వైరస్‌తో పాటు అన్ని విషాలూ విరిగిపోవాలి!

0
330
K. Srinivasulu

భయపెట్టకుండా, గుండెల్ని మెలిపెట్టకుండా రాయాలి. కాస్త ఆశ పుట్టేట్టు, పట్టేసిన ఊపిరితిత్తులకు కాసింత ఆక్సిజన్ తగిలేట్టు రాయాలి. బాధ్యత లేకుండా ఉండకూడదు కదా, ఎంతగా ఛిద్రమైపోతే మాత్రం మనసు, నెత్తురోడే శకలాలను ఉన్నవి ఉన్నట్టు పరిచేయకూడదు కదా? బెదరగొట్టకపోవడమే కాదు, దెయ్యాన్ని దాచేయాలి, కన్నీళ్లకీ, కళ్లలో మండే భీతికీ మేలి ముసుగు కప్పాలి. అప్రియవాస్తవానికి ప్రతిబింబమూ ప్రతిధ్వనీ కూడదు. చీకటిరోజుల్లో చీకటి గురించి రాయాలంటారు కానీ కవులు, వెలుతురు గురించే రాయాలి.

ఈ ఆశావహం, సానుకూలం ఏమంత ఆషామాషీ కాదు. బీభత్సాన్ని ప్రశాంతిలోకి అనువదించడం చాలా కష్టం. రాసేవాడికి అక్షరమక్షరం మరణమే. మృత్యువు వీరవిహారం నడుమ ఆక్రందనల ఆర్తనాదాల హోరులో దృశ్యాన్ని లోపలికి వొంపుకోవడమే ఒక నరకం, మృత్యుధ్వనికి కర్ణభేరిని అడ్డుపెట్టడమే భయంకర అనుభవం. ఆ పైన ఏమీ కానట్టు, ఈ రాత్రి గడుస్తుంది లెమ్మని, వెలుతురు విరుస్తుందని హామీ పడడం, ఎంత కృత్రిమం!

మనం ఇప్పుడు వల్లకాటి సమయాల్లో ఉండడమే కాదు, పరమ అసంబద్ధ ఆభాస సందర్భాలలో జీవిస్తున్నాం. ప్రాణవాయువు కోసం పరితపించే పరమ హాస్యాస్పద అభివృద్ధి కాలంలో బతుకుతున్నాం. మనిషి ఇంత కంటె ఎక్కువ హీనపడతాడా, ఇంతకు మించిన దుఃఖం ఉంటుందా, ప్లాస్టిక్ సంచుల్లోని కళేబరాలతో తాదాత్మ్యం చెందడం అంత ఊపిరాడనితనం మరొకటి ఉంటుందా, హృదయాన్ని శయ్యగా పరచి, తమ ఊపిరినే పరులకు ఊది మనుషులు అతిగొప్ప మనుషులైన సన్నివేశంలోనే, తమలోని దుర్మార్గమే ఉత్పరివర్తనం చెంది రాకాసి కీటకాలుగా మారిన అతినీచ మానవులను చూస్తున్నామా?. ఇదంతా దాటుకు వెళ్లగలిగినవారు, ఇంకొక ఏడాది తరువాత కూడా మిగిలేవారు, రానున్న సంవత్సరాలు, దశాబ్దాల పాటు ఈ దృశ్యాలను నిర్బంధంగా గుర్తు పెట్టుకుంటారు. పీడకలలుగా వాటిని కలవరిస్తారు. శ్వాసల ఎగపోతల, అంబులెన్సుల హాహాకారాల, వందలాది సామూహిక చితుల చిటపటల శబ్దాలు వారిని వెంటాడుతూనే ఉంటాయి.

ఏ రాత్రీ సులువుగా గడవదు. ఎక్కడో ఒక మిత్రుడు, ఒక బంధువు, ఒక ప్రముఖుడు, ఒక ఇష్టుడు, పుంలింగమో స్త్రీలింగమో, జ్వరపడతారు, ఆయాసపడతారు, సరిహద్దుల దగ్గర పెద్ద యుద్ధమే చేస్తారు. ఎవరి గురించో అర్ధరాత్రో, తెల్లవారో, మిట్టమధ్యాహ్నమో ఒక కబురు వస్తుంది. టీవీలోనో, ఫేస్‌బుక్ లోనో, పేపర్ లోనో ఒక ఫోటో కనిపిస్తుంది. శిరచ్ఛేదపు వరుసలో మనవంతు ఎప్పుడో అని భయం వేస్తుంది. దుఃఖపడడానికి కూడా విరామం ఉండదు. మనుషులు ఉన్న పళాన ఎగిరిపోయినప్పుడు, ఉనికి పొలిమేరల దగ్గర వారికి వీడ్కోలు చెప్పడానికి కూడా లేదు, గత్తరకాలం! వాయిదాపడ్డ స్మారకసభలెన్నో! పోగుపడిపోయిన కన్నీళ్లెన్నో! ఇదంతా ముగిసిపోయాక, ఒక ఎడతెగని సంతాప సభలో, మిగిలిపోయినందుకు, బతికి ఉన్నందుకు కించపడుతూ, ఎంత దుఃఖిస్తామో? అరచేతుల్లో పేరుకుపోయిన శానిటైజర్ల పొరలను వలుచుకుని ఎన్నెన్ని కరచాలనాలు చేస్తామో!

ఒక్క ఓదార్పు మాట విందామంటే నాయకుడికెవడికీ నోరు రాదు. అకాశం నుంచి చూస్తే దేశం వెలిగిపోతుంటుంది. ఓట్ల కోసం అన్ని కలల్ని అమ్ముతారు కదరా, ధైర్యం ఇవ్వడానికి మాత్రం నోళ్లు పడిపోతాయి! తేలుకుట్టిన దొంగలాగా దేశనాయకుడు మౌనంలోకి వెళ్లిపోతాడు. విడదీసే మాటలు చెప్పమంటే పులకించి ప్రసంగాలు చేసే నేతలకు, మనుషులందరినీ ఒక్కటిగా నిలబెట్టి ఆపద మీద దండెత్తించడం మాత్రం రాదు. కోర్టులు అదిలిస్తే కానీ రాష్ట్రాల నాయకులకు మెలకువ రాదు. కేంద్రాన్ని పల్లెత్తు మాట అనడానికి ‘పాజిటివ్’ కావడం కంటె మించిన భయం. దేశపరిస్థితి విషమించి, ప్రపంచానికే ప్రమాదకరంగా మారిపోతున్నా, జాతీయవాదానికీ, మంత్రతంత్రాలకు మాత్రం గిరాకీ తగ్గలేదు. ఇంకా కొందరు గోమయం పులుముకుని వ్యాధిని తరిమికొడుతున్నారు. గోపంచకాన్ని అందరికీ సిఫారసు చేస్తున్నారు. జిస్ దేశ్ మే గంగా బహ్తీ హై, రామ్ తేరీ గంగా మైలీ, చుట్టలు చుట్టిన కళేబరాలు ప్రవహిస్తున్నాయి. విపత్తుకోసం దొరకని విత్తం, వైభవోపేతమైన విస్టా కోసం వర్షిస్తుంది. భూటాన్, బంగ్లాదేశ్ సాయం చేసినందుకు జాతీయవాదం గర్విస్తుంది. టీకాలు అమ్మకానికి పెడతామని చెప్పినందుకు మార్కెట్ హర్షిస్తోంది. అప్పుడప్పుడు పెదవి విప్పి, ప్రతిపక్షం నిద్రిస్తోంది.

సమాజాన్ని, ప్రజలను నిందిస్తాము. కుంభమేళా జనాల్ని, బెంగాల్ ఎన్నికల ర్యాలీలను చూస్తే ఎవరికైనా కోపమూ నిస్సహాయతతో కూడిన బాధా కలుగుతాయి. తమ ప్రాణాల విషయంలో వారెందుకు బాధ్యతగా ఉండరు, ఇతరుల ప్రాణాల విషయంలో అంత నిర్లక్ష్యంగా ఉండే హక్కువారికేముంది- ఈ ప్రశ్నలన్నీ సహజమే. కానీ, తప్పు వారిది మాత్రమే కాదు. వారి మనసుల్లోకి చొరబడే భావాలు, అభిప్రాయాలు వారికి సరైన జ్ఞానాన్ని ఇవ్వడం లేదు. వ్యాపిస్తున్న జబ్బు గురించి తెలియకపోవడం, అది తమకు సోకదని, సోకినా తమనేమీ చేయదని అనుకోవడం, సకాలంలో వైద్యసహాయం అందుకోవాలన్న అవగాహన లేకపోవడం, ఇవన్నీ వారిని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఒకపక్క ప్రపంచానికే టీకా అందిస్తున్నామని సైంటిఫిక్‌గా గర్వపడే దేశంలోనే, కరోనా గురించి అనేక మూఢమైన, మూర్ఖమైన నమ్మకాలు వ్యాపింపజేస్తున్నారు. వారూ వీరూ వేరువేరు కాదు, అధికారంలో ఉన్నవారిలోనే కొందరు అట్లా మాట్లాడతారు, మరికొందరు ప్రజలను ఇట్లా ఉద్దీపింపజేస్తారు. ప్రజలకు కనుక నిజంగా అవగాహన ఉన్నా, ఈ ప్రభుత్వాల కారణంగా కరోనా వ్యాప్తి పరిమితంగా ఉండేది కాదనిపిస్తుంది. గత ఏడాది కొన్ని రోజులు లాక్ డౌన్ విధించిన తరువాత, ఆంక్షలన్నీ దాదాపుగా సడలించారు. రెండో విడత దాడి మొదలయినప్పుడు ప్రజలు ఆదమరచి ఉన్నారు, ముప్పు తెలిసినా ప్రభుత్వం హెచ్చరికలు చేయలేదు. సోకిన వారు సకాలంలో జాగ్రత్త పడి ఆస్పత్రులకు వస్తే, వారికి చికిత్స చేసేంత వ్యవస్థ మనకున్నదా అని కూడా ఆలోచించాలి. తమ తమ ఇళ్లలోనూ, ఆస్పత్రిదారులలో మార్గమధ్యంలోనూ ఎందరు చనిపోయారో తెలియదు. అనేక అంశాలపై కనీస అవగాహన ఉంటే తప్ప, ఇటువంటి కల్లోల సందర్భాలలో ప్రజలు స్వచ్ఛందంగా సహకరించరు. రాజకీయ నాయకత్వం, ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధితో వ్యవహరిస్తే, ప్రజలలో ఉన్న అజ్ఞానాన్ని, సహకార లోపాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. ఇంతకాలంగా కనీసస్థాయిలో మాత్రమే ఉంచుతూ వచ్చిన ఆరోగ్య వ్యవస్థ, ఒక్కసారిగా కరోనా తుఫానుకు అల్లాడిపోయింది. ఎన్నెన్ని కొరతలు ప్రాణాలు తీసి ఉండవచ్చును కానీ, ఆస్పత్రులలో ఉన్నంత మంది మనుషులలో రోగులకు చేసిన సేవల్లో మాత్రం కొరతలేదు.

ఆశపడాలంటే వర్తమానంలో ఏమీ లేదు. కళ్లెదుట కనిపిస్తున్న సన్నివేశంలో ఏమీ దొరకదు. చరిత్రలోకి వెళ్లాలి. తాత్వికతలోకి మళ్లాలి. ఏదీ శాశ్వతం కాదు. ఈ ఉత్పాతమూ ఎల్లకాలం ఉండదు- అన్నది వేదాంతం కావచ్చు, చీకటి విడిపోతుందన్నది మానవానుభవం ఇచ్చే ఆశ. ఎన్ని కల్లోలాలు చూడలేదు ఈ భూమి, ఎన్నెన్ని కరువు కాటకాలను, గత్తరలను దాటి రాలేదు, ప్రపంచం అంతా తుడిచిపెట్టుకుపోదులే, అందులో మనం ఉంటామా లేదా అన్నది ఒక ప్రశ్నే కానీ, ఎవరో ఒకరు ఉంటారన్నది కూడా వాస్తవం. ఈ ముక్కుముసుగులూ దూరాలూ కొంతకాలం పాటించి, ఆ తరువాత లోకం ఏమీకానట్టు పాత ఒరవడిలోకి వెళ్లిపోవచ్చు, లేదా కొత్త దారులకు మళ్లవచ్చు. ఆస్పత్రులకు, ఆరోగ్యరంగానికి చికిత్స చేయమని అడగడానికి ఇది ఒక అవకాశం. వైరస్ కంటె ప్రమాదకరమైనదిగా మారిన మతతత్వాన్ని తరిమి కొట్టడానికి కూడా ఇది ఒక అదునైన సమయం. వైఫల్యాలలో వాళ్లు కొట్టుమిట్టాడుతున్నారు. నోట మాట కూడా పెగలడం లేదు. మనసులో ఏ వ్యూహాలు రూపుదిద్దుకుంటున్నాయోనన్న భయాలు ఉన్నాయి కానీ, ప్రపంచం దృష్టిలోనే పలచన అయి, ఎడతెగని చావుల పరంపరకు జవాబు చెప్పుకోలేక మొహం చాటు చేసుకోవలసి వచ్చిందేమో తెలియదు.

పరస్పరత ఒక్కటే మనుషులను కాపాడే విలువ. ప్రేమ ఒక్కటే ఔషధం. ఈ కష్టకాలపు అరిష్టాలను, దుష్టత్వాలను అన్నిటినీ గుర్తుపెట్టుకోవాలి. వాటన్నిటికీ యాంటీ బాడీలను సమాజంలో నిర్మించుకోగలగాలి. మంచి సమాజం అన్నది ఒక స్వప్నమే కాదు, వర్తమానంలో మనుగడకు ఒక ఆలంబన కూడా.

Courtesy Andhrajyothi

Leave a Reply