వీడియోలతో బెదిరింపులు

0
192

మూడేళ్లు చిత్రవధ అనుభవించిన విద్యార్థిని

గుంటూరు: ఓ యువతికి మత్తుమందు ఇచ్చి, నగ్నంగా వీడియో తీసి, బెదిరింపులకు పాల్పడిన ఘటనలో ఇద్దరు యువకులను గుంటూరు అర్బన్‌ పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి, కథనం ప్రకారం మూడేళ్ల కిందట గుంటూరుకు చెందిన 17 ఏళ్ల విద్యార్థినికి (ఇప్పుడు 20 సంవత్సరాలు) అదే ప్రాంతానికి చెందిన వరుణ్‌ పరిచయమయ్యాడు. స్నేహం ముసుగులో ఆమెను చదువుకుందాం రమ్మంటూ తన అపార్టుమెంట్‌కు తీసుకెళ్లి శీతలపానీయంలో మత్తుమందు కలిపిచ్చాడు. తర్వాత ఆమెను నగ్నంగా వీడియో తీశాడు. దాన్ని అడ్డుపెట్టుకొని బెదిరించే ప్రయత్నం చేయగా యువతి అతన్ని దూరం పెట్టింది.

ఇంతలో ఆమె ఇంజినీరింగ్‌ కళాశాలలో చేరగా అక్కడ మరో యువకుడు కౌశిక్‌ పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అతని కుటుంబ సభ్యులు కళాశాలకు వెళ్లి వాకబు చేసి వరుణ్‌ గురించి తెలుసుకున్నారు. అతనితో మాట్లాడంతోపాటు వీడియోలను తీసుకొచ్చి కౌశిక్‌కు చూపించగా ఆమెతో సంబంధాన్ని వదులుకున్నాడు. ఆ యువతి మూడో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని అనుమానించిన కౌశిక్‌ తనవద్ద ఉన్న నగ్న వీడియోలను ఇంటర్నెట్‌లో పెట్టి ఆమెను డబ్బులివ్వాలని బెదిరించాడు. విషయం తెలిసిన యువతి బంధువులు వరుణ్‌, కౌశిక్‌ కుటుంబ సభ్యులను కలిసి వాటిని ఇంటర్నెట్‌ నుంచి తీసివేయించారు.

సమస్య తొలగిపోయిందని అనుకుంటుండగానే కొద్ది రోజుల కిందట సామాజిక మాధ్యమంలో వీడియో ప్రత్యక్షమవడంతో యువతి హతాశురాలైంది. దాదాపుగా మూడేళ్లుగా వేధింపులకు గురైన బాధిత యువతి అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డికి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో వరుణ్‌, కౌశిక్‌లను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులు వరుణ్, కౌశిక్‌తో పాటు మరో ఇద్దరు యువతులకు ఈ కేసులో ప్రమేయమున్నట్టు వెల్లడైండి.

Courtesy Eenadu

Leave a Reply