ఆరోగ్య సేవలు అస్తవ్యస్తం

0
251

– వరప్రసాద్‌

ఆస్పత్రులన్నీ కొవిడ్‌ చికిత్సలోనే నిమగ్నం

మొదటి దశలోనే దేశ ప్రాథమిక ఆరోగ్య సేవలను విచ్ఛిన్నం చేసిన కొవిడ్‌… రెండో ఉద్ధృతిలో కనీవినీ ఎరగని నష్టాన్ని, విషాదాన్ని మిగల్చనున్నది. గతేడాది లాక్‌డౌన్‌ కాలంలోనే ఆరోగ్య సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయని జాతీయ ఆరోగ్య పథకం (ఎన్‌.హెచ్‌.ఎం.) అధికారులు తెలిపారు. ఈ పథకంలో అంతర్భాగమైన ఆరోగ్య నిర్వహణ సమాచార యంత్రాంగం (ఎన్‌.హెచ్‌.ఎం.-హెచ్‌.ఎం.ఐ.ఎస్‌.) విడుదల చేసిన గణాంకాలు, గ్రామాల్లో ప్రభుత్వ ఆరోగ్య సేవలకు జరిగిన తీవ్ర నష్టాన్ని వెల్లడించాయి. ఈ యంత్రాంగం 2019 మార్చి నుంచి 2020 మార్చి వరకు ఆరోగ్య సేవల స్థితిగతుల గురించి వివరించింది. ఆ తదుపరి కాలానికి సంబంధించిన గణాంకాలు విడుదల చేయలేదు. కేంద్ర ఆరోగ్య శాఖ అజమాయిషీలోని ఎన్‌.హెచ్‌.ఎం-హెచ్‌.ఎం.ఐ.ఎస్‌. దేశమంతటా దాదాపు రెండు లక్షల ప్రాథమిక ఆరోగ్య సేవా కేంద్రాలు, జిల్లా ఆస్పత్రులు అందించే చికిత్సా సౌకర్యాలను అనుదినం సమీక్షిస్తుంది. కొవిడ్‌ రోగులకు చికిత్స అందించాల్సిన బాధ్యత సైతం ఈ కేంద్రాలు, ఆస్పత్రులపైనే పడటంతో ఇతర వ్యాధులకు అందించే వైద్య సేవలు దెబ్బతిన్నాయి. ఎన్‌.హెచ్‌.ఎం. కింద బాలలకు పోలియో, క్షయ తదితర వ్యాధి నివారణ టీకాలు వేసే కార్యక్రమం కొవిడ్‌ తెచ్చిపెట్టిన అపార ఒత్తిడితో అస్తవ్యస్తంగా మారింది. ప్రసూతి వైద్యం, మాతాశిశు సంరక్షణ సేవలు, క్యాన్సర్‌, హృద్రోగాలు, మూత్ర పిండ వ్యాధుల చికిత్సలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఫలితంగా నిరుడు దక్షిణాసియాలో అత్యధిక బాలలు, తల్లుల మరణాలు భారత్‌లోనే నమోదు కానున్నాయని ఐరాస బాలల సంక్షేమ సంస్థ (యునిసెఫ్‌) తాజాగా అంచనా వేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐరాస జనాభా సంక్షేమ నిధితో కలిసి ఇటీవల సంయుక్తంగా వెలువరించిన నివేదిక అది. మృత శిశు జననాలు, అయిదేళ్లలోపు బాలల మరణాలు, బాలింత మరణాలు దక్షిణాసియాలో అత్యధికంగా భారత్‌లోనే సంభవిస్తున్నట్లు యునిసెఫ్‌   నివేదిక తెలిపింది. కొవిడ్‌ వల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి గర్భనిరోధక మాత్రలు, తొడుగుల సరఫరా తగ్గిపోవడంతోపాటు స్త్రీపురుషుల్లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స నిలిచిపోవడంతో అవాంఛిత గర్భాలు భారత్‌లోనే ఎక్కువగా సంభవించనున్నాయి.

తగ్గిన ఆస్పత్రి కాన్పులు
నిరుడు జనవరితో పోలిస్తే మార్చిలో ఆస్పత్రి ప్రసవాలు 5,80,000 వరకు తగ్గాయి. దీనర్థం- రక్షణ కరవైన పరిస్థితుల మధ్య ఇళ్లలోనే ఎక్కువ ప్రసవాలు జరుగుతున్నాయని! జననీ స్వాస్థ్య సురక్షా పథకం కింద తల్లులకు అందించే పోషకాహారం, ఇతర ప్రయోజనాలూ సగానికి సగం తగ్గిపోయాయి. బాలల్లో క్షయ నివారణకు వేసే బీసీజీ టీకాలూ తగ్గిపోయాయి. నిరుడు జనవరితో పోలిస్తే ఏప్రిల్‌లో బీసీజీ టీకాలు వేయించుకున్న బాలలు 10 లక్షల మేరకు తగ్గిపోయారు. ఎన్‌.హెచ్‌.ఎం-హెచ్‌.ఎం.ఐ.ఎస్‌. గణాంకాల ప్రకారం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో దగ్గు, పొంగు, గవద బిళ్లలు రాకుండా వేయాల్సిన టీకాలు 69 శాతం తగ్గగా, హృద్రోగ సమస్యలకు ఓపీ సేవలు 50 శాతం, క్యాన్సర్‌ చికిత్సలు 70 శాతం పడిపోయాయి. నిరుడు జనవరితో పోలిస్తే జూన్‌లో క్షయ పరీక్షలు 34 శాతం, హెచ్‌ఐవీ పరీక్షలు 60 శాతం మేరకు తగ్గాయి. క్షయ చికిత్స కోసం నమోదు చేసుకున్న రోగుల సంఖ్యలో 45 శాతం తగ్గుదల కనిపించింది. చిన్నాపెద్ద శస్త్రచికిత్సలు సగానికి సగం తగ్గిపోయాయి. అసలు అన్ని రకాల ఆరోగ్య సమస్యలతో ప్రభుత్వ చికిత్సా కేంద్రాలకు వచ్చే అవుట్‌ పేషంట్ల సంఖ్య  6.9 కోట్ల మేరకు తగ్గిపోయింది. కొవిడ్‌ ఉద్ధృతి సద్దుమణిగిన  తరవాత రోగులు మళ్లీ యథావిధిగా ప్రభుత్వ చికిత్సా కేంద్రాలకు వచ్చినా- ఈలోగా వారి హృద్రోగ, క్యాన్సర్‌, మూత్ర పిండ తదితర   సమస్యలు బాగా ముదిరిపోయి, పరిస్థితి వైద్యుల చేయిదాటి పోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్‌ కాకుండా ఇతర వ్యాధుల వల్ల సంభవించే మరణాలు పెరిగాయో లేదో ఎన్‌.హెచ్‌.ఎం. గణాంకాలు వెల్లడించడం లేదు కానీ, ఇప్పటి చికిత్సా లోపాలు, ఆలస్యాల      కారణంగా మున్ముందు ఈ తరహా రోగుల్లో మరణాల రేటు అధికం కావడం ఖాయమని నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు కొవిడ్‌ కల్లోలంలో మూత్రపిండ రోగులకు డయాలిసిస్‌ సేవలు అందకపోతే, దాని దుష్ప్రభావం వారి ఆయుష్షు మీద పడకమానదు. ఇప్పుడు క్షయ టీకా పడకపోతే ప్రమాదం పొంచి ఉంది. ఫలితంగా 2035కల్లా భారత్‌ నుంచి క్షయను పారదోలాలనే లక్ష్యం నెరవేరడం అసాధ్యం.

ప్రజారోగ్యంపై తక్కువ ఖర్చు
గత మూడేళ్లలో కేంద్రం ఎన్‌.హెచ్‌.ఎం కింద రాష్ట్రాలకు రూ.79,404 కోట్లు కేటాయించింది. ఆ నిధుల్లో అత్యధిక వాటా ఉత్తర్‌ ప్రదేశ్‌కే దక్కింది. ఆ తరవాత మహారాష్ట్రకు గణనీయ నిధులు లభించాయి. కానీ, కొవిడ్‌పై పోరులో ఆ రెండు రాష్ట్రాలు తలకిందులు కాËవడం చూస్తున్నాం. ఉదాహరణకు ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బల్లియా, ఘాజీపూర్‌ జిల్లా ఆస్పత్రుల్లో మొత్తం 1400 పడకలు ఉంటే, ఆ రెండు జిల్లాల్లో కొవిడ్‌ రోగుల సంఖ్య 10,000కు పైమాటే. వీరికి చికిత్స అందించలేక ఆస్పత్రులు సతమతమవుతున్నాయి. మహారాష్ట్రదీ ఇలాంటి పరిస్థితే. ప్రజారోగ్యంపై కేంద్రం చేస్తున్న ఖర్చు చాలా తక్కువగా ఉండటం ప్రస్తుత  దుస్థితికి మూల కారణం. అక్కడికీ 2015-16లో భారత  జీడీపీలో 0.9 శాతాన్ని ప్రజారోగ్య సంరక్షణకు కేటాయించిన కేంద్రం, 2020-21లో దాన్ని 1.1 శాతానికి పెంచింది. 2025కల్లా దీన్ని 2.5 శాతానికి పెంచాలని జాతీయ ఆరోగ్య విధానం లక్షిస్తున్నా, ఆ పని సత్వరమే చేయాల్సిన అవసరం ఉందని తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.

తాత్కాలిక చర్యలే
దేశ ఆరోగ్య సంరక్షణ యంత్రాంగ లోటుపాట్లు కొవిడ్‌ విపత్కాలంలో బట్టబయలయ్యాయి. మన దేశంలో 70 నుంచి 80 శాతం చికిత్స ప్రైవేటు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నా- ఆ ఖరీదైన చికిత్సలు భరించలేని గ్రామీణ పేదలకు, ముఖ్యంగా మాతాశిశువులు, వృద్ధులకు ప్రభుత్వ కేంద్రాలే శరణ్యం. మలేరియా రాకుండా మందులు చల్లడం, వివిధ వ్యాధుల నివారణకు టీకాలు వేయడం వంటి పనులను ప్రభుత్వ యంత్రాంగమే నిర్వహిస్తోంది. కొవిడ్‌ కాలంలో ప్రైవేటు ఆస్పత్రుల లాభాపేక్ష ప్రాణాంతకంగా మారి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రులు, రిఫరల్‌ ఆస్పత్రులను పటిష్ఠం చేయాల్సిన ఆవశ్యకతను ముందుకుతెస్తోంది. అసలు కొవిడ్‌ మహమ్మారి కమ్ముకోకముందే మన జనాభా అవసరాలను తీర్చలేక అవి సతమతమవుతున్నాయి. ఇప్పుడు కొవిడ్‌ కారణంగా హడావుడిగా ఐసీయూలు, ఆస్పత్రి పడకలను ఏర్పాటు చేయడానికి కేంద్రం, రాష్ట్రాలు కిందామీదా పడుతున్నాయి. రైలు బోగీలను ఐసొలేషన్‌ కేంద్రాలుగా మార్చడం మొదలుకొని సాయుధ దళాల సేవలు, చికిత్సా సౌకర్యాలనూ చేపడుతున్నాయి. ఇవన్నీ తాత్కాలిక ఉపశమన చర్యలే తప్ప దీర్ఘకాలిక పరిష్కారం కాబోవు.

Courtesy Eenadu

Leave a Reply