వరదలా బాధితులు

0
209
  • మీ-సేవ కేంద్రాల వద్ద పెరిగిన తాకిడి..
  • ఉదయం ఆరింటి నుంచే దరఖాస్తుకు నిరీక్షణ 
  • ఇప్పటివరకు రూ.600 కోట్లు పంపిణీ
  • మంగళవారం 11,650 మంది దరఖాస్తు 
  • గతంలో సాయం తీసుకున్న వారూ మళ్లీ అర్జీ  

హైదరాబాద్‌ సిటీ : వరద సాయం రూ.10వేలు పొందేందుకు హైదరాబాద్‌లో జనం రెండోరోజు కూడా మీ-సేవ కేంద్రాలకు పోటెత్తారు. ఉదయం ఆరు గంటల నుంచే క్యూలైన్లలో నిల్చున్న ప్రజలు..  ఆకలి దప్పులు దిగమింగుకొని..  కరోనా ఆందోళనను పక్కనబెట్టి రోజంతా నిరీక్షించారు. వందల సంఖ్యలో జనం రావడంతో మీ-సేవ కేంద్రాల పరిసరాలు కిక్కిరిపోయాయి. నాలుగు రోజుల క్రితం దాకా 5.5లక్షల మందికి నేరుగా రూ.10వేల సాయాన్ని అందించారు. అయితే వరద సాయం పంపిణీలో అవకతవకలు చోటు చేసుకున్నాయని, అసలు బాధితులకు సాయం దక్కలేదని ఆరోపణలు రావడంతో మునిసిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ఓ ప్రకటన చేశారు. సాయం పొందని బాధితులెవరైనా మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే ఖాతాల్లో నగదు జమచేస్తామని పేర్కొన్నారు.

దీంతో కూలీ పనులు, రోజువారీగా చేసే వృత్తులను మానుకుని మీ-సేవ సెంటర్ల ముందు జనం పోగయ్యారు. సోమవారం దరఖాస్తు చేసుకున్న  6,263 మందికి మంగళవారం ఉదయం 6 గంటల వరకు ఖాతాల్లో రూ.10వేల చొప్పున జమచేశారు. దరఖాస్తులు అందజేసిన ఒక్క రోజే రూ.50 కోట్లు విడుదల చేసినట్లు సమాచారం. దరఖాస్తు చేసిన వెంటనే డబ్బులొస్తున్నాయని తెలియడంతో నగరంలోని ఆయా ప్రాంతాల్లో దరఖాస్తు చేసుకోని ప్రజలంతా మీ-సేవ కేంద్రాలకు తరలివెళ్లారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవడంతో ఆలస్యం చేస్తే ఖాతాల్లో డబ్బులు పడవేమోననే ఆందోళనతో కూడా పనులు మానుకొని క్యూ కట్టారు. కొంతమంది తమ పిల్లలను ఉదయం 6 నుంచే కేంద్రాల్లో క్యూలైన్‌లో నిలబెట్టినట్లు తెలిసింది. అనంతరం ఇంట్లోని పెద్దలు ఆధార్‌కార్డు, పాస్‌బుక్‌, కరెంట్‌ బిల్లు జిరాక్స్‌ను పట్టుకుని వెళ్లి పిల్లల స్థానంలో నిలబడ్డారు. నగర వ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో మొత్తంగా 11,650 మంది దరఖాస్తు చేసుకున్నట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి. నగరంలో వరద సాయం కింద ఇప్పటివరకు ఆరు లక్షల కుటుంబాలకు రూ.600 కోట్ల సాయాన్ని అందించినట్లు సమాచారం.

తోపులాటలు.. ఘర్షణలు
ఇప్పటికే రూ.10వేల సాయం పొందిన వారిలో కొందరు మళ్లీ మీ-సేవలో దరఖాస్తు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వర్షం పడిన తర్వాత మూడు రోజులకు ఇంటివద్దకు వచ్చిన అధికారులు బాధితుడి ఆధార్‌ జిరాక్స్‌, సెల్‌లో ఫొటో మాత్రమే తీసుకుని డబ్బులు పంపిణీ చేశారు. అప్పుడు తీసుకున్న వారి పత్రాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో చాలామంది తిరిగి డబ్బులు పొందేందుకు మీ-సేవ కేంద్రాలకు తరలివెళ్తుండటంతో పోటీ నెలకొంటుంది.

గోల్నాక, రామంతాపూర్‌, ఎల్‌బీనగర్‌, టోలీచౌకీ ప్రాంతాల్లో గతంలో నగదు సాయం పొందిన పలువురు మంగళవారం మీ సేవలో దరఖాస్తు చేసుకునేందుకు వచ్చారు. దీంతో ఇప్పటివరకు డబ్బులు పొందని వారు మళ్లీ దరఖాస్తు చేసుకుంటున్న వారితో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. తీసుకున్న వారే తిరిగి దరఖాస్తు చేసుకోవడం ఏమిటని నిలదీశారు. మోతీనగర్‌, గోల్నాక, రామంతాపూర్‌లో బాధితుల నడుమ తోపులాటలు, ఘర్షణలు చోటుచేసుకోగా పోలీసులు వారిని అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కృష్ణాననగర్‌, యూసు్‌ఫగూడ, వెంగళరావునగర్‌ ప్రాంతాల్లోని మీ-సేవ కేంద్రాల వద్ద జనం రద్దీ జాతరను తలపించింది.

ఎమ్మెల్యే మాగంటికి నిరసన సెగ
జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు వరద బాధితుల నుంచి నిరసన సెగ తగిలింది. బోరబండలోని సంజయ్‌నగర్‌ మీదుగా కారులో ఆయన వెళుతుండగా అక్కడ ఓ మీ-సేవ కేంద్రం వద్ద మహిళలు పెద్ద ఎత్తున ఉండడాన్ని గమనించి కారు దిగారు. అప్పటికే అక్కడ మీసేవాసెంటర్‌  మూసి ఉండటం.. గంటల తరబడి నిరీక్షించి ఓపిక నశించడంతో మహిళలంతా తమ కోపాన్ని ఎమ్మెల్యేపైన చూపారు.

ఒక మహిళ పెద్దగా తిడుతూ మాగంటి వైపునకు దూసుకురావడంతో ఆమెను ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారు. ‘వరద సాయం మీ పార్టీ వారికే ఇస్తారా? వాస్తవంగా వరదల్లో నష్టపోయిన వారికి ఎందుకు ఇవ్వడం లేదు? మీ-సేవలో దరఖాస్తు ఫారానికి రూ. 100 తీసుకుంటున్నారు’ అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో ఎమ్మెల్యే అనుచరులు వాగ్వాదానికి దిగారు.

Courtesy Andhrajyothi

Leave a Reply