మీరు తీసేయడమేంటి?.. నేనే రాజీనామా చేస్తున్నా!

0
224

  • సీఎంకు కండక్టర్‌ కృష్ణ లేఖ
  • తెలంగాణలో నియంతృత్వం 
  • ఇక్కడెందుకు పుట్టానా అని బాధ
  • మహిళా కార్మికులపై లాఠీదెబ్బలు
  • మీ తెలంగాణలోనే సాధ్యమైంది
  • వారి ఉసురు మీకు తగులుతుంది
  • మీరో మోసకారి, మాటకారి అది లేటుగా తెలుసుకున్నాం
  • ఉద్యమ నాయకుడిగా ఏం చెప్పారో మీకు గుర్తులేదా?
  • కార్మికులు ఏం తప్పు చేశారు?
  • ఆత్మాభిమానం చంపుకొని ఉద్యోగం చేయలేను
  • నా తల్లిదండ్రులకు వృద్ధాప్య పింఛన్‌ ఇవ్వండి
  • 3 ఎకరాలు, డబుల్‌ ఇల్లు కూడా
  • గౌరవంగానైనా బతకనివ్వండి

సూర్యాపేట: సుదీర్ఘంగా చేస్తున్న సమ్మెను విరమించి.. ఉద్యోగంలో చేరతామని ఆర్టీసీ డిపోలకు వెళ్లి కార్మికులు వేడుకుంటున్నా అధికారులు వెళ్లగొడుతుండటంతో ఓ కండక్టర్‌ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నాడు.

‘‘ఉద్యోగం నుంచి మీరు తీయడం ఏమిటి? నేనే ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను’’ అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావుకు బహిరంగ లేఖ రాశాడు. ‘‘తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో ఉద్యోగం చేద్దామనుకొని బతుకుదామనుకున్నాను. మీలాంటి గొప్ప మనిషి ఉన్న ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో కాదు కదా, కనీసం తెలంగాణలో ఎందుకు పుట్టానురా నాయనా అనే విధంగా మనో వేదనకు గురై ఈ నిర్ణయం తీసుకున్నాను’’ అని లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు.

తెలంగాణ తెచ్చింది మీలాంటి వారి కోసమేనా? అని ఆక్రోశించాడు. తన తోటి మహిళా కార్మికులు లాఠీదెబ్బలు తింటారని కలలో కూడా ఊహించలేదని.. మీ బంగారు తెలంగాణలో అది సాధ్యమైందని.. వారి ఉసురు మీకు కచ్చితంగా తగులుతుందని లేఖలో పేర్కొన్నాడు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం సూర్యనాయక్‌తండా వాస్తవ్యుడు లునావత్‌ కృష్ణ అనే బస్‌ కండక్టర్‌దీ రాజీనామా లేఖ. ఆయన 2009 నుంచి సూర్యాపేట డిపోలో పనిచేస్తున్నాడు. మరో 26 ఏళ్ల సర్వీసు ఉండి కూడా రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. రాజీనామా లేఖను ఆర్టీసీ డీఎంకు ఇద్దామని వెళితే పోలీసులు అడ్డుకున్నారని పేర్కొన్నాడు. తాను ఎందుకు రాజీనామా చేసింది ‘ఆంధ్రజ్యోతి’కి వివరించాడు. కృష్ణ రాసిన లేఖ ఇదీ..

గౌరవనీయులైన తెలంగాణ సీఎం కేసీఆర్‌ గార్కి…
మీకు మాట తప్పడం, మాయ మాటలు చెప్పి మోసం చేయడం తెలుసని మా కార్మిక లోకం లేటుగా తెలుసుకుంది. నా రాజీనామాకు కారణం లేకపోలేదు సార్‌. మా తెలంగాణలో నియంతృత్వం చూస్తానని అనుకోలేదు. 1200మంది ఆత్మహత్య చేసుకుంటే మన కేసీఆర్‌ సార్‌ ఉన్నారు ఆంధ్రా పాలకులు నిజంగా మోసం చేశారేమో, మమ్మల్ని బాగా చూసుకుంటారు అనుకున్నా. కానీ సార్‌.. మా 30మంది కార్మికులు చనిపోతే మీరు కనీసం స్పందించలేదు. అప్పుడు అనిపించింది. సార్‌… తెలంగాణ మా కోసం కాదు కేవలం మీలాంటి నాయకుల కోసమే అని. నా అక్కా చెల్లెమ్మలు లాఠీ దెబ్బలు తింటారని క లలో కూడా ఊహించలేదు సార్‌. కానీ మీ బంగారు తెలంగాణలో అది సాధ్యమైంది సార్‌, నా ఆర్టీసీ అక్కచెల్లెళ్ల ఉసురు కచ్చితంగా మీకు తగులుతుంది సార్‌.

నేను సూర్యాపేట డిపోలో ఆర్టీసీ కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నా. మీలాంటి ఒక మోసకారి, ఒక మాటకారి, ఒక మానవత్వం లేని ఒక నిరంకుశ ప్రభుత్వంలో నా ఆత్మాభిమానాన్ని చంపుకొని ఉద్యోగిగా పని చేయలేను. అందుకే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా. మీ సంస్థ నుంచి నాకు రావాల్సిన బకాయిలను ఇప్పించి నా రాజీనామాను ఆమోదించగలరని మనవి. సీఎం సారూ మీరు ఉద్యమ నాయకుడిగా మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తుకు చేసుకోండి. పాపం ఆర్టీసీ వాళ్లు.. వచ్చే రూ.15వేల వేతనం తీసుకుని ఫ్యామిలీ చూసుకుంటూ గౌరవంగా బతుకుతున్నారు. మీరు వాళ్లకు ఏమీ ఇవ్వకున్నా కనీసం పిలిచి మాట్లాడి ఉంటే మీ మీద గౌరవంతో ప్రాణాలిచ్చేవారు. కనీసం నేను మీ బంగారు తెలంగాణలో సంతోషంగా లేను. మా తల్లిదండ్రులకైనా ప్రతినెలా వృద్ధాప్య పింఛన్‌ ఇవ్వండి.

 

ఎందుకంటే వారు మిమ్మల్ని నమ్మి మా కేసీఆర్‌ అని ఓటు వేశారు. ప్రతిరోజు ఈ అరెస్టులు ఏంది? ఈ లాఠీ దెబ్బలు ఏంది? నా ఆర్టీసీ సోదరులు ఏం తప్పు చేశారు? ఇంకా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకునేటట్లు చేస్తారు? నా ఆత్మాభిమానాన్ని చంపుకొని ఉద్యోగం చేయలేను. నేను మీ బంగారు తెలంగాణలో ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగిని కాదు. మీ మాయ మాటలు నమ్మి మోసపోయిన వ్యక్తిని. మీ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగిగా ఉన్నాను కాబట్టి నా తల్లిదండ్రులకు వృద్ధాప్య పింఛన్‌ ఒకటి ఇవ్వండి. నా పేరు మీద సెంటు భూమి లేదు. కాబట్టి మూడెకరాల పొలం ఇవ్వండి. నాకు ఉండటానికి ఇల్లు లేదు కాబట్టి డబుల్‌బెడ్‌ రూం ఇల్లు ఇవ్వండి. ఒకవేళ మీరు ఏమీ ఇవ్వకున్నా సమాజంలో గౌరవంగా బ్రతికే అవకాశం కల్పించాలని కోరుతూ నా ఉద్యోగ రాజీనామాను తక్షణమే ఆమోదించగలరు.

ఇట్లు,
ఎల్‌.కృష్ణ, స్టాఫ్‌ నంబర్‌ 176822
ఆర్టీసీ కండక్టర్‌, సూర్యాపేట డిపో

Leave a Reply