‘హిందూత్వ’ కార్పొరేట్‌ యుగళగీతం

0
263

ప్రభాత్‌ పట్నాయక్‌

‘హిందూత్వ’ నినాదం ఏ వర్గానికి సేవ చేస్తోందో రోజులు గడిచేకొద్దీ స్పష్టంగా కనపడుతోంది. మోడీ ప్రభుత్వం ‘హిందూత్వ’ చాటున ప్రభుత్వ రంగ సంస్థల్ని టోకున అమ్మేస్తోంది. ఇంకోవైపు కార్మిక వర్గంపై పెద్దపెట్టున విరుచుకు పడుతోంది. ‘మామూలు’ బూర్జువా పాలనలోనైతే దీనికి పెద్ద ఎత్తున ప్రతిఘటన తలెత్తి వుండేది. మరి ఈ ప్రభుత్వం ఇంతగా బరితెగించడానికి ధైర్యం ఎలా వచ్చింది? ‘హిందూత్వ’ పేరుతో దేశం యావత్తూ రెండుగా చీలిపోతున్న పరిస్థితుల్లో ఉన్నాం. హిందువుల ముందు అంతర్గత శత్రువులుగా ఇతరుల్ని చిత్రీకరించి వారి వల్లనే దేశానికి పెనుముప్పు ఏర్పడుతోందన్న భావాన్ని కలిగిస్తున్నారు. ఆ ప్రమాదం నుంచి కాపాడగలిగే ‘రక్షకుడు’గా మోడీ పోజు పెడుతున్నారు. మరి కాపాడే రక్షకుడే ప్రైవేటీకరణకి పూనుకుంటే ప్రజల ప్రతిఘటన అంత తీవ్రంగా ఉండదు కదా. ప్రజలు ‘హిందూత్వ’ ఎజండాపై చర్చల్లో మునిగిపోయి ఫైనాన్సు పెట్టుబడి, కార్పొరేట్‌ శక్తుల కూటమి తమ ప్రైవేటీకరణ ఎజండాను అమలు జరుపుకు పోతున్న వైనాన్ని పట్టించుకోవడం లేదు. ‘హిందూత్వ’ ఎజండా అసలు లక్ష్యమే ప్రజల దృష్టిని పక్కకు మళ్లించి కార్పొరేట్ల ప్రయోజనాలను నెరవేర్చడం.
రకరకాల పద్ధతుల్లో ప్రైవేటీకరణ సాగిపో తోంది. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏకంగా అమ్మేస్తున్నారు. ఇలా అమ్ముతున్న వాటిల్లో నష్టాలొస్తున్న సంస్థలే కాదు, బాగా లాభాలను ఆర్జిస్తున్న సంస్థలూ ఉన్నాయి. మరికొన్ని సంస్థల్లో ప్రభుత్వ వాటా 51 శాతానికన్నా తక్కువ ఉండేట్టు వాటాలను అమ్మేస్తున్నారు (అంటే ఆ సంస్థ మీద పెత్తనం ప్రైవేటు రంగం చేతుల్లోకి పోతుంది). మరికొన్ని సంస్థల్లో ముక్కలుగా చేసి ఒక్కో ముక్కనూ అమ్మేస్తున్నారు. ఈ పద్ధతిని రైల్వే రంగంలో అనుసరిస్తున్నారు. ఇంతేగాదు బొగ్గు గనుల రంగం ఇంతవరకూ దాదాపు పూర్తిగా ప్రభుత్వ ఆధీనం లోనే ఉండేది. ఇప్పుడు అందులో ఏకంగా విదేశీ పెట్టుబడులనే ఆహ్వానిస్తున్నారు. రైలింజన్లను విదేశాల నుండి దిగుమతి చేసుకోవడం పెరిగింది. దీనివలన స్వదేశంలో ప్రభుత్వ రంగం లోని రైలింజన్ల తయారీ పరిశ్రమ కూలబడింది. ఇక మిగిలింది ప్రభుత్వ రంగ యూనిట్లు అంతరించి పోవడమే.
ఇదే సమయంలో ప్రస్తుత కార్మిక సంక్షేమ చట్టాలను ‘సంస్కరిస్తూ’ మోడీ ప్రభుత్వం తలపెట్టిన కొత్త చట్టాలు కార్మికుల ఉద్యోగాలను ఊడబెరకడానికి యజమానులకు కొత్త శక్తిని అందించబోతున్నాయి. రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఈ చట్టాలను ప్రవేశ పెట్టడానికి రంగం సిద్ధం అయింది. నిజానికి కార్మిక సంక్షేమ చట్టాలను ఉపయోగించుకుని రక్షణ పొందగలుగుతున్న కార్మికులు మొత్తం కార్మికులలో కేవలం 4 శాతమే! సంఘటిత రంగంలో సైతం కాంట్రాక్టు, కాజువల్‌ ఉద్యోగాలు పెద్ద ఎత్తున రావడంతో వారికి రెగ్యులర్‌ కార్మికులకుండే రక్షణ లేకుండా పోయింది. కేవలం 4 శాతం కార్మికులే ప్రయోజనం పొందుతున్నప్పుడు ఈ కార్మిక చట్టాల సవరణ అవసరం ఏముందన్న సందేహం కొందరికి రావొచ్చు. ఒక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేయడమే అసాధ్యం అయ్యేలా చేయడమే ఈ సవరణల లక్ష్యం. తోటి కార్మికులను కూడగట్టి సంఘం ఏర్పాటు చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వారిని వెంటనే వెళ్లగొట్టడానికి ఈ సవరణలు వీలు కల్పిస్తాయి.
ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ పర్యవసానంగా కూడా ఇటువంటి పరిణామాలే జరుగుతాయి. ప్రపంచం మొత్తంగా చూసినా ప్రభుత్వ రంగంలో కార్మికులు సంఘాలు ఏర్పరచుకున్నట్టు ప్రైవేటు రంగంలో చేయలేకపోతున్నారు. అమెరికాలో ప్రభుత్వ రంగ కార్మికులలో 33 శాతం యూనియన్లలో ఉంటే ప్రైవేటు రంగంలో 7 శాతమే ఉన్నారు. ప్రభుత్వ రంగం ప్రైవేటు పరం అయితే కార్మిక సంఘాలలో చేరే వారి సంఖ్య కూడా పడిపోతుందని దీనిని బట్టి తేలుతు న్నది. మోడీ ప్రభుత్వపు అసలు లక్ష్యం కార్మిక వర్గం మీద దాడి చేయడమే. ఇలాంటి దాడి జరిగితే కార్పొరేట్లు, ద్రవ్య పెట్టుబడి యజమానులు తెగ ఆనంద పడిపోతారు. ఐతే పాత వాతావ రణంలో ఇటువంటి దాడికి పూనుకోవడం సాధ్యపడలేదు. ‘హిందూత్వ’ నీడలో ఈ దాడికి పూనుకోవడం తేలిక.

‘హిందూత్వ’ నీడలో కార్పొరేట్లు పెరగడం యాదృచ్ఛికమేమీ కాదు. హిందూత్వ వాదుల ఆర్థిక సిద్ధాంతం పూర్తిగా, ఏమాత్రం దాపరికం లేని రీతిలో కార్పొరేట్లను నిస్సిగ్గుగా సమర్థిస్తుంది. ఈ విషయాన్ని వేరే ఎవరో కాదు, మోడీనే స్వయంగా ప్రకటించారు. ‘పెట్టుబడిదారులు సంపద సృష్టికర్తలు’ అని మోడీ ప్రకటించారు!
ఇటువంటి ప్రకటన చేయడానికి బూర్జువా అర్థశాస్త్రవేత్తలు సైతం సాహసించలేదు. భూమి, శ్రమ, పెట్టుబడి, నిర్వహణ అనే నాలుగు అంశాల మీద ఆధారపడి సంపద ఉత్పత్తి అవుతుందని బూర్జువా అర్థశాస్త్రం చెప్తుంది. సంపదను ఉత్పత్తి చేయడంలో శ్రామికులతో బాటు తమకూ ప్రాధాన్యత ఉందని చెప్పుకోవడానికి బూర్జువావర్గం ఆపసోపాలు పడి సృష్టించిన వాదన ఇది. తాము దోపిడీదారులం కాదని, సంపద సృష్టిలో తమకూ భాగస్వామ్యం ఉందని బూర్జువావర్గం సమర్థించుకోవడానికి ప్రయత్నించింది. ఐతే ‘హిందూత్వ’ వాదులు బూర్జువా వర్గాన్ని సైతం మించిపోయి ఏకంగా సంపద సృష్టిలో కార్మిక వర్గానికి భాగస్వామ్యమే లేదన్నట్టు ప్రకటించేశారు. పెట్టుబడిదారులు సంపద సృష్టిలో ఒక భాగస్వాములని బూర్జువా సిద్ధాంతం చెప్తుంటే ఈ హిందూత్వవాదులు ఏకంగా పెట్టుబడిదారులు మాత్రమే సంపద సృష్టికర్తలు అని తేల్చిపారేశారు! ఇంతకన్నా బరితెగించి కార్పొరేట్లు అడ్డగోలు దోపిడీని సమర్థించే సిద్ధాంతం మరోటి ఉంటుందా? నిజానికి మానవ శ్రమ ప్రకృతి వనరులను ఉపయోగించి మనం వాడుకునే వస్తువుల్ని ఉత్పత్తి చేస్తుంది అన్నది వాస్తవమైన అర్థశాస్త్ర సూత్రం. ప్రకృతి వనరులను వస్తువులుగా మార్చేందుకు మానవులు ఉపయోగించే సాధనాలను కొద్దిమంది వ్యక్తులు చేజిక్కించుకుని వాటి యజమానులుగా మారారు. వాళ్లే పెట్టుబడిదారులు. సంపద ఉత్పత్తిలో ఏపాత్రా పోషించకపోయినా, ఉత్పత్తి సాధనాలకు తామే యజమానులు గనుక ఆ పేరుతో ఉత్పత్తి అయిన సంపదలో వాటాను చేజిక్కించుకున్నారు. అలా చేజిక్కించుకున్న దానిని ఉపయోగించి మరింత పెద్ద స్థాయి యజమానులయ్యారు. పెట్టుబడిదారుల మీద మోడీకి అభిమానం ఉంటే ఉత్పత్తి సాధనాలను పోగేసినందుకు వారిని అభినందించవచ్చు. అంతేకాని ‘పెట్టుబడిదారులే సంపద సృష్టికర్తలు’ అని ప్రకటించడం బట్టి ఉత్పత్తి విధానం అంటే ఏమిటో మోడీకి బొత్తిగా తెలియలేదని అనుకోవాలి!
ఇటువంటి అజ్ఞానాన్నే మోడీ ఇంకో ప్రకటనలో ప్రదర్శించారు. రు. 1.45 లక్షల కోట్ల కార్పొరేటు పన్ను రాయితీ ఇవ్వడం వలన కార్పొరేట్ల కంపెనీలకే గాక యావత్‌ ప్రజానీకానికే మేలు జరుగుతుందని మోడీ ప్రకటించారు! పన్ను ఎక్కువగా వసూలైతే దానిని ప్రజల కోసం ఖర్చు పెట్టవచ్చు. అదే వసూలు తగ్గితే ప్రజల కోసం పెట్టే ఖర్చు తగ్గిపోతుంది. ఇది మాములుగా ఎవరికైనా అర్థం అయ్యే విషయం. కానీ కార్పొరేట్ల నుండి వసూలు చేయవలసిన పన్నును తగ్గించివేస్తే అటు కార్పొరేట్లకూ, ఇటు 120 కోట్ల ప్రజానీకానికి-ఇరు పక్షాలకూ లాభదాయకమే అని మోడీ ప్రకటించారు. ఈ రాయితీ ఇవ్వకుండా ఉండి వుంటే ప్రజల కొనుగోలు శక్తి రు.1.45 లక్షల కోట్ల మేరకు పెరిగి వుండేది. ఆ మేరకు ఆర్థికాభివృద్ధి జరిగేది. రాయితీ ఇచ్చినందు వల్ల రు. 1.45 లక్షల కోట్ల మేరకు కార్పొరేట్ల దగ్గర ఆ సంపద మిగిలి పోయింది. వారెటూ తిరిగీ దానిని మార్కెట్లో పెట్టుబడిగా పెట్టేది లేదు. దీనివలన డిమాండ్‌ కుదించుకు పోతుంది. నిరుద్యోగం భారీగా పెరుగుతుంది. నిరుద్యోగం పెరిగితే ప్రజలకు ఏవిధంగా లాభదాయకం అవుతుంది? మోడీకే తెలియాలి మరి.
‘కార్పొరేట్లకి ఎంత మేరకు దేశ సంపదను సమర్పించుకుంటే దేశానికి అంత మంచిది’. ‘హిందూత్వ’ ఆర్థిక సిద్ధాంతం స్పష్టంగా చెప్తున్నది ఇదే. కార్మికులకి ఎంత తక్కువ ఇవ్వగలిగితే కార్పొరేట్లకి అంత ఎక్కువ కట్టబెట్టవచ్చు. అంటే కార్మికులకి ఎంత తక్కువ చెల్లిస్తే దేశానికి అంత మంచిదని ‘హిందూత్వ’ ప్రభోదిస్తుంది! అందువలన ‘హిందూత్వ సిద్ధాంతం కేవలం దళిత వ్యతిరేకమో, గిరిజన వ్యతిరేకమో, మహిళా వ్యతిరేకమో, మైనారిటీ వ్యతిరేకమో మాత్రమే కాదు. ఇది మౌలికంగానే శ్రమజీవులందరికీ వ్యతిరేకం!

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి ‘హిందూత్వ’ సిద్ధాంతం ప్రతిపాదిస్తున్న పరిష్కారం ఏమిటి? కార్పొరేట్ల చేతుల్లో మరింత సంపద చేర్చడమే. ఆ సిద్ధాంతానికి అంతకు మించి ఇంకేమీ తోచదు కూడా. అయితే ఈ విధంగా మరింత హెచ్చుగా దోచి పెట్టాలంటే ప్రజల దృష్టిని మరింత తీవ్రంగా వేరే విషయాల వైపు మళ్లించాలి. ప్రజలను మరింతగా దిగ్భ్రమకు, ఆశ్చర్యానికి గురిచేయాలి. అందుకే ‘ఒకే దేశం-ఒకే భాష’ పిలుపు. అందుకే ‘జాతీయ పౌరసత్వ రిజిస్టరు’ ప్రతిపాదన. ఇంకా..ఇంకా..ఇవన్నీ ప్రజల జీవితాలను, దేశ సమైక్యతను కకావికలం చేసేస్తున్నాయి.
పైగా కార్పొరేట్ల చేతుల్లో పోగుబడే సంపద పెరుగుతున్న కొద్దీ, సంక్షోభం తగ్గకపోగా మరింత ఉధృతం అవుతూ పోతుంది. ఈ ‘హిందూత్వ’ ప్రభుత్వం మరింతగా కార్పొరేట్లకు సంపదను కట్టబెడుతూనే ఉంటుంది. ఇంకోపక్క మతోన్మాద దాడులకు జనాల్ని బలి చేస్తూనే ఉంటుంది. ఈ మతోన్మాద దాడులు, ఆర్థిక సంక్షోభం జంటగా ముదిరిపోతూనే ఉంటాయి. దుష్ట మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు ఈ ‘హిందూత్వ’ అంతం ప్రజా ప్రతిఘటనలో ఉంది. అంతిమంగా పై చేయి సాధించేది అదే.

( స్వేచ్ఛానుసరణ : ఎం.వి.ఎస్‌ శర్మ )

Leave a Reply