ఆకలి చంపేస్తుంది!

0
255

-లాక్‌డౌన్‌, కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో ఆకలి కేకలు
– ఈ ఏడాది తీవ్రమైన ఆకలి సమస్యల్లో 12.1కోట్లమంది
– కరోనా కన్నా.. ఆకలితో చనిపోయేవారు ఎక్కువ : ఆక్స్‌ఫామ్‌
– ఇండియాలో ఆర్థిక అసమానతలు తీవ్రతరం
– 19.5కోట్లమందికి పౌష్టికాహారలోపం

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో లాక్‌డౌన్‌ అమలవుతున్నది. ఈనేపథ్యంలో ఆర్థిక, సామాజిక వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమై పోతు న్నాయి. వివిధ దేశాల్లో ఆకలి కేకలు పెరుగుతా యని, 12.1కోట్లమంది ప్రజలు తీవ్రమైన ఆకలి సమస్యలో కూరుకుపోయారని ‘ఆక్స్‌ఫామ్‌’ తాజా నివేదిక అంచనావేసింది. ఈ ఏడాది కరోనా వైరస్‌ బారిన పడి చనిపోయేవారి సంఖ్యకన్నా, ఆకలితో చనిపోయేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని నివేదిక తెలిపింది. ‘ద హంగర్‌ వైరస్‌ : హౌ కోవిడ్‌-19 ఈజ్‌ ఫ్యూయెల్లింగ్‌ హంగర్‌ ఇన్‌ ఏ హంగ్రీ వరల్డ్‌’ అనే పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. ఇందులో పేర్కొన్న మరికొన్ని విషయాలు ఇలాఉన్నాయి.. కోవిడ్‌-19 కారణంగా తలెత్తిన సంక్షోభంలో చిక్కుకుపోయి ఈ ఏడాది ఆకలితో అలమటించి ప్రతి రోజూ ప్రపంచవ్యాప్తంగా 12వేల మంది చనిపోతారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యధికంగా ఏప్రిల్‌లో రోజుకు 10వేలమంది చనిపోయారు. నిరుద్యోగం, ఆహార దిగుమతులు పడిపోవటం, సరఫరా దెబ్బతినటం, మానవ సహాయం దొరకకపోవటం వంటివి మరణాల సంఖ్యను పెంచుతున్నది.

పేదలు మరింత పేదరికంలోకి..
ప్రపంచవ్యాప్తంగా పేదలు మరింత పేదరికంలోకి కూరుకుపోయారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవటమే కాదు, ప్రజలు ఆకలి సమస్యలో చిక్కుకుపోకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ఆక్స్‌ఫామ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డానీ స్రిస్కందరాజా అన్నారు. ప్రపంచ దేశాలు ఐక్యరాజ్యసమితికి వీలైనంతగా నిధులు అందజేస్తేనే కరోనా మహమ్మారిని ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందని ఆయన అన్నారు.

ఆకలిలో 10 హాట్‌స్పాట్స్‌
ప్రపంచంలో ఆకలి సమస్య తీవ్రంగా ఉన్న 10 కేంద్రాలను హాట్‌స్పాట్స్‌గా గుర్తించామని ఆక్స్‌ఫామ్‌ నివేదిక తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా ఆఫ్ఘనిస్తాన్‌, సిరియా, దక్షిణ సూడాన్‌…తదితర దేశాల్లో ఆకలి కేకలు పెరుగుతున్నాయి. దేశాల మధ్య సరిహద్దులు మూసేయటం, కర్ఫ్యూ, రవాణా ఆంక్షలు…మొదలైనవి ఆహార ఉత్పత్తుల సరఫరా, దిగుమతిని దెబ్బతీస్తున్నాయని నివేదిక తెలిపింది.

ప్రమాదపుటంచున ఇండియా
ఇండియా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ లాంటి వర్ధమాన దేశాల్లో వైరస్‌ వ్యాప్తి నానాటికీ పెరుగుతున్నది. అలాగే ఈ దేశాల్లో క్రమంగా ఆకలి సమస్య కూడా తీవ్రతరమవుతున్నది. ఇండియా విషయానికొస్తే, 19.5కోట్లమందిలో పౌష్టికాహార సమస్య తలెత్తవచ్చు. దేశ జనాభాలో ఇది 14.5శాతం. తద్వారా సామాజికంగా, ఆర్థికంగా అసమానతలు తీవ్రతరమవుతాయి. గ్రామీణ భారతంలో ప్రభుత్వ వ్యయం తగ్గటం ద్వారా ఆహార ఉత్పత్తుల సరఫరా గొలుసు దెబ్బతింటుంది. కష్టాల్లోఉన్నవారికి సామాజిక సహాయం అందదు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులు వారిని వేధిస్తాయి. మైనార్టీ వర్గాలు, మహిళలు, పిల్లలు తీవ్రమైన ప్రతికూల వాతావరణంలోకి వెళ్లిపోతారు.

  • లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చి 5 వారాలు గడిచిన తర్వాత 12 రాష్ట్రాల్లో సర్వే నిర్వహించి ఆక్స్‌ఫామ్‌ ఈ నివేదకను రూపొందించింది.
  • లాక్‌డౌన్‌ ప్రారంభమయ్యాక, సరిగ్గా భోజనం చేయలేకపోతున్నామని సర్వేలో పాల్గొన్న సగం మంది చెప్పారు.
  • ఆదాయంలేక ఇంట్లో ఉన్నవి అమ్ముకుంటున్నామని 22శాతం మంది చెప్పారు.
  • వడ్డీ వ్యాపారస్తుల నుంచి అప్పులు తీసుకున్నామని 16శాతం మంది చెప్పారు.
    ఇండియాలో హఠాత్తుగా ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా, సామాజికంగా వెనుకబడిన 4 కోట్లమంది ఒక్కరోజులో ఉపాధి కోల్పోయారు. వలస కార్మికులు, ఇండ్లల్లో పనిచేసేవారు, వీధి వ్యాపారులు, దినసరి కూలీలు పెద్ద సంఖ్యలో ఉపాధిని కోల్పోయారు. ఇప్పుడు వీరంతా తీవ్రమైన ఆకలి సమస్యలో చిక్కుకున్నారు. మరోవైపు ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. కొన్ని వందల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి పనులు చేసుకోవాల్సి వస్తున్నది.

కరోనా వైరస్‌ సృష్టించిన సంక్షోభం వివిధ దేశాల సామాజిక, ఆర్థిక ముఖచిత్రాన్నే మార్చేస్తుంది. నిరుద్యోగ సమస్య, ఆహార ఉత్పత్తి తగ్గటం..వంటివి కొత్త సమస్యలు తెచ్చిపెడతాయి. కరోనా మహమ్మారి బారినపడి చనిపోయేవారి సంఖ్య కన్నా ఆకలితో అలమటించి చనిపోయేవారు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతారు.
– ‘ద హంగర్‌ వైరస్‌’-ఆక్స్‌ఫామ్‌ నివేదిక

Courtesy Nava Telangana

Leave a Reply