- యువగళం పాదయాత్రలో సొమ్మసిల్లిన వైనం
- హుటాహుటిన కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలింపు
- గుండెలో 90శాతం బ్లాక్‌లు ఉన్నట్లు గుర్తింపు
- ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ ఆరా
- మెరుగైన చికిత్సకు బెంగళూరు ఆస్పత్రికి తరలింపు
కుప్పం : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన సినీనటుడు నందమూరి తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. కుప్పం పట్టణం లక్ష్మీపురంలోని మసీదులో శుక్రవారం జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో లోకేశ్, నందమూరి బాలకృష్ణ, తారకరత్న పాల్గొన్నారు. మిగిలినవారి కంటే కాస్త ముందుగా తారకరత్న మసీదు నుంచి బయటికి వచ్చేశారు. మసీదు బయట కాస్త దూరంలో ఒక్కసారిగా సొమ్మసిల్లి కింద పడిపోయారు. వెంటనే యువగళం బృందంలోని వలంటీర్లు ఆయన్ను కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్ మెడికల్ కాలేజీకి తరలించారు. నందమూరి బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పీఈఎ్‌సకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. తొలుత బెంగళూరులోని నారాయణ హృదయాలయకు ఎయిర్ అంబులెన్సులో తరలిద్దామని ప్రయత్నించినా, అది దక్షిణాదిన ఎక్కడా అందుబాటులో లేదు. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి, పీఈఎస్ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న భార్య కూడా బాలకృష్ణకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. తారకరత్న గుండెలో బ్లాక్స్ అధికంగా ఉన్నాయి. స్టంట్ వేయాలంటే షుగర్ సాధారణ స్థితిలో ఉండాలి. కొన్నాళ్లుగా ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ షుగర్ టాబ్లెట్స్ వేసుకోకపోవడంతో షుగర్ లెవల్ 400కు చేరింది. ఈ కారణంగా వైద్యులు స్టంట్స్ వేయలేకపోయారు. బెంగళూరు నుంచి నారాయణ హృదయాలయ వైద్యబృందం పీఎస్‌ఈ ఆస్పత్రికి వచ్చి తారకరత్నను పరీక్షించింది. తారకరత్నను మెరుగైన చికిత్స నిమిత్తం శుక్రవారం అర్ధరాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పతికి తరలించారు. కాగా, తారకరత్న చికిత్స విషయమై కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ఆయన్ను తరలించే సమయంలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోకుండా వేగంగా ఆస్పత్రికి చేర్చడానికి సాయం చేయాలని కోరారు. పోలీసు అధికారులకు చెప్పి ఇబ్బంది లేకుండా చూస్తానని బొమ్మై హామీ ఇచ్చినట్లు సమాచారం.