జాతీయ పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన గవర్నర్
కవాడిగూడ, న్యూస్‌టుడే: పుస్తక ప్రియులు ఎదురుచూస్తున్న పుస్తకాల పండగ ఆరంభమైంది. తెలంగాణ కళాభారతి మైదానం(ఎన్టీఆర్ స్టేడియం)లో హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 33వ జాతీయ పుస్తక ప్రదర్శనను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పుస్తకానికి వెల కట్టగలుగుతాం కానీ అది అందించే జ్ఞానానికి వెల కట్టలేమని అన్నారు. తాను గవర్నర్‌గా ఇక్కడికి రాలేదని, ఒక పుస్తక ప్రేమికురాలిగా వచ్చానన్నారు. తన నిత్య జీవితంలో పుస్తకం చదవని రోజు లేదన్నారు. బాలలకు పుస్తకాలు చదవడం అలవాటు చేయాలని సూచించారు. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందు, తర్వాత విషయాలను పుస్తకాల రూపంలో తేవాలని రచయితలను కోరారు. అంతకు ముందు పుస్తక ప్రదర్శన ఆవరణలో ఏర్పాటు చేసిన పీవీ నర్సింహారావు విగ్రహం వద్ద గవర్నర్ నివాళులు అర్పించి, ఆయనపై రచించిన మూడు పుస్తకాలను ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాలు, ‘ఈనాడు’ దినపత్రిక, తెలుగు వికీపీడియా, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వెలువడిన పుస్తకాల స్టాలు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖల స్టాళ్లను ఆమె సందర్శించారు. తెలుగులో ఉన్న తెలంగాణ చరిత్ర పుస్తకాలను ఆంగ్లంలో తర్జుమా చేసి ఇవ్వాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కోరారు. కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గంటా చక్రపాణి, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్ష, కార్యదర్శులు జూలూరి గౌరీశంకర్, కోయ చంద్రమోహన్, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
(Courtesy Eenadu)