రైతులపై జలఫిరంగులు

0
171

హర్యానా సర్కార్‌ నిర్బంధం… నిరంకుశత్వం
– నిర్బంధాలను ఛేదించి ముందుకు…
– కర్నాల్‌లో మహాపంచాయత్‌కు భారీగా రైతులు
– రైతు నేతలు అరెస్టు
– ఇంటర్‌ నెట్‌ కట్‌…144 సెక్షన్‌ విధింపు
– ఎక్కడిక్కడ బారీకేడ్లు..ముండ్లకంచెలు
– తొమ్మిది కిలోమీటర్ల మార్చ్‌… అనంతరం మినీ సచివాలయం ఘెరావ్‌

కర్నాల్‌ : హర్యానాలోని కర్నాల్‌లో రైతులు కదం తొక్కారు. బీజేపీ ప్రభుత్వ నిర్బంధాలను చేధించి అన్నదాతలు ముందుకు సాగారు. దాదాపు రెండు లక్షల మంది రైతులు గర్జించారు. ప్రవాహంలా సాగుతున్న వచ్చిన అన్నదాతలను అడ్డుకోవడానికి రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు, హర్యానా పోలీసులను చేతకాలేకపోయింది. పోలీసులు వాటర్‌ కెనాన్స్‌ ప్రయోగించినా వాటిని ఎదుర్కొని భుజం భుజం కలిపి కదం తొక్కారు. రైతులను అడ్డగించేందుకు పెట్టిన భారీ బారికేడ్లు, ఇనుప ఫెన్సింగ్‌ను దాటుకొని చేయి చేయి కలిపి ఐక్యంగా ముందుకు సాగారు. ఇలాంటి అడ్డంకులన్ని చేధించి దాదాపు తొమ్మిది కిలో మీటర్ల నడుమ లక్షలాది మంది రైతులు మార్చ్‌ నిర్వహించారు. మినీ సెక్రెటేరియట్‌ (సచివాలయం)కి చేరుకున్నారు. అక్కడ రోడ్డుపైనే ఆందోళన కొనసాగిస్తు న్నారు. పోలీసులు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) నేతలను అరెస్టు చేశారు. కానీ రైతులు ప్రతిఘటించేసరికీ కొద్ది సేపు తరువాత వారిని విడిచిపెట్టారు.

ఆగస్టు 28న హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, బీజేపీ హర్యానా అధ్యక్షుడు ఒపి ధంకర్‌ పాల్గొనే బీజేపీ సమావేశానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై కర్నాల్‌లోని బస్తారా టోల్‌ప్లాజా వద్ద పోలీసులు విరుచుకుపడ్డారు. లాఠీచార్జి చేయగా.. వందలాది మంది రైతులకు తీవ్ర గాయాల య్యాయి. ఆ గాయాలతో రైతు సుశీల్‌ కాజల్‌ మరణించారు. రైతుల పగలగొట్టండి, వారి తలలు పగలడం తాను చూడాలని అని రైతులపై పోలీసులను కర్నాల్‌ సబ్‌ డివిజినల్‌ మేజిస్ట్రేట్‌ (ఎస్‌డీఎం) ఆయూష్‌ సిన్హా ఉసిగొల్పిన విషయం విదితమే. లాఠీచార్జిలో పాల్గొన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలనీ, మరణించిన బాధిత రైతు కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలనీ, ఆయన కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనీ, గాయపడిన రైతులకు రూ.2 లక్షల పరిహారం ఇవ్వాలని ఎస్కేఎం డిమాండ్‌ చేసింది. సెప్టెంబర్‌ 6 లోపు తమ డిమాండ్లను పరిష్కరించాలనీ,లేకపోతే.. సెప్టెంబర్‌ 7 కర్నాల్‌ మినీ సెక్రెటేరియట్‌ ఘెరావ్‌ చేస్తామని హెచ్చరించింది. అయితే ఎస్కేఎం డిమాండ్ల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న హర్యానా ప్రభుత్వం ఒక్క డిమాండ్‌ను కూడా నెరవేర్చలేదు. ఆయూష్‌ సిన్హాపై చర్యలు తీసుకునేందుకు హర్యానా ఖట్టర్‌ ప్రభుత్వం నిరాకరించింది. అతనికి పదోన్నతి కల్పించిన విషయం విదితమే.

కిసాన్‌ మహా పంచాయత్‌పై నిరంకుశ ఆంక్షలు
ముజఫర్‌నగర్‌ కిసాన్‌-మజ్దూర్‌ మహా పంచాయత్‌లో రైతుల శక్తిని చూసిన తరువాత, హర్యానా ప్రభుత్వం కర్నాల్‌లో శనివారం సాయంత్రం నుంచే నిరంకుశ పూరిత ఆంక్షలు విధించింది. ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినప్పటికీ కిసాన్‌ మహా పంచాయత్‌ షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతుందని ఎస్కేఎం ప్రకటించింది. అందులో మంగళవారం కర్నాల్‌లోని న్యూ అనాజ్‌ మండీలో దాదాపు రెండు లక్షల మంది రైతులు, వ్యవసాయ కార్మికులు మహా పంచాయత్‌ నిర్వహించారు. రైతులు ట్రాక్టర్లు, మోటార్‌సైకిళ్లను నడుపుతూ కొత్త అనాజ్‌ మండికి చేరుకున్నారు. ఉదయం 10 గంటలకే ధాన్యం మార్కెట్‌ జనంతో నిండిపోయింది. ఈ సందర్భంగా కిసాన్‌ మహా పంచాయత్‌లో ఎస్కేఎం, వ్యవసాయ కార్మిక సంఘం నేతలు ప్రసంగించారు. కిసాన్‌ మహాపంచాయత్‌ను అనుమతించినప్పటికీ, రైతులు మినీ సెక్రెటేరియట్‌కు వెళ్లేందుకు ప్రభుత్వ యంత్రాంగం అనుమతించలేదు.

మినీ సెక్రెటేరియట్‌కు మార్చ్‌
ఎస్కేఎం నేతలు ఇచ్చిన పిలుపును అందుకొని లక్షలాది మంది రైతులు మినీ సచివాలయం వైపుగా కదం తొక్కారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందుకు సాగారు. రైతులపై హర్యానా పోలీసులు వాటర్‌ కెనాన్స్‌ ప్రయోగించారు. అయినప్పటికీ వాటిని ఎదురించి అడుగులో అడుగు వేసుకుంటూ రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, విద్యా ర్థులు, యువ కులు, చిన్నారులు, వృద్ధులు మినీ సెక్రెటేరి యట్‌కు మార్చ్‌ నిర్వహిం చారు. రైతులు శాంతియు తంగా కర్నాల్‌ మినీ సచివాలయం వైపు వెళ్లే మార్గంలో మూడు చోట్ల భారీ బారికేడ్లు, ఇనుప ఫెన్సింగ్‌ అడ్డుపెట్టినా, ఆ మూడు చోట్ల కూడా వాటిని పక్కకు నెట్టి కదం తొక్కారు. దాదాపు తొమ్మిది కిలో మీటర్లు మార్చ్‌ నిర్వహించిన రైతులు మినీ సెక్రెటేరియట్‌కు చేరుకున్నారు. అక్కడికి చేరకుండా రైతులను అడ్డుకోవడం పోలీసులు, కేంద్ర బలగాల వశం కాలేకపోయింది. దీంతో మినీ సెక్రెటేరియట్‌కు చేరుకున్న రైతులు అక్కడే రోడ్డుపైనే బైటాయించారు.

అడుగడుగునా..
రైతుల కిసాన్‌ మహా పంచాయత్‌, మినీ సెక్రెటేరియట్‌ ఘెరావ్‌ నేపథ్యంలో హర్యానాలోని ఖట్టర్‌ ప్రభుత్వం నిర్బంధం విధిస్తూ నిరంకుశత్వంగా వ్యవహరించింది. కర్నాల్‌ జిల్లా అంతా 144 సెక్షన్‌ విధించి, బహిరంగ సమావేశాలను నిషేధించింది. కర్నాల్‌తో సహా కురుక్షేత్ర, కైథాల్‌, జింద్‌, పానిపట్‌ జిల్లాల్లో ఇంటర్నెట్‌, ఎస్‌ఎంఎస్‌ సేవలను నిలిపివేసింది. భద్రతా చర్యల్లో భాగంగా కెమెరా అమర్చిన డ్రోన్‌లను ఉపయోగించారు. సెంట్రల్‌ ఆర్మ్డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌)కు చెందిన 10 కంపెనీలతో సహా 40 కంపెనీల భద్రతా దళాల దళాలు కర్నాల్‌లోని కిసాన్‌ మహా పంచాయత్‌ జరిగే మండీ చుట్టూ మోహరించాయి. దేశ సరిహద్దుల్లో కంటే రైతుల ఆందోళనపై ఉక్కుపాదం మోపేందుకు ఎక్కువ బలగాలను మోహరించాయి. కానీ రైతులు శాంతియుతంగా తమ ఆందోళనను కొనసాగించారు. ప్రభుత్వం ఆందోళన, రైతు ఉద్యమ శక్తిని ఇప్పటికే రుజువు చేసిందని ఎస్కేఎం స్పష్టం చేసింది. పొరుగు జిల్లాల నుంచి కర్నాల్‌కు చేరుకునేందుక ప్రయత్నించిన రైతులు కూడా ఎక్కడికక్కడే నిలివేశారు. కర్నాల్‌ జిల్లా గుండా వెళ్లే ప్రాంతాల నుంచి జాతీయ రహదారి-44 (అంబాలా-ఢిల్లీ) వేరేవైపు మళ్లించారు. ఢిల్లీ నుంచి చండీగఢ్‌కు వచ్చే వాహనాలు పానిపట్‌ పెప్సీ చౌక్‌ మీదుగా కర్ణా సరస్సు వరకు మళ్లించారు. చండీగఢ్‌ నుంచి ఢిల్లీకి వెళ్లే వాహనాలు కురుక్షేత్ర పిప్లి వద్ద లద్వా మీరట్‌ మీదుగా అమత్‌పూర్‌ ఖుర్ద్‌, జీటీ రోడ్‌ 44 మీదుగా మళ్లించారు.

చర్చలు విఫలం
రైతుల ప్రవాహం చూసి కంగుతిన్న అధికార యంత్రాంగం రైతు నేతలను చర్చలకు పిలిచింది. ఎస్కేఎం నేతలు బల్బీర్‌ సింగ్‌ రాజెవాల్‌, దర్శన్‌ పాల్‌, గుర్నామ్‌ సింగ్‌ చారుణి, యోగేంద్ర యాదవ్‌, రాకేశ్‌ తికాయత్‌, ఇంద్రజిత్‌ సింగ్‌ తదితరులు చర్చలకు వెళ్లారు. డిమాండ్లను ఆమోదించడానికి, మార్చ్‌ను అనుమతించడానికి పరిపాలన నిరాకరించడంతో చర్చలు విఫలమయ్యాయి. ధాన్యం మార్కెట్‌ నుంచి మినీ సెక్రెటేరియట్‌ వరకు మార్చ్‌తో రైతులు ముందుకు వెళ్తారని ఎస్కేఎం ప్రకటించింది.

రైతు నేతలు అరెస్టు…ప్రతిఘటించిన రైతులు
లక్షలాది మంది రైతులు తమ పాదయాత్రను ప్రారంభించిన తరువాత ఎస్కేఎం నేతలు గుర్నామ్‌ సింగ్‌ చారుణి, దన్నేవాలా, రాకేశ్‌ తికాయత్‌, యోగేంద్ర యాదవ్‌, పి.కృష్ణప్రసాద్‌, ఇంద్రజిత్‌ సింగ్‌, ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌ సహా పలువురు ఎస్కేఎం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. రైతులు దృఢంగా ఉన్నారు. ప్రభుత్వం హత్య నుంచి తప్పించుకోలేదనీ, తాము గట్టిగా నిలబడ్డామనీ, హర్యానా ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నామని, సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు రైతులు తగిన గుణపాఠం చెబుతారని ఎస్కేఎం నేతలు స్పష్టం చేశారు. తమ నాయకులను పోలీసులు అరెస్టు చేయడంతో వేలాది మంది రైతులు ప్రతిఘటించారు. ఇచ్చిన పిలుపు విజయవంతమైం దనీ, డిమాండ్లు నెరవేరేవరకు మినీ సెక్రెటేరియట్‌ ఎదుట ఆందోళన కొనసాగుతుందని ఎస్కేఎం స్పష్టం చేసింది.

Courtesy Nava Telangana

Leave a Reply