ఎర్రమంజిల్‌ను కూల్చొద్దు!

0
239
 • అసెంబ్లీ కోసం దాన్ని పడగొట్టొద్దు
 • రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం చెల్లదు
 • తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
 • చట్టాలను విస్మరిస్తే జోక్యం చేసుకుంటాం
 • దొడ్డిదారిన సాధించే ప్రయత్నాలు వద్దు
 • విలాసాలకు వారసత్వ భవనాలు కూల్చొద్దు
 • వాటిని సంరక్షించే బాధ్యత ప్రభుత్వానిదే
 • రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం హితవు

నగర చరిత్రకు సాక్ష్యంగా నిలిచే వారసత్వ కట్టడాల గుర్తింపును రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. 1972లో ప్రపంచ దేశాల ఒడంబడిక ప్రకారం అది ప్రభుత్వ విధి. రాజ్య విలాసాల కోసం పురాతన భవనాలను కూల్చి ప్రజల చిరకాల స్మృతులను చెరిపివేయరాదు.-ధర్మాసనం

హైదరాబాద్‌, సెప్టెంబరు 16 ఎర్రమంజిల్‌ కేసులో తెలంగాణ సర్కారుకు చుక్కెదురైంది. ఎర్రమంజిల్‌ ప్యాలె్‌సను కూల్చివేసి, దాని స్థానంలో కొత్తగా శాసనసభ, శాసనమండలి సమావేశమందిరాలను నిర్మించాలని ఈ ఏడాది జూన్‌ 18న రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. మంత్రిమండలి నిర్ణయాన్ని రద్దు చేసింది. ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాలపై న్యాయసమీక్ష చేసే అధికారం పరిమితమే అయినప్పటికీ చట్టాలను విస్మరించి నిర్ణయం తీసుకుంటే అది విధాన నిర్ణయమైనా జోక్యం చేసుకుంటామని స్పష్టం చేసింది. ఇలాంటి సందర్భాల్లో కోర్టులు జో క్యం చేసుకుని న్యాయసమీక్ష చేయడం ద్వారా సరి చేస్తాయని తేల్చిచెప్పింది. ఎర్రమంజిల్‌ వ్యవహారం లో చట్టంలోని ప్రాథమిక అంశాలను విస్మరించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. తెలంగాణ సర్కారు చట్టాలను ఎక్కడ ఉల్లంఘించిందో విపులీకరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు తుది ఆదేశాలు జారీచేసింది.

సర్కారు ఉల్లంఘనలు ఇవే

Telangana, High Court, judgement, no, to, Yerram Manzil ,demolition, heritage, protection, new, assembly, building, KCR, government

 • పట్టణ ప్రాంతాల చట్టం 59వ సెక్షన్‌కు అనుగుణంగా 1981లో రూపొందించిన జోనల్‌ రెగ్యులేషన్‌ 13ను ప్రభుత్వం విస్మరించింది. జోనల్‌ రెగ్యులేషన్‌ 13ను వెనక్కితీసుకునే/తొలగించే అధికారం హెచ్‌ఎండీఏ వద్ద ఉంది. దాన్ని విస్మరించి ప్రభుత్వం తొలగించింది. ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చట్టసమ్మతం కాదు.
 • వారసత్వ భవనాలు, వారసత్వ స్థలాలను హైదరాబాద్‌ మాస్టర్‌ప్లాన్‌-10లో ప్రత్యేక ఆరక్షితజోన్‌ లో చేర్చారు. వీటిని ప్రభుత్వం దాటవేసింది.
 • హెచ్‌ఎండీఏ చట్టాన్ని తెచ్చిన లక్ష్యాన్ని ప్రభు త్వం విస్మరించింది. చట్టంలోని 18వ సెక్షన్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు చేయాలంటే ఈ నిబంధనలు పాటించాలని చట్టంలోని 15(3) సెక్షన్‌ చెబుతోంది.
 • ప్రత్యేక ఆరక్షిత జోన్‌లోని భూవినియోగాన్ని మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా మార్చాలంటే హెచ్‌ఎండీఏ చట్టంలోని 19వ సెక్షన్‌ను పాటించాలి. దాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు.
 • జోనింగ్‌ రెగ్యులేషన్స్‌-1981లోని రెగ్యులేషన్‌ 13ను 2015లో వెనక్కు తీసుకున్నామనే తప్పు డు అభిప్రాయంతో ‘రక్షిత భవనాల’ జాబితా నుంచి వాటిని తొలగించేనట్లేనని ప్రభుత్వం భా వించింది. దీన్ని జోనింగ్‌ రెగ్యులేషన్స్‌ 2010లోని రెగ్యులేషన్స్‌ 9(ఎ)(2)లో చేర్చిన అంశాన్ని విస్మరించింది. రెగ్యులేషన్‌ 13ను తొలగిస్తూ 2015లో ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ అది జోనింగ్‌ రెగ్యులేషన్స్‌ 2010లో సజీవంగా ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం విస్మరించింది. 2010 మాస్టర్‌ ప్లాన్‌లోని ప్రత్యేక ఆరక్షిత జోన్‌లో ఎర్రమంజిల్‌ ప్యాలె్‌సకు రక్షణ కొనసాగుతూనే ఉంది. ఈ అంశాన్ని ప్రభుత్వం విస్మరించింది.
 • హెరిటేజ్‌ భవనానికి మార్పులు చేయడం, అభివృద్ధి, పునరాభివృద్ధి లేదా కూల్చివేయాలంటే జోనింగ్‌ రెగ్యులేషన్‌ 1981లోని సెక్షన్‌ 13(2)లోని నిబంధనలు తప్పక పాటించాలి. అందుకోసం హెచ్‌ఎండీ అనుమతి పొందాల్సి ఉంటుంది. దీన్ని విస్మరిస్తూ 2019 జూన్‌ 18న నిర్ణయం తీసుకుంది.
 • ప్రత్యక్షంగా సాధించలేని దానికోసం ప్రభుత్వం దొడ్డిదారిలో సాధించడానికి ప్రయత్నించింది. ప్రభుత్వ చర్యలు హెచ్‌ఎండీఏ యాక్టులోని సెక్షన్‌ 15కు వ్యతిరేకం. రెగ్యులేషన్స్‌ 2010లోని రూల్‌ 9(ఎ)(2)కు వ్యతిరేకం.
 • 2015లో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యానికి సం బంధించి 2016 ఏప్రిల్‌ 18న హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం విస్మరించింది. తీర్పులో హెరిటేజ్‌ భవనాలకు మార్పులు, చేర్పులు చేయాలన్నా, కూల్చివేయాలన్నా జోనింగ్‌ రెగ్యులేషన్స్‌ 1981లోని రెగ్యులేషన్‌ 13 ప్రకారం అనుమతులు పొందాలని స్పష్టం చేసింది. వ్యతిరేకంగా తీసుకు న్న ప్రభుత్వ నిర్ణయం చెల్లదు.
 • వారసత్వ సంపదను పరిరక్షించుకోవాలని, వాటి గుర్తులను, ఆనవాళ్లను చెరిపివేయరాదని రాజ్యంగంలోని ఆర్టికల్‌ 21లో ప్రతిష్ఠాపించిన నిబంధనలను ప్రభుత్వం విస్మరించింది. నగర చరిత్రకు సాక్ష్యంగా నిలిచే వారసత్వ, అర్కిటెక్చర్‌ నిర్మాణాల గుర్తింపును రక్షించాల్సిన బాధ్య త ప్రభుత్వంపై ఉంది. నగర గత వైభవ చిహ్నాలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రాజ్య విలాసాల కోసం వారసత్వ భవనాలను కూల్చి ప్రజల చిరకాల స్మృతులను చెరిపివేయరాదు. భవిష్యత్తు అవసరాలకు ప్రణాళిక సిద్ధం చేయడంతో పాటు గత వైభవాలను రక్షించి, భావి తరాలకు అందించాలి. వీటిని ప్రభుత్వం విస్మరించింది. పలు చట్టాలను, చారిత్రక అంశాలను, కోర్టు ఆదేశాలను దాటవేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదు. దీన్ని రద్దు చేస్తున్నాం.

ప్రభుత్వ వాదనలు తిరస్కరణ: ఎర్రమంజిల్‌ భవనం కూల్చివేయడానికి చట్టపరమైన అడ్డంకులు లేవని, ప్రభుత్వ విధాన నిర్ణయా ల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయంటూ ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ జె.రామచంద్రరావు చేసిన వాదనల ను ధర్మాసనం తిరస్కరించింది. ఎర్రమంజిల్‌ వద్ద అసెంబ్లీ, శాసన మండలి సమావేశ మందిరాలను ఒకే భవనంలో తగిన వసతుల్లో నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేసే హక్కు పిటిషనర్లకు లేదని, మెరుగైన పాలన అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న వాదనలూ తిరస్కరించింది. 1998లో హుడా గుర్తించిన కొన్ని భవనాలను ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని 2015లో ప్రభుత్వం పునఃపరిశీలన చేసి తొలగించిందని, ఎర్రమంజిల్‌ భవనం హెరిటేజ్‌ భవనాల జాబితాలో లేదని అదనపు ఏజీ చెప్పారు. ప్రస్తుత అసెంబీ, శాసనమండలి భవనాలకు తరుచూ మరమ్మతులు చేయాల్సి వస్తోందని, 2017లో శాసన మండలి భవన పటిష్ఠతపై అధ్యయనం చేసిన నిపుణులు భద్రత లేదని నివేదిక ఇచ్చినట్లు అదనపు ఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రస్తుత భవనాలకు అగ్నిప్రమాదాలను ఎదుర్కొనే ఏర్పాట్లు లేవన్నారు. సమీకృత చట్టసభ సభ్యుల సముదాయం నిర్మించాలని మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ భవనం నిజాం కాలంలో నిర్మించినదని చెప్పారు. ఈ వాదనలను ధర్మాసనం తిరస్కరించింది.

పాక్షిక ఆమోదం: మంత్రిమండలి 2019 జూన్‌ 18న తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉస్మానియా వర్సిటీ స్కాల ర్‌ జె.శంకర్‌, సామాజిక కార్యకర్త డాక్టర్‌ లుబ్న సర్వత్‌, విశ్రాంతప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు, సామాజిక కార్యకర్త ఓ.ఎం.దేబ్రా(రెండు వాజ్యాలు), హైదరాబాద్‌ జిందాబాద్‌ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు, సీనియర్‌ పాత్రికేయుడు పాశం యాదగిరి వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలను ధర్మాసనం పాక్షికంగా ఆమోదించింది. డెక్కన్‌ ఆర్కియాలాజికల్‌ అండ్‌ కల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, డాక్టర్‌ మిర్‌ అస్గార్‌ హుస్సేన్‌, మరొకరు దాఖలుచేసిన వ్యాజ్యాల్లో మంత్రి మండలి తీర్మానం చెల్లదంటూ ఇచ్చిన ఉత్తర్వులు ఈ వ్యాజ్యాల్లోనూ వర్తిస్తాయని తెలిసింది. ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ రక్షిత భవనాల జాబితాలో కొనసాగుతున్నందున ప్రత్యేకంగాచేర్చాలని మళ్లీ ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది.

 సమర్థన: సూర్యాపేట జిల్లాలోని డెక్క న్‌ ఆర్కియోలాజికల్‌ సంస్థ ప్రతినిధి కె.జితేంద్రబాబు, 1870లో ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ నిర్మించిన నవాబ్‌ సఫ్దర్‌ జంగ్‌ ముషీరుద్దౌలా ఫఖ్రుల్‌ ముల్క్‌ వారసుడు డాక్టర్‌ మీర్‌ అస్ఘర్‌ హుస్సేన్‌, మరొకరు దాఖలు చేసిన వ్యాజ్యాలను ధర్మాసనం సమర్థించింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది నళిన్‌కుమార్‌, సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదించారు. ఎర్రమంజిల్‌ భవనం హెరిటేజ్‌ భవనమేనని తెలిపారు. హెచ్‌ఎండీఏ యాక్టు 2008, మాస్టర్‌ ప్లాన్‌కు భిన్నంగా నిర్ణయం తీసుకోవాలంటే హెచ్‌ఎండీఏ నుంచి అనుమతి పొందాల్సిందేనని చెప్పారు. ఎర్రమంజిల్‌ భవనం కూల్చివేత నిర్ణయం 2013లో తెచ్చిన జీవో 33, 2017లో తెచ్చిన తెలంగాణ వారసత్వ పరిరక్షణ చట్టానికి వ్యతిరేకమన్నారు. హెచ్‌ఎండీఏ యాక్టులోని రూల్‌ 13ను తొలగించినప్పటికీ అదే చట్టంలోని మరో సెక్షన్‌ ప్రకారం హెచ్‌ఎండీఏ అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోడానికి వీల్లేదని అన్నారు.

Courtesy Andhrajyothi..

Leave a Reply