కొత్త సెక్రటేరియట్‌కు ఓకే

0
107
  • నిర్మాణానికి తొలగిన అడ్డంకులు
  • పాత భవనాల కూల్చివేతపై వ్యాజ్యాలు కొట్టివేసిన హైకోర్టు
  • అప్పీలుకు అదనపు గడువుఇవ్వడానికి అనుమతి నిరాకరణ
  • విధాన నిర్ణయాల్లో జోక్యం వద్దు
  • హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాదన

హైదరాబాద్‌ : నూతన సచివాలయ భవన సముదాయం నిర్మాణానికి అడ్డంకులు తొలిగాయి. పాత భవనాల కూల్చివేత నిర్ణయంపై దాఖలైన ఐదు ప్రజాహిత వ్యాజ్యాలను తెలంగాణ హైకోర్టు సోమవారం కొట్టేసింది. కోవిడ్‌-19 వైరస్‌ ప్రబలుతున్న తరుణంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేసేందుకు నాలుగు నెలలు గడువు ఇవ్వాలన్న సీనియర్‌ న్యాయవాది అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. అత్యవసర కేసులను సుప్రీంకోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరుపుతోందని, కోర్టు ఉత్తర్వులపై తక్షణమే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం తుది ఆదేశాలు జారీ చేసింది. సచివాలయ భవనాలను కూల్చివేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధి టి.జీవన్‌రెడ్డి, ఫోరంఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కార్యదర్శి పద్మనాభరెడ్డి, న్యాయవాది టి.రజనీకాంత్‌రెడ్డి, ప్రొఫెసర్‌ విశ్వేశ్వరరావు, కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు.

ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదిస్తూ… రాజ్యాంగ వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే తప్ప ప్రభుత్వ విధాన నిర్ణయాలపై న్యాయసమీక్ష చేయడానికి వీల్లేదన్నారు. సచివాలయ భవనాల కూల్చివేతపై దాఖలు చేసిన అన్ని వ్యాజ్యాల్లోనూ ఒకే రకమైన అభ్యర్థన చేశారన్నారు. సకల సౌకర్యాలతో, తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠ ఇనుమడించేలా సమీకృత సచివాలయ భవన సముదాయం నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టిందన్నారు. రాజకీయ ప్రత్యర్థులే ప్రభుత్వ విధాన నిర్ణయాలను అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అన్ని విధాలా ఆలోచించి తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవాలని చూడడం సరికాదన్నారు.  సాంకేతిక నిపుణుల కమిటీ, మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకే రాష్ట్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. పిటిషనర్లు ఆరోపణలకు ఆధారాలు చూపలేదన్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉటంకించారు.

భవనాల ఫిట్‌నెస్‌ అంశాన్ని నిపుణుల కమిటీకి వదిలేయాలని సూచించారు. సచివాలయ భవనాల ఫిట్‌నె్‌సకు సంబంధించి సాంకేతిక నిపుణుల అభిప్రాయానికి విడిచిపెట్టాలని కోరారు. ఈ భవనాలు మరో 50 నుంచి 70 సంవత్సరాలు వినియోగించవచ్చని పిటిషనర్లు చేస్తున్న వాదనలు సత్యదూరమన్నారు. ఏపీకి కేటాయించిన సచివాలయ భవనాలను 2019 జూన్‌ 20 అప్పగించారని, దీర్ఘకాలం నిరుపయోగంగా ఉండడంతో వాటిని పునర్‌ వినియోగంలోకి తేవడానికి భారీ మరమ్మతులు చేయాల్సి ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఈ భవనాలు లేవన్నారు. పలు బ్లాకులుగా సచివాలయం ఉండటం వల్ల సిబ్బంది విధులకు ఇబ్బంది కలుగుతోందని, సందర్శకులకు అసౌకర్యంగా మారిందని చెప్పారు. ప్రస్తుత సచివాలయంలో సమావేశాలు నిర్వహించుకోవడానికి సరైన సమావేశ మందిరాలు లేవన్నారు. 2019 జూన్‌ 18న కేబినేట్‌లో ఈ అంశాలన్నింటిపై సుదీర్ఘ చర్చ జరిపిన తర్వాతే తాత్కాలికంగా మరో భవనంలోకి సచివాలయాన్ని తరలించామని చెప్పారు.

1888లో నిర్మించిన జీ-బ్లాకు, పలు బ్లాకులు సచివాలయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నాయని తెలిపారు. ఆయా బ్లాకులకు అత్వవసర ద్వారాలు, ఫైర్‌ సేఫ్టీ లేవని చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సీ బ్లాకులో సైతం ఈ సౌకర్యాలు లేవన్నారు. రోజూ పెద్ద సంఖ్యలో అంతర్జాతీయ వ్యాపారవేత్తలు, ఇతరులు సచివాలయాన్ని సందర్శిస్తూ ఉంటారని, వారిని తగిన విధంగా గౌరవించేందుకు, కలిసేందుకు సరిపడే విధంగా సౌకర్యాలు లేవని ప్రస్తావించారు. భవనాలు 50-70 సంవత్సరాల మనుగడ కోసం నిర్మించినప్పటికీ, ప్లంబింగ్‌, ఎలక్ర్టికల్‌ వైరింగ్‌ 25 సంవత్సరాలకే కాలం చెల్లిపోతాయని, పైపు లైన్ల లీకేజీల కారణంగా గత నాలుగేళ్లలో 3 సార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయని చెప్పారు. 2014లోనే సచివాలయంలోని పలు బ్లాకుల్లో ఫైర్‌ సేఫ్టీ లోపాలను అగ్నిమాపక శాఖ గుర్తించిందని తెలిపారు. బ్లాకుల వారీగా లోపాలను ఎత్తిచూపుతూ అడ్వకేట్‌ జనరల్‌ 30 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ప్రాంగణానికి తగిన పార్కింగ్‌ సౌకర్యం కూడా లేదన్నారు. భవనాలు చెల్లాచెదురుగా ఉన్నాయని, శాఖల మధ్య ఫైళ్ల మార్పిడిలో భద్రత లేదని చెప్పారు. అగ్ని ప్రమాదాలు జరిగితే తప్పించుకునే మార్గం లేదన్నారు. రాకపోకలు ఒకే మార్గం ద్వారా చేయాల్సి వస్తోందని తెలిపారు. ఈ సమస్యలన్నీ గ్రహించే రాష్ట్ర ప్రభుత్వం సమీకృత సచివాలయ భవన నిర్మాణం తలపెట్టిందన్నారు.

ఎలుకలు ఉన్నాయని నిప్పెడతారా?
ఎలుకలు చేరాయని ఇంటికి నిప్పు పెట్టుకుంటారా? అని పిటిషనర్ల తరుపున సీనియర్‌ న్యాయవాది సత్యంరెడ్డి ప్రశ్నించారు. చిన్న, చిన్న కారణాలకే 400-500 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేయాలన్నారు. ‘‘సచివాలయ అంచనా వ్యయం ఇంతటితో ఆగదు, నిర్మాణం పూర్తయ్యే సరికి 1000-1500 కోట్లకు చేరుకుంటుంది’’ అని చెప్పారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలు సంక్షేమం దిశగా ఉండాలన్నారు, ‘‘ఇటీవల కాలంలో నిర్మించిన భవనాలను కూల్చివేయడం సరికాదు. ప్రభుత్వ విధాన నిర్ణయాలు విధ్వంసం దిశగా ఉండరాదు. కూల్చివేత నిర్ణయం సహేతుకంగా లేదు’’ అన్నారు. సచివాలయ భవనాలల్లో 20,70,279 చదరపు టడుగుల విస్తీర్ణం ఉందని తెలిపారు. నూతనంగా తలపెట్టిన భవనంలో 12 లక్షల చదరపు అడుగులు మాత్రమే ఉందన్నారు. వాదనలు సుదీర్ఘంగా విన్న ధర్మాసనం ఈ ఏడాది మార్చిలో తీర్పును రిజర్వు చేసింది. ఏజీ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోడానికి నిరాకరిస్తూ అన్ని వ్యాజ్యాలను కొట్టివేస్తూ సోమవారం తీర్పు వెలువరించింది.

Courtesy Andhrajyothi

Leave a Reply