- స్వీయ నిర్బంధంలోనూ వ్యాపిస్తున్న వైరస్
- ఇరుకైన గదుల్లో పాటించని భౌతిక దూరం
- దుబాయ్‌లో భారత కార్మికులకు పాజిటివ్
- ఆంక్షల మధ్య నివసిస్తున్న తెలుగు వారు
- ఖతర్‌లో తెలుగు వారి దిగ్బంధం
- బహ్రెయిన్‌లో 100 మంది మనోళ్లకు వైరస్
గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లిన ప్రవాస భారతీయులకూ కరోనా కష్టాలు తప్పడం లేదు. దుబాయ్, కువైత్, బహ్రెయిన్, ఖతర్, సౌదీ అరేబియా తదితర దేశాల్లో స్వీయ నిర్బంధంలో ఉన్నప్పటికీ వైరస్ సోకుతోంది. దీనికి ప్రధాన కారణం అక్కడి లేబర్ క్యాంపుల్లోని ఇరుకైన గదులేనని అధికారులు గుర్తించారు. విదేశీ కార్మికులు నివసించే ఈ క్యాంపుల్లో భౌతిక దూరం పాటించడం అసాధ్యమని నిర్ధారణకు వచ్చారు. దుబాయ్‌లో అల్‌రాస్, నాయిఫ్ ప్రాంతాల్లో నివసిస్తున్న భారతీయ ఉద్యోగుల్లో చాలా మందికి పాజిటివ్ రావడంతో వీరిని క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. అల్‌ఖోజ్, బర్ దుబాయ్, జబల్ అలీ ప్రాంతాల్లో భారీ స్థాయిలో నివసిస్తున్న తెలుగు కార్మికులంతా ఆంక్షల మధ్య నివసిస్తున్నారు.
ఖతర్‌లోనూ తెలుగు కార్మికులు భారీ సంఖ్యలో నివసిస్తున్న సనయ్యా ప్రాంతంలో పూర్తి దిగ్బం ధం కొనసాగుతోంది. కువైత్‌లోని కరోనా బాధితుల్లో భారతీయ కార్మికులే ఎక్కువగా ఉండటంతో కువైతీలు కన్నెర్ర చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రవాసీయులు ఎక్కువగా నివసిస్తున్న మహెబులా ప్రాంతాన్ని కువైత్ సైన్యం దిగ్బంధం చేసింది. మహెబులాలో బిహార్‌కు చెందిన ప్లంబర్‌కు తొలుత కరోనా సోకింది. తర్వాత మరింత మంది భారతీయులకు వైరస్ వ్యాపించడంతో వారి క్యాంపులోని వారిని ఆస్పత్రికి తరలించారు. బహ్రెయిన్‌లో 100 మంది భారతీయులు కోవిడ్-19 బారిన పడ్డారు. సౌదీ అరేబియాలో రియాద్, దమ్మామ్, హోఫుఫ్, జెద్దా, తైఫ్, ఖోబార్ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.
Courtesy Andhrajyothi