దేశం పేరుతో ద్వేషం, గతం పేరుతో విషం!

0
144
కె. శ్రీనివాస్

ఒకఫోటో, దాని కింద ఇంకో ఫోటో. కర్ణాటకలోని బేలూరులోని చెన్నకేశవస్వామి గుడి. 1868లో ఎడ్మండ్ డేవిడ్ ల్యాన్ అనే ఒక విదేశీ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో మొదటిది. ఈ ఫోటోలో పెద్ద గోపురం, దాని కింద గుడి ఉన్నాయి. రెండో ఫోటో అక్షత ఇనామ్ దార్ అనే భారతీయ ఫోటోగ్రాఫర్ 2014లో తీసినది. అందులో గోపురం లేదు. కేవలం గుడి మాత్రమే ఉన్నది. ‘‘జస్ట్ అనదర్ యేన్షియంట్ రాక్స్’’ అన్న ఫేస్‌బుక్ పేజీలో ఆ ఫోటో ప్రచురించారు. ఆ పేజీ అంటే మనకు ఆసక్తి ఉంటుందనుకుని ఉచితంగా ఉదారంగా ఫేస్‌బుక్ వాడకం దారులందరికీ పోస్ట్ చేస్తుంటారు. ఆ పోస్ట్ కింద అనేక వ్యాఖ్యలు. అందులో ఒక పురాతన పూనకాల మనిషి ‘‘అవురా, ఘజ్నీ ఘోరీల దుర్మార్గము!’’ అని కామెంట్ పెట్టాడు. వెంటనే కొందరు సదరు దురాక్రమణదారులు, అనంతర ఆక్రమణదారులు చేసిన విధ్వంసాల గురించి ఆవేశంతో వ్యాఖ్యలు చేశారు. పాపం, ఒక పెద్ద మనిషి ‘‘ఘజ్నీ ఘోరీలది ఏ కాలం అనుకుంటున్నారు’’ అని వినయంగా ప్రశ్నించాడు. ఆవేశంలో ఉన్న వ్యాఖ్యాకారులంతా పాపం ఆయన మీద ఎగబడిపోయి, అతని జన్మ గురించి, అందులోని అక్రమత్వం గురించి, దేశభక్తి జాతిభక్తి గురించి రకరకాల ప్రశ్నలు, వ్యాఖ్యలు సంధించారు. ఇంతలో ఎవరో ఆర్కియాలజీ ఆయన కల్పించుకుని, మొదట చెక్కతో చేసిన గోపురం ఉండేదని, తరువాత ఇటుకలతో కట్టారని, శిల్పాలు శిలానిర్మాణాలున్న గుడిని రక్షించడం కోసం ఆ ఇటుక గోపురాన్ని తొలగించవలసి వచ్చిందని చెప్పడంతో కొంత సద్దుమణిగింది.

అటువంటి పోస్టులు ఎవరు చదువుతారు, ఎవరు చర్చిస్తారు అనుకుంటాము కదా, కానీ, వందలాది కామెంట్లు వేలాది లైకులు ఉన్న పోస్టు అది. ఫేస్‌బుక్‌లో ఇప్పడు బాగా గిరాకీ ఉన్న అంశాలు పురాతత్వం. చరిత్ర. జనరంజక విధానంలో చరిత్రను, భౌతిక శాస్త్రాలను చెప్పాలని పెద్దలు అంటుంటారు. కొందరు ప్రయత్నాలు కూడా చేశారు. కానీ, ఇది ఆ రకం శాస్త్రీయ ప్రచారం కాదు. చరిత్రను వీధి తగవుగా, ఆవేశకావేశాల అంగడిగా మార్చే వ్యవహారం. వాటిని చదువుతుంటే, అడ్రెనలైన్ అంటుంటారు కదా, తీవ్ర ఉద్వేగరసం, అది ఒంట్లో పరవళ్లు తొక్కుతూ ఉంటుంది. పోస్టులలో సాంకేతికంగా అబద్ధాలు ఉండకపోవచ్చు. వాస్తవాలే ఉండవచ్చు కానీ, వాటిని చదివినవారిలో ఒక అబద్ధపు ఉన్మాదం తన్నుకువస్తూ ఉంటుంది.

కొన్ని మనోభావాలను, ఆవేశాలను తయారుచేసి, వాటిని మల్టీ లెవల్ మార్కెటింగ్ చేసే పద్ధతి సామాజిక మాధ్యమాలు వచ్చిన తరువాత ఉధృతమైంది తప్ప, మూలాలు మునుపే ఉన్నాయి. ఈ ఉత్తరం వందసార్లు రాసి పోస్టు చేయకపోతే నీకు కీడు జరుగుతుంది, చేస్తే నీకు లాభం జరుగుతుంది తరహా కార్డులు, కరపత్రాలు గతంలో ఉండేవి. అదొక నెట్ వర్క్. ఇప్పుడది సమాచార సాంకేతిక వాహనం మీద సవారీ చేస్తున్నది. ట్విట్టరు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటివి ఉండగా, వాట్సాప్‌కు మాత్రమే కీర్తిప్రతిష్ఠలు, విశ్వవిద్యాలయ హోదా ఎందుకు వచ్చాయంటే, అది క్షేత్రస్థాయి మాధ్యమం. ప్రతి ఒక్కరినీ స్పృశించే వేదిక. అన్నిటికి మించి ఈ కొస నుంచి ఆ కొస దాకా గోప్యతను హామీ ఇవ్వడం వల్ల లభిస్తున్న రక్షణ. ఫేస్‌బుక్‌లో తయారయ్యే సరంజామాను పంపిణీ చేయడానికి వాట్సాప్ ఒక యోగ్యమైన వేదిక. అందుకే జూకర్ బర్గ్ వాట్సాప్‌ను తమ సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. ఫేస్‌బుక్ పోస్టులను మూలమూలలకు బట్వాడా చేయడమే కాకుండా, సొంతంగా కూడా వాట్సాప్ తన గ్రూపుల ద్వారా వ్యక్తిగత ఖాతాల ద్వారా అపారమైన విషయసంపదను సృష్టించగలదు. ఫేక్ న్యూస్‌ను, పరమ నాటు అజ్ఞానాన్ని కత్తిరించి అతికించి మసిపూసి మార్పులు చేసిన ఫోటోలను వ్యాపింపజేసినందుకు వాట్సాప్ యూనివర్సిటీ అన్న బిరుదును పాత్రికేయుడు రవీశ్ కుమార్ ఇచ్చారు. ఈ మాధ్యమాలు చేస్తున్న అపకారాల తీవ్రతపై అది వ్యంగ్య వ్యాఖ్య మాత్రమే తప్ప, వీటి వల్ల సానుకూల ప్రయోజనం అసలే లేదని, ప్రజలకు వ్యక్తీకరణ అవకాశాల లభ్యత పెరగలేదని కాదు. దురదృష్టవశాత్తూ, సామాజిక మాధ్యమాల వెసులుబాటును అసత్యవాదులు అధికంగాను, సమర్థంగాను ఉపయోగించుకుంటున్నారు.

వ్యక్తిగత చాపల్యాల వల్ల పోస్టు చేసే అబద్ధాల సంఖ్య అతి తక్కువ. ప్రయోజనాన్ని ఆశించి, పెట్టుబడి పెట్టి మరీ అబద్ధాలని వ్యాపింపజేసే శక్తుల వీరంగమే ఎక్కువ. దృశ్యపరంగా నమ్మించడానికి మార్ఫింగులు ఎడిటింగులు వగైరా చేసినట్టే, రాసిన రాతలను జనం నమ్మడానికి ప్రతిష్ఠాత్మకమైన పేర్లు జోడిస్తారు. బిబిసి ఇట్లా అన్నది, ఫలానామంత్రాన్ని నాసా వాళ్లు శక్తిశాలిగా గుర్తించారు, ఫలానా ముస్లిమ్ దేశం భారత ప్రధాని పేరిట స్టాంపు విడుదల చేసింది, ఒక అమెరికన్ పురాతత్వ చరిత్రకారుడు ఆర్యుల రాకడ అబద్ధమన్నాడు.. ఇటువంటి వాటిని ప్రచారం చేయడం ఒక ఎత్తు. ఇప్పుడు నిజానిజాలను నిర్ధారించే ఫ్యాక్ట్ చెక్ సంస్థలు వచ్చి, అబద్ధాలను వెంటనే ఖండిస్తున్నాయి. మార్పిడి ఫోటోల మర్మాన్ని కూడా తెలియజేస్తున్నాయి. సోషల్ మీడియాను ఆవేశకావేశాల కోసం వినియోగించుకునేవారు ఇప్పుడు ఒక మెట్టు పైకెక్కి, అబద్ధాల మీద ఆధారపడడం తగ్గించారు. సమాజక్షేత్రంలో బలపడుతున్న భావాలను, మనోభావాలను మరింతగా బలపరిచే దృశ్య, పాఠ్య అంశాలను ఫేస్‌బుక్ పోస్టుల ద్వారా అందిస్తున్నారు. అవి వాట్సాప్‌ ద్వారా లక్షలాది గ్రూపులలో చక్కర్లు కొడుతుంటాయి. పరిమితమైన చదువు, ఎదిగీఎదగని వివేచన, లోకజ్ఞానం లేమి.. ఈ లక్షణాలున్న జనాన్ని సులువుగా ఆకట్టుకుని, కొత్త విషయాన్ని, కొత్త వాదనను అందుకుంటున్నామన్న కుహనా సంతృప్తిని ఈ పోస్టులు వారిలో కలిగిస్తాయి.

‘‘మన దేశానికి ఎంతో చరిత్ర ఉన్నది. ఆ చారిత్రక దశలో మనకు గొప్ప కళా నైపుణ్యం ఉన్నది. ఆ శిల్పాలను చూస్తే వారి నైపుణ్యానికి అబ్బురపడతాము. అవన్నీ దురాక్రమణదారులు నాశనం చేశారు. శాస్త్రవిజ్ఞానంలో కూడా మనమే నిష్ణాతులము. మనలను చూసే విదేశీయులు రేఖాగణితాన్ని, ఖగోళశాస్త్రాన్ని నేర్చుకున్నారు. టెలిస్కోపు మనకు ముందే తెలుసు. ఈ విషయాలన్నీ మనకు తెలియకుండా నెహ్రూ, సోషలిస్టులు, కమ్యూనిస్టులూ, సెక్యులరిస్టులు దాచిపెట్టారు. మన దేశానికి ఏమన్నా గొప్పతనం ఉన్నదంటే వారికి సహించదు. విదేశీయుల శాస్త్రవిజ్ఞాన ప్రతిభలో చౌర్యం ఎంతో ఉన్నది. హరప్పా మొహంజొదారో కూడా  భారతీయుడే కనిపెట్టాడు కానీ, ఇంగ్లీషు అధికారి తన ఖాతాలో వేసుకున్నాడు. అసలు ఈ పరిశోధనలు అన్నీ బూటకం, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్లకు అనుకూలంగా పరిశోధనల ఫలితాలు ఉంటాయి. చరిత్రలో భారతీయుల గొప్పతనాన్ని రాయకుండా, మన పాఠ్యపుస్తకాల రచయితలకు పాకిస్థాన్ వాళ్లు డబ్బులిచ్చారు…’’ ఇట్లా ఉంటాయి ఈ పురాతత్వ, చరిత్ర పేజీలలో అభిప్రాయాలు. మన దేశం గొప్పతనాన్ని అంగీకరించడానికి ఎవరికి అభ్యంతరం ఉంటుంది? మన శిల్పాలు, నిర్మాణాలు ఇప్పుడు కొత్తగా తెలిసిన చరిత్రా? భారతీయ శిల్పకళా కౌశలాన్ని చూసి ముగ్ధులు కాకుండా ఎవరు ఉంటారు? వీరు చూపిస్తున్న ఫోటోలన్నీ వందా నూటాయాభై ఏళ్ల నుంచి ప్రచారంలో ఉన్నవే కదా? ఆర్యభట్టును, భాస్కరాచార్యుడిని ఎవరైనా ఎందుకు విస్మరిస్తారు? ఈ గొప్పదనాలన్నిటి గురించి పాఠ్యపుస్తకాలలో చదువుకుంటూనే ఉన్నాము కదా? కొనసాగింపు ఎందుకు జరగలేదు అన్న ప్రశ్న వేసుకోకుండా, అన్నీ వేదాల్లోనే ఉన్నాయని, గతమెంతో గొప్పదని అక్కడే నిలిచిపోలేము కదా? శాస్త్ర విజ్ఞానంలో, ఆధునిక అభివృద్ధిలో మన వర్తమానం ఏమంత ఘనం కాదని అంగీకరించకపోతే, పురోగతి ఎక్కడ? చివరకు కరోనా ఉపద్రవం సమయంలోనూ ఈ అసత్యవాదులు తమ అరకొర సందేశాలతో సృష్టించిన కల్లోలం చిన్నదా?

కానీ, భారతీయ మహత్తును, పురాతన చరిత్రలోనే కాదు, ఇటీవలి చరిత్రలోనూ విస్మరించారని, నిజమైన స్వాతంత్ర్యయోధులను దేశభక్తులను గుర్తించి గౌరవించలేదని పై కథనాల కొనసాగింపు ఉంటుంది. ఇప్పుడున్న పాఠ్యపుస్తకాల మీద, చరిత్ర గ్రంథాల మీద, పరిశోధకుల మీద అపనమ్మకాన్ని కలిగించి, తాము రూపొందిస్తున్న కొత్త చారిత్రక కథనాన్ని వ్యాపింపజేయడమే వాట్సాప్ యూనివర్సిటీ మేధావుల ఉద్దేశ్యం. భారతదేశానికి గొప్ప భౌతిక శాస్త్రాల చరిత్రా, భౌతికవాదపు చరిత్రా కూడా ఉన్నాయి. మన శాస్త్రజ్ఞుల ఆవిష్కరణలు ఆధునిక శాస్త్రవిజ్ఞానంతో సంగమించకుండా నిరోధించినదేమిటి, ఆయుర్వేదానికి ఆధునిక వైద్యానికీ నడుమ అగాధానికి కారణమేమిటి? ఈ వాట్సాప్ విద్యావేత్తల మహాపోషకులు మాత్రం భారతీయ శాస్త్రవిజ్ఞానాన్ని ఆధునికీకరించడానికి చేస్తున్న కృషి, పెడుతున్న పెట్టుబడులు ఏమిటి? మనము, పరాయి అన్న ద్వంద్వాన్ని మొరటుగా నిర్వచించడానికి, చారిత్రక స్థలాల శిథిలాలను చూపించి భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి తప్ప వీరి సాంస్కృతిక వారసత్వపు హోరు ప్రయోజనమేమిటి?

అసత్యమే కాదు, సత్యంలాగా అభినయించే అర్ధసత్యానికి కూడా దూరంగా ఉండాలి. మనలో ద్వేషాన్ని పోషించే అక్షరాన్ని, దృశ్యాన్ని అనుమానించాలి.

Courtesy Andhrajyothi

Leave a Reply