7 నుంచి మెట్రో పరుగులు

0
217
  • కరోనా ప్రభావంతో దశల వారీగా పట్టాల మీదకు
  • 21 నుంచి బడులకు 50 శాతం టీచర్లే
  • అవసరమైతే 9-12 క్లాస్‌ పిల్లలు వెళ్లొచ్చు
  • తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతి తప్పనిసరి
  • పెళ్లిళ్లు, అంత్యక్రియలు, సభలకు 100 మంది ఓకే
  • ఓపెన్‌ థియేటర్లకు సరే.. బార్లకు అనుమతి లేదు

హైదరాబాద్‌, సెప్టెంబరు: హైదరాబాద్‌లో మెట్రో పరుగులు తీయనుంది. ఈ నెల 7 నుంచి మెట్రో రైళ్లు నడవనున్నాయి. ఈ మేరకు మూడు రోజుల క్రితం కేంద్రం జారీచేసిన అన్‌లాక్‌-4.0 మార్గదర్శకాలను యధాతథంగా అమలు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ మెట్రో రైళ్లు నడుస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ప్రస్తుతం ఉపాధ్యాయులందరూ హాజరవుతున్నారు. అయితే కేంద్రం అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాల్లో ఆన్‌లైన్‌ టీచింగ్‌/టెలి కౌన్సెలింగ్‌ కోసం 50 శాతం వరకు బోధన, బోధనేతర సిబ్బంది పాఠశాలలకు హాజరు కావొచ్చంటూ ప్రకటించింది. ఈ నెల 21న ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ నిబంధనను  కూడా యధాతథంగా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

వాస్తవానికి ఆగస్టు 27 నుంచే ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి 100 శాతం ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నెల 21 నుంచి 50 శాతం టీచర్లు మాత్రమే స్కూళ్లకు వెళ్లాలంటూ తాజా ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఉపాధ్యాయుల ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవడానికి 9 నుంచి 12వ తరగతి విద్యార్థులు తమ తల్లిదండ్రుల నుంచి రాతపూర్వక అనుమతితో బడికి వెళ్లొచ్చునంటూ ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇది కూడా ఈ నెల 21 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. అలాగే ఈ నెల 21 నుంచి సామాజిక, విద్య, క్రీడలు, మత సంబంధ, రాజకీయపరమైన సభలు, కార్యక్రమాలను 100 మందికి మించకుండా నిర్వహించుకోవచ్చునని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం పెళ్లిళ్లకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందిని మాత్రమే అనుమతిస్తున్నామని, ఈ నెల 21 నుంచి 100 మంది  దాకా అనుమతిస్తామని తెలిపింది. ఓపెన్‌ థియేటర్లు కూడా ఈ నెల 21న ప్రారంభమవుతాయని వివరించింది. బార్లు, క్లబ్బులకు అనుమతించడం లేదని, వాటిని మూసే ఉంచాలని తెలిపింది. దీనికి సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు వెల్లడించింది. కంటైన్మెంట్‌ జోన్లలో ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ అమలవుతుందని తెలిపింది.

పరిమిత సంఖ్యలో ప్రయాణికులు
మెట్రో రైళ్లన్నీ మునుపటిలా ఒక్కసారిగా నడవవు. అన్ని కారిడార్లలో దశలవారీగా పట్టాలెక్కుతాయి. అలాగే రైళ్లలో రద్దీ లేకుండా జాగ్రత్తపడతారు. మునుపటిలా ఒక్కో మెట్రో రైల్లో 900-1100 మందిని కాకుండా పరిమిత సంఖ్యలోనే ప్రయాణికులను అనుమతివ్వనున్నారు. మెట్రో రైళ్లలో ధారాళంగా గాలి, వెలుతురు వచ్చేలా.. భౌతికదూరం పాటించేలా చూడటం..వంటి చర్యలు తీసుకుంటామని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ప్రయాణికుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తామని.. రైళ్లలో ఏసీ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని.. ఇందుకు సంబంధించి ప్రత్యేక మెకానిజాన్ని అవలంబిస్తామన్నారు.

Courtesy Andhrajyothi

Leave a Reply