రియల్ వైపు మెట్రో చూపు !

0
546

 – హెచ్‌ఎండీఏ తరహాలో లేఅవుట్లకు కసరత్తు
– ఉప్పల్‌ భగాయత్‌లో హెచ్‌ఎంఆర్‌ఎల్‌కు 42 ఎకరాలు
– త్వరలో ఫేజ్‌-1 కింద 15 ఎకరాల్లో లేఅవుట్‌ అభివృద్ధికి శ్రీకారం
– రైతుల నుంచి తీసుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం
– భారీ ఆదాయాన్ని రాబట్టుకునేందుకు ప్రణాళికలు

హైదరాబాద్‌ మెట్రో రైల్‌(హెచ్‌ఎంఆర్‌ఎల్‌) స్థిరాస్తి (రియల్‌ ఎస్టేట్‌) వ్యాపారం వైపు అడుగులు వేస్తోంది. ఉప్పల్‌ భగాయత్‌లో హెచ్‌ఎండీఏ తరహాలోనే లేఅవుట్లు చేసి ఈ-వేలం ద్వారా ప్లాట్లు విక్రయించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో హెచ్‌ఎంఆర్‌ఎల్‌ కూడా హెచ్‌ఎండీఏ సహకారంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే యోచనలో ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్‌ మెట్రో నిర్మాణానికి సంబంధించి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌అండ్‌టీ, హెచ్‌ఎంఆర్‌ఎల్‌కు కలిపి దాదాపు 142 ఎకరాలు కేటాయించింది. ఇందులో హెచ్‌ఎంఆర్‌ఎల్‌కు 42 ఎకరాలు వచ్చింది. అయితే, అభివృద్ధి పేరుతో రైతుల నుంచి తీసుకున్న భూముల్లో హెచ్‌ఎండీఏలాగే హెచ్‌ఎంఆర్‌ఎల్‌ కూడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేందుకు సిద్ధమైంది. తొలిదశలో 15 ఎకరాల్లో లేఅవుట్‌కు ప్రణాళికలు రచిస్తోంది.

ఉప్పల్‌ భగాయత్‌లో 2005లో రైతుల నుంచి 733 ఎకరాల భూములను హెచ్‌ఎండీఏ సేకరించింది. ఇందులో 142 ఎకరాలను మెట్రో రైలు నిర్మాణం కోసం, మరో 100 ఎకరాలను వాటర్‌బోర్డుకు కేటాయించింది. మిగతా భూమిలో ఫేజ్‌-1 కింద 413 ఎకరాల్లో భారీ లేఅవుట్‌ను హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసింది. ఇందులో నష్టపరిహారం కింద రైతులకు 1300 వరకు ప్లాట్లను కేటాయించింది. అదేవిధంగా ఫేజ్‌-2 కింద ఉప్పల్‌ భగాయత్‌లోనే మరో 70.11 ఎకరాలను అభివృద్ధి చేసింది. ఈ-వేలం ద్వారా ప్లాట్లు విక్రయించి రూ.677కోట్లకుపైగా ఆదాయం రాబట్టుకుంది. డిసెంబర్‌లోనూ రెండో దశ ప్లాట్ల వేలంలో రూ.90 కోట్ల వరకు ఆదాయాన్ని ఆర్జించింది. ఇదే తరహాలో హెచ్‌ఎంఆర్‌ఎల్‌ కూడా 42 ఎకరాల్లో లేవుట్లు అభివృద్ధి చేసి ఈ-వేలంలో ప్లాట్లను విక్రయించాలని యోచిస్తోంది. ఈ స్థలంలో ఇప్పటివరకు ఎల్‌అండ్‌టీ సంస్థ మెట్రో పనులకు సంబంధించి వయాడక్ట్‌లు, ఇతర నిర్మాణాలకు సంబంధించిన ప్రీకాస్టింగ్‌ యార్డుగా ఉపయోగించుకుంది. దీనికితోడు హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టులోని మొదటి దశ పనులు దాదాపు పూర్తయ్యాయి. దీంతో ఎల్‌అండ్‌టీ ఈ స్థలాన్ని ఖాళీ చేయనుంది. త్వరలో ఇక్కడ ఉప్పల్‌ భగాయత్‌ తరహాలో లేవుట్‌ను అభివృద్ధి పరిచి ప్లాట్లను విక్రయించాలని హైదరాబాద్‌ మెట్రోరైల్‌ సంస్థ నిర్ణయించింది.

ఆరు నెలల్లో లేఅవుట్‌ పనులు
హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి
ఉప్పల్‌ భగాయత్‌లో హెచ్‌ఎంఆర్‌ఎల్‌కు కేటాయించిన స్థలంలో లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించిన పనులు మరో ఆరు నెలల్లో కార్యరూపంలోకి రానున్నాయి. మొత్తం 42 ఎకరాల్లో ఫేజ్‌-1 కింద 15 ఎకరాల్లో లేఅవుట్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. అన్ని వర్గాల ప్రజలకు అనుగుణంగా ప్లాట్లను అభివృద్ధి చేస్తాం.

15 ఎకరాల్లో లేఅవుట్‌..
ఉప్పల్‌ భగాయత్‌ లేవుట్‌లో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌కు మొత్తం 42 ఎకరాల స్థలం ఉంది. ఇందులో ఫేజ్‌-1 కింద మొదట 15 ఎకరాల్లో లేఅవుట్‌ను అభివృద్ధి చేయనుంది. దశలవారీగా మిగతా 27 ఎకరాల స్థలంలో లేవుట్లు అభివృద్ధి చేయాలనే యోచనలో ఉంది. హెచ్‌ఎంఆర్‌ఎల్‌ కూడా చిన్న సైజ్‌లో ప్లాట్లు అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించేలా వీటిని అభివృద్ధి చేయాలని భావిస్తోంది. హెచ్‌ఎండీఏ కన్నా మరింత బాగా ఈ లేఅవుట్లను చేయాలని నిర్ణయిం చింది. అయితే, ప్లాట్ల వేలాన్ని హెచ్‌ఎండీఏ సహ కారంతో చేపట్టనుంది. ప్రస్తుతం లేఅవుట్‌కు సంబంధించిన పనులపై పలు ఏజెన్సీలతో చర్చలు జరుపుతోంది.

Courtesy Nava Telangana

Leave a Reply