- భార్య, ఆమె ప్రియుడు, వారి 10నెలల బిడ్డపై పెట్రోలు పోసి నిప్పు
- ప్రేమించి పెళ్లాడి మరొకరితో సహజీవనం చేస్తోందని భర్త దుర్మార్గం
- హైదరాబాద్‌లో నడిరోడ్డు మీద ఘటన
- బిడ్డ మృతి.. మరో ఇద్దరు చావుబతుకుల్లో
- వాడిని ఊరితీయండి.. బాధితుల ఆక్రందన
హైదరాబాద్ సిటీ/అడ్డగుట్ట : ఒళ్లంతా ఆవహించిన ఈర్ష్యతో విచక్షణే మరిచాడతను. ప్రేమించి పెళ్లాడి, కొడుకు పుట్టాక భార్య.. తనను కాదని మరొకరితో వెళ్లిపోయి.. అతడితో సహజీవనం చేస్తూ బిడ్డను కని ఆనందంగా ఉంటోందని ఆ భర్త కసితో రగిలిపోయాడు. భార్యను, ఆమె ప్రియుడిని, 10నెలల బిడ్డ.. ముగ్గురినీ చంపేయాలనుకున్నాడు. పథకం ప్రకారం..నడిరోడ్డు మీద కాపుగాసి ముగ్గురిపైనా పెట్రోలు కుమ్మరించి నిప్పంటించాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నారాయణగూడలో జరిగింది. మంటలకు ఒళ్లంతా కాలిపోవడంతో చంటిబిడ్డ ప్రాణాలు విడిచాడు. భార్య, ఆమె ప్రియుడు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. నారాయణగూడ ఎస్‌హెచ్‌వో శ్రీనివాసరెడ్డి, బాధితురాలి తల్లి వివరాల ప్రకారం.. అంబర్‌పేటకు చెందిన నాగుల సాయి (35), చిక్కడపల్లిలోని మునిసిపల్ మార్కెట్ సమీపంలో నివాసం ఉంటున్న లక్ష్మీబాయి కూతురు ఆర్తి (25) ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఇద్దరూ కలిసి నారాయణగూడ ఫ్లై ఓవర్ వద్ద పువ్వులు అమ్ముతూ ఉపాఽధి పొందుతున్నారు. వీరికి మూడేళ్ల కుమారుడు చరణ్ ఉన్నాడు. పెళ్లయిన తొలి నాళ్ల నుంచే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఫలితంగా రెండేళ్ల క్రితం సాయి ఇంటి నుంచి ఆర్తి బయటకొచ్చేసింది. కొడుకు చరణ్‌ను తల్లి లక్ష్మీబాయి వద్ద ఉంచి సోదరుడు జితేందర్‌లతో కలిసి నివాసం ఉంటోంది. కొన్నాళ్లకు చిక్కడపల్లిలో ఉండే నాగరాజుతో ఆర్తికి పరిచయం ఏర్పడి, అతడితో సహజీవనం చేస్తోంది. వీరికి కుమారుడు విష్ణు (10నెలలు) పుట్టాడు. అయితే తన భార్య, మరో వ్యక్తితో సహజీవనం చేస్తుండటాన్ని జీర్ణించుకోలేకపోయిన సాయి… ఆర్తిని, నాగరాజును, విష్ణును చంపాలని పథకం వేశాడు. సోమవారం రాత్రి విష్ణుతో కలిసి ఆర్తి, నాగరాజు నారాయణగూడ చౌరస్తా వద్దకొచ్చారు. అక్కడికి ఓ మగ్గు నిండా పెట్రోలుతో వచ్చిన సాయి.. దాన్నంతా ముగ్గురిపైనా చల్లాడు. నిప్పంటించి పారిపోయాడు. సాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
భరించలేనంత గాయాల్లోనూ ఒకరి గురించి మరొకరు..
ఆర్తి, నాగరాజు గాంధీ ఆస్పత్రిలోని ఆరో అంతస్తులో ఎదురెదురు వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఉదయం పురుషుల వార్డులో చికిత్స పొందుతున్న నాగరాజు… మహిళల వార్డులో చికిత్స పొందుతున్న ఆర్తి భరించలేనంత గాయాల తాలూకు బాధలోనూ ఒకరి ఆరోగ్యం గురించి మరొకరు వాకబు చేసుకోవడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఇద్దరి వాంగుల్మాన్ని పోలీసులు నమోదు చేశారు. సాయి తమపై పెట్రోలు పోసి నిప్పంటించడంతో ఒడిలో ఉన్న చిన్నారితో కలిసి పరుగులు తీశానని.. ఆ తర్వాత జరిగిందేమిటో తనకు గుర్తులేదని ఆర్తి చెప్పింది. తామేం పాపం చేశామని.. నాగుల సాయి ఎందుకు ఇలా చేశాడో అర్థం కావడం లేదని.. అతడిని ఉరితీయాలంటూ నాగరాజు, పోలీసులు, వైద్యులకు ప్రాదేయపడ్డాడు.