిదారుల సంఘం

Leave a Reply