చనిపో.. చనిపో

0
81
  • భార్య ఉరి వేసుకుంటుంటే..
  • భర్త ఆపకుండా ఫోన్‌తో వీడియో 
  • కళ్ల ముందే ఇల్లాలు నిర్జీవం 
  • బంధువులకు వీడియో పంపిన వైనం 

ఆత్మకూరు : మద్యానికి బానిసైన భర్త అనుమానంతో రోజూ వేధిస్తున్నా ఓర్పుగా భరించింది. అయినా మార్పు రాకపోవడంతో విసిగిపోయి భర్త కళ్ల ముందే భార్య ఉరి వేసుకుంటుంటే ఆపాల్సింది పోయి.. చనిపో, చనిపో.. అంటూ సెల్‌ఫోన్‌తో వీడియో తీస్తూ పైశాచిక ఆనందం పొందాడు. భర్త కళ్లెదుటే ఆ ఇల్లాలు బలవన్మరణం చెందింది. ఆ తర్వాత బంధువులకు వీడియో పంపాడు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఈ విషాదకర ఘటన జరిగింది. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది. పోలీసుల కథనం మేరకు… ఆత్మకూరులో ఉంటున్న మొద్దు పెంచలయ్య, మొద్దు కొండమ్మ(30)లకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. పెంచలయ్య ఓ ప్రైవేటు బ్యాంకు ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. కొండమ్మ మెప్మా కార్యాలయంలో రిసోర్స్‌ పర్సన్‌గా పని చేస్తోంది. అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితంలో మద్యం, అనుమానం చిచ్చు రేపాయి.

మద్యానికి బానిసైన పెంచలయ్య నిత్యం తాగివచ్చి భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి పెంచలయ్య భార్యతో గొడవపడ్డాడు. భర్త సూటిపోటి మాటలు, వేధింపులు భరించలేక క్షణికావేశానికి లోనైన ఆమె ఉరేసుకుని చనిపోతానని హెచ్చరించింది. భర్త సముదాయించక పోగా వెటకారంగా మాట్లాడాడు. మనస్తాపం చెందిన కొండమ్మ ఇంట్లో ఫ్యాన్‌కు చీరకొంగుతో ఉరేసుకుంది. ఆమె గిలగిలా కొట్టుకుంటుంటే, కాపాడాల్సింది పోయి పెంచలయ్య వీడియో తీస్తూ ఉండిపోయాడు. అతడి కళ్ల ముందే ఆమె నిర్జీవంగా మారింది. చివరకు తేరుకున్న పెంచలయ్య మిత్రుడి సాయంతో ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మరణించిందని నిర్ధారించారు. పోలీసులు పెంచలయ్యను అదుపులోకి తీసుకున్నారు.

Courtesy Andhrajyothi

Leave a Reply