చార్జీలతో బాదేస్తున్న విదేశీ కార్పొరేట్
- గతంలో ఏటా 5 శాతమే చార్జీల పెంపు
- ఇప్పుడు 20 నుంచి 25 శాతం బాదుడు
- గుండె, మోకీలు, కేన్సర్ చికిత్సలే కామధేనువులు
- కేంద్రం ధరలు తగ్గించినా ప్రొసీజర్లు అంటూ దోపిడీ
- టెస్టుల పేరిటా వడ్డన
- ఆస్పత్రులపై ప్రభుత్వ నిఘా, పర్యవేక్షణ కరువు
- కేన్సర్ వ్యాప్తిని గుర్తించేందుకు చేసే పెట్ స్కాన్‌ను రెండేళ్ల కిందటి వరకూ రూ.18 వేలకు చేసేవారు. ఇప్పుడు దానిని ఏకంగా రూ.25 వేలకు పెంచేశారు. లిపిడ్ ప్రొఫైల్ బయట రూ.400కు చేస్తున్నారు. కానీ, విదేశీ కంపెనీలు టేకోవర్ చేసిన ఆస్పత్రుల్లో రూ.1200కుపైనే వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రులు విదేశీ సంస్థల గుప్పిట్లో చిక్కుకోవడంతో రోగులపై తీవ్రమైన భారం పడుతోంది.
ప్రైవేటు ఆస్పత్రుల్లో పెట్టుబడులు పెడుతున్న విదేశీ సంస్థలు స్వల్ప కాలంలోనే లాభాలను ఆశిస్తున్నాయి. అందుకోసం రోగుల నుంచి వసూలు చేసే వివిధ రకాల చార్జీలు, ఫీజులపై దృష్టి సారిస్తున్నాయి. వాటాల కొనుగోలుతో ఆస్పత్రి తమ అధీనంలోకి వచ్చిన వెంటనే విదేశీ సంస్థలు, సేవల ధరలను పెంచేస్తున్నాయి. ఇందుకు ప్రధానంగా మూడు మార్గాలను ఎంచుకుంటున్నాయి. అవి.. పరీక్షలు, శస్త్ర చికిత్సలు, రూమ్ చార్జీలు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో దాదాపు రెండు వేల రకాల పరీక్షలు చేస్తున్నారు. గతంలో అన్నింటిపైనా ఏటా 5 శాతం చార్జీలు పెంచితే.. విదేశీ కంపెనీలకు వాటాల విక్రయం అనంతరం ఏటా 20-25 శాతం వరకూ పెంచుతున్నారు. సర్జరీలపై 20-25 శాతం, పరీక్షలపై 15-20 శాతం, రూమ్ చార్జీలపై 10-15 శాతం పెంచుతున్నట్టు ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో పని చేసే డాక్టర్ చెప్పారు.
సర్జరీ ప్యాకేజీలో దోపిడీ..గుండె, మోకీలు, కేన్సర్ శస్త్ర చికిత్సలు కార్పొరేట్ ఆస్పత్రులకు కామధేనువులుగా మారాయి. వీటికి సంబంధించి మందులు, శస్త్ర చికిత్సల ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించినా.. వాటిని రోగులకు అందించడం లేదు. రేడియేషన్ ఆంకాలజీ చికిత్సకు సంబంధించి దేశంలోని వివిధ మెట్రోపాలిటన్ నగరాల కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ చార్జీలు వసూల్ చేస్తున్నారు. మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నైల్లో తక్కువ ధర అంటే, రూ.2.50 లక్షలకే ఆ సేవలు అందిస్తుంటే.. హైదరాబాద్‌లో మాత్రం రూ.3 లక్షల నుంచి మొదలవుతోంది. అదే వైద్య చికిత్సకు ఇతర నగరాల్లో గరిష్ఠంగా రూ.4.75 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య అవుతుంటే.. మన దగ్గర మాత్రం రూ.5.50 లక్షలు అవుతోంది. అలాగే, మోకీలు శస్త్ర చికిత్సల ఖర్చు రూ.1.50 లక్షలు ఉండేదని, దానిని కాస్తా రూ.2.50 లక్షలకు పెంచేశారని విదేశీ సంస్థల వాటా ఉన్న కార్పొరేట్ ఆస్పత్రిలో పనిజేసే డాక్టర్ ఒకరు వెల్లడించారు.
నిజానికి, మోకీలు శస్త్ర చికిత్సలకు ఉపయోగించే పరికరాల ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. అయినా, ఆస్పత్రులు ధరలను పెంచేయడం గమనార్హం. ఇక, వెన్నుపూస సర్జరీ చార్జీలను కూడా రెట్టింపు స్థాయిలో పెంచేశారు. గుండె శస్త్ర చికిత్సకు సంబంధించి రెండు మూడేళ్ల కిందటి వరకూ రూ.1.80 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు చార్జీలు వేసేవారు. అప్పుడు స్టెంట్ ధరలు విపరీతంగా ఉండేవి. కేంద్రం రంగంలోకి దిగి స్టెంట్ల ధరలను అమాంతం తగ్గించింది. గతంలో స్టెంట్ ధర రూ.75 వేల నుంచి లక్ష వరకూ ఉండేది. అదిప్పుడు రూ.30 వేలకే వస్తోంది.
కానీ, విదేశీ వాటాలు కలిగిన కార్పొరేట్ ఆస్పత్రులు మాత్రం సర్జరీ ప్రొసీజర్స్ పేరుతో ఇప్పటికీ అంతే వసూల్ చేస్తున్నాయి. ఇక, రూమ్ చార్జీలను కూడా ఏటా 10-15 శాతం పెంచేస్తున్నాయి. అంతేనా, గతంతో పోలిస్తే ఇప్పుడు కన్సల్టేషన్ ఫీజుల రూపంలో కూడా బాదేస్తున్నారు. రోగి రావడం పాపం.. టెస్టుల మీద టెస్టులు రాసేస్తున్నారు.
రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్ చికిత్స నిమిత్తం ఇటీవల ఒకరు ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లారు. గంటపాటు వెయిటింగ్ తర్వాత అపాయింట్‌మెంట్ లభించింది. డాక్టర్ మూడంటే మూడే నిమిషాలు చూశారు. ఇందుకు ఏకంగా రూ.1250 కన్సల్టేషన్ ఫీజ్ తీసుకున్నారు. 30 టెస్టులు రాశారు. వాటిని అప్పటికే చేయించడంతో రిపోర్టులను సదరు డాక్టర్‌కు చూపించారు. రీ చెక్ చేద్దాం అంటూ మళ్లీ అవే టెస్టులు చేయించాలని తేల్చి చెప్పేశారు.
నిజానికి, ఈ కార్పొరేట్ ఆస్పత్రులను స్థాపించిన వైద్య ప్రముఖులంతా ఎంతో కొంత సేవ చేయాలనే ధోరణితో వాటిని నెలకొల్పారు. రాన్రాను ఆ పరిస్థితి మారిపోయింది. మార్కెట్లో పోటీ కార్పొరేట్ ఆస్పత్రి ఒక కొత్త రకం పరీక్షా యంత్రాన్నో, శస్త్ర చికిత్స మిషన్‌నో తీసుకువస్తే.. మనం ఎందుకు తీసుకురాకూడదన్న ధోరణి పెరుగుతోంది. పోటీ వాతావరణానికి తోడు పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోకపోతే మార్కెట్లో నిలబడలేమని భావిస్తున్నారు. అందుకు భారీ పెట్టుబడి కావాల్సి వస్తోంది. వాటాలను విదేశీ సంస్థలకు విక్రయిస్తున్నారు. రోగులకు వైద్య సేవలను మరింత భారం చేస్తున్నారు.
పర్యవేక్షణ ఏదీ!?…కార్పొరేట్ ఆస్పత్రుల్లో అడ్డు అదుపు లేకుండా పెంచేస్తున్న చార్జీలపై పర్యవేక్షణ ఉండడం లేదు. వాస్తవానికి, ఇటువంటి వాటికి చెక్ పెట్టేందుకే కేంద్రం క్లినికల్ ఎస్టాబ్లి్‌షమెంట్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఏయే పరీక్షలకు ఎంత రేటు ఉండాలి? ఏయే శస్త్ర చికిత్సలకు ఎంత వసూలు చేయాలనే విషయాన్ని క్లినికల్ ఎస్టాబ్లి్‌షమెంట్ చట్టం చెబుతోంది. కానీ, రాష్ట్రంలో దాని అమలు ఊసే లేదు. దాంతో, కార్పొరేట్ ఆస్పత్రుల్లో వాటాలు సంపాదించిన సంస్థలు అడ్డగోలుగా రోగులను దోచేస్తున్నాయి.
ఆర్థికంగా చితికిపోతున్నారు…కొన్ని చికిత్సల కోసం తప్పనిసరిగా కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ అసాధారణ చార్జీలు వసూలు చేస్తుండడంతో సామాన్యులు ఆర్థికంగా గుల్లవుతున్నారు. స్థానికంగా మరిన్ని కార్పొరేట్ ఆస్పత్రులకు ప్రోత్సాహమిస్తే పోటీ పెరిగి కొంతమేరకు చార్జీలు తగ్గవచ్చు.
– తాడూరి గంగాధర్, నిమ్స్ వైద్యుడు
ప్రభుత్వ ఆస్పత్రులు బాగా నడిస్తే..విదేశీ సంస్థలు మన కార్పొరేట్ ఆస్పత్రుల్లో పెట్టుబడులు పెట్టి.. మూడేళ్లలోనే పెట్టుబడులతోపాటు లాభాలు ఆశిస్తున్నాయి. వాటి రాకతో సహజంగానే అన్ని రకాల చార్జీలు పెరుగుతున్నాయి. అవి సేవ చేయడానికి రావడం లేదు. వ్యాపారం చేసేందుకు వస్తున్నాయి. అవి టేకోవర్ చేసిన తర్వాత వైద్యులపై విపరీతమైన ఒత్తిడి ఉంటోంది. అందుకే ప్రభుత్వ వైద్యాన్ని మరింత బలోపేతం చేస్తే ప్రజలు కార్పొరేట్‌ను ఆశ్రయించరు.
– డాక్టర్ బాలాంబ, ప్రముఖ గైనకాలజిస్టు
Courtesy Andhrajyothy…