నేడే సకల జనుల సమర భేరి

0
254
  • సరూర్‌నగర్‌లో ఆర్టీసీ జేఏసీ బహిరంగ సభ
  • రాజకీయ పార్టీలు, సంఘాల మద్దతు
  • సభకు భారీగా తరలి రావాలి: అశ్వత్థామరెడ్డి

ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతమవుతోంది. వివిధ రూపాల్లో నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్మికులు బుధవారం ‘సకల జనుల సమర భేరి’ పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహాన్ని తెలియజెప్పడమే ప్రధాన ఉద్దేశంగా ఈ సభను నిర్వహిస్తున్నారు. సరూర్‌నగర్‌ స్టేడియంలో మధ్యాహ్నం సభ ప్రారంభం కానుంది. ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రజా, కార్మిక, విద్యార్థి, ఉపాధ్యాయ, కుల సంఘాలు ఈ సభకు మద్దతిస్తున్నాయి. ఆయా సంఘాల నాయకులు సభలో పాల్గొని కార్మికుల్లో మనోధైర్యం పెంపొందించేలా ప్రసంగించనున్నారు. సకల జనుల సమర భేరి సభకు కార్మికులు పెద్దసంఖ్యలో తరలిరావాలని జేఏసీ నేతలు ఇ.అశ్వత్థామరెడ్డి, ఎం.థామ్‌సరెడ్డి పిలుపునిచ్చారు.

సమ్మె మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆత్మహత్యలు చేసుకున్నవారు, గుండెపోటుతో మరణించిన కార్మికులు, వారి బంధువుల సంఖ్య 20కి చేరిందని.. ఇంత మంది చనిపోయినా ప్రభుత్వ పెద్దలకు చీమ కుట్టినట్లు కూడా లేదని ఓ కార్మిక నేత విరుచుకుపడ్డారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా సీఎం కేసీఆర్‌ స్వాముల చుట్టూ తిరుగుతున్నాడని ఆరోపించారు. హైకోర్టుకు ప్రభుత్వం బోగస్‌ లెక్కలు సమర్పించిందని జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. మంగళవారం హైకోర్టు వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ సర్కారు కోర్టును సైతం పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై జేఏసీ న్యాయవాది ప్రస్తావిస్తే.. బకాయిల కంటే ఎక్కువే ఇచ్చామని చెబుతోందని దుయ్యబట్టారు.

Courtesy Andhrajyothi…

Leave a Reply