థీసిస్ ఉపయోగకరంగా లేదంటూ చివరిగా లేఖ
కంది : ఐఐటీ హైదరాబాద్ క్యాంప్‌సలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. స్మార్ట్ మొబిలిటీ డిపార్ట్మెంట్లో ఎంటెక్ రెండో సంవత్సరం చదువున్న బింగుమల్ల రాహుల్ (24) మెడకు టవల్ చుట్టుకుని, తాడుతో మంచానికి ఉరివేసుకున్నాడు. ఇతడి స్వస్థలం నంద్యాల. రాహుల్ ఐఐటీహెచ్‌లో ఈ-బ్లాక్, రూం నంబరు 107లో ఉంటున్నాడు. బుధవారం ఉదయం స్నేహితులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. అనుమానంతో గది తలుపు తెరిచిచూడగా విగతజీవుడిగా కనిపించాడు. రాహుల్ గదిలోని ఓ పుస్తకంలో ‘ఎంటెక్ థీసిస్ నాట్ యూజ్‌ఫుల్’ అని, మరోచోట తన ఆత్మహత్యకు కారణాలు ల్యాప్‌టా్‌పలో ఉన్నాయని రాసిన ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ల్యాప్‌టాప్ పాస్వర్డ్ ఓపెన్ కాకపోవడంతో దానిని హైదరాబాద్‌లోని ఐటీ నిపుణుల వద్దకు పంపించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, రాహుల్ మృతిపై అతడి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు.
కుంగుబాటులో ఉన్నాడంటూ తల్లిదండ్రులకు సమాచారం
రాహుల్ ఆత్మహత్య విషయం గోప్యంగా ఉంచిన ఐఐటీహెచ్ అధికారులు నంద్యాలలోని తల్లిదండ్రులకు మీ అబ్బాయి తీవ్ర కుంగుబాటులో ఉన్నాడని, వెంటనే రావాలని ఫోన్ చేసి చెప్పారు. వాళ్లు రాగానే పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లాలని సూచించారు. ఆత్మహత్య విషయాన్ని పోలీసులు వారికి తెలిపారు. చిన్న తాడుతో మంచానికి ఉరి వేసుకుని చనిపోవడం ఎలా సాధ్యమని రాహుల్ తండ్రి మధుసూదన్ పోలీసులను ప్రశ్నించారు. పోస్ట్‌మార్టమ్ అనంతరం మృతదేహాన్ని నంద్యాలకు తీసుకెళ్లారు.