రాజధాని శివార్లలో పుష్పరాజ్‌లు

0
222
  • అడుగడుగునా అక్రమ స్టోన్‌క్రషర్లు
  • 111 జీవోకు అడ్డగోలుగా ‘తూట్లు’
  • అనుమతులు లేకుండా 3 మండలాల్లో
  • ప్రతి నెలా 12 లక్షల టన్నుల మైనింగ్‌
  • రూపాయి పన్ను కట్టకుండానే ‘దందా’
  • రాత్రింబవళ్లూ స్టోన్‌ క్రషర్ల నిర్వహణ
  • కోర్టులు, అధికారుల ఆదేశాలు బేఖాతరు
  • సీజ్‌ చేసినా ‘తగ్గేదేలే’ అంటూ తిరిగి మైనింగ్‌
  • ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల మేర గండి

కొండలను తవ్వాలంటే గనులశాఖ, కాలుష్య నియంత్రణ మండలి, రెవెన్యూశాఖ అనుమతులు తప్పనిసరి. కానీ, ఆ అనుమతులేవీ లేకుండానే హైదరాబాద్‌ శివార్లలో అడ్డగోలుగా మైనింగ్‌ కార్యకలాపాలు నడుస్తున్నాయి! ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జంట జలాశయాల పరీవాహక ప్రాంత పరిధిలో 111జీవో అమల్లో ఉన్నప్పటికీ యథేచ్ఛగా స్టోన్‌ క్రషర్లు నడుస్తున్నాయి. బడాబాబులకు చెందిన ఈ క్రషర్ల జోలికి వెళ్లేందుకు ఎవరూ సాహసించట్లేదు. నిత్యం వీటి పక్కనుంచే వెళ్లే ఉన్నతాధికారులు, అమాత్యులు.. తమకేమీ తెలియదన్నట్లుగా ముందుకు సాగిపోతున్నారు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి పన్ను కట్టకుండా జరుగుతున్న ఈ దందా వెనుక ఎందరో ‘పుష్ప’రాజ్‌లు ఉన్నారు. సీజ్‌ చేసిన ప్రతిసారీ.. ‘తగ్గేదేలే’ అంటూ వాటిని మళ్లీ తెరుస్తున్నారు. రూ.వందల కోట్ల విలువైన ఈ వ్యవహారంపై ప్రత్యేక కథనం.

కలెక్టర్‌ ఆదేశాలున్నా..
111జీవో పరిధిలో ఉన్న క్రషర్‌ యూనిట్లను మూసివేయాలని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేసినా కింది అధికారులు వాటినీ బేఖాతర్‌ చేస్తున్నారు. వట్టినాగులపల్లిలో కొన్ని యూనిట్లు సీజ్‌చేసినా అవి పత్రాలకే పరిమితమయ్యాయి. బడావ్యక్తులు చక్రం తిప్పుతుండడంతో.. ఆ యూనిట్లన్నీ సీజ్‌ చేసిన 2-3 రోజులకే తెరుచుకున్నాయి. వీటికి భారీగా జరిమానాలు వేసే అధికారం పీసీబీకి, గనుల శాఖకు ఉన్నా అవి ప్రేక్షకపాత్ర వహిస్తున్నాయి. పట్టుబడిన సరుకుకు అయిదారు రెట్లు జరిమానా విధించాల్సి ఉన్నా.. ఏ అధికారీ జరిమానాలు విధించలేదు. ఇకనైనా ఈ వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని.. ఈ అక్రమ దందాను అరికట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో, నగర శివారు ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగం దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఔటర్‌కు సమీప ప్రాంతాల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో ఇసుక, కంకరకు డిమాండ్‌ బాగా పెరిగింది. భారీగా కాసులు కురిపిస్తుండడంతో కొందరు బడా వ్యక్తులు ఈ వ్యాపారంలోకి ప్రవేశించారు. ఒక్క రూపాయి పన్ను కూడా ప్రభుత్వానికి చెల్లించకుండా.. అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఔటర్‌ రింగురోడ్డు సమీపంలో.. ముఖ్యంగా తవ్వకాలు, నిర్మాణాలపై నిషేధం ఉన్న  111జీవో పరిధిలో.. ఎలాంటి అనుమతులూ లేకుండాస్టోన్‌క్రషర్‌ యూనిట్లు ఏర్పాటు చేశారు. వాటికి కనీసం విద్యుత్‌ అనుమతి కూడా ఉండదు.

ప్రైవేటు భూముల్లో ఉన్న కొండలను తవ్వేసి అక్కడే క్రషర్లు ఏర్పాటు చేసి స్టోన్‌, రోబోశాండ్‌ తయారు చేసి అమ్మేస్తున్నారు. అలాగే.. 40 అంతస్తుల భవనాలను నిర్మిస్తున్న బడా కంపెనీలు అండర్‌ గ్రౌండ్‌లో ఐదారు అంతస్తుల మేర పార్కింగ్‌ కోసం కొండలను తవ్వేస్తున్నాయి. అలా తవ్వేసిన రాళ్లను కూడా శివార్లలో ఏర్పాటు చేసుకుంటున్న స్టోన్‌క్రషర్ల వద్దకు చేర్చి అమ్మి సొమ్ము చేసుకుంటున్నాయి. బడాసంస్థలు ఇలా రోజూ వేల టన్నుల రాళ్లను శివార్లకు తెచ్చి సైజులవారీగా స్టోన్‌ క్రషింగ్‌ చేయిస్తున్నాయి. వాటిని తిరిగి తమ నిర్మాణాలకు ఉపయోగించుకోవడంతో పాటు ఇతరులకు విక్రయిస్తున్నాయి.

వారి నోట్లో మన్ను
అక్రమ మైనింగ్‌ చేసే వారు తక్కువ ధరకే స్టోన్‌ను అమ్మేస్తుండడంతో.. అన్ని అనుమతులూ తీసుకుని నగర శివార్లలో క్రషింగ్‌ యూనిట్లు నడుపుకొంటున్నవారు పోటీ పడలేక పోతున్నారు. రాయల్టీ, పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో..  అక్రమ మైనింగ్‌ చేసేవారు తక్కువ ధరకే అమ్మేస్తున్నారు. సక్రమంగా వ్యాపారం చేసేవారు హైదరాబాద్‌కు దూరంగా యూనిట్లు నడుపుతుండడంతో వారు విక్రయించే కంకర, ఇసుక ధరలు నగరానికి వచ్చేసరికి బాగా పెరుగుతున్నాయి. దీంతో వినియోగదారులు సమీప ప్రాంతంలో తక్కువ ధరకు సరఫరా చేసే అక్రమ మైనింగ్‌ వ్యాపారుల నుంచే కొనుగోలు చేస్తున్నారు.

విద్యుత్తు చౌర్యమూ..
క్రషర్‌ ఏర్పాటుకు పలు అనుమతులు కావాలి. ఆవాస ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడానికి నిబంధనలు అంగీకరించవు. నివాస ప్రాంతాలకు దూరంలోనే ఏర్పాటు చేయాలి. క్రషర్లు నడిపే వారికి విద్యుత్‌ కనెక్షన్‌,  కాలుష్యనియంత్రణ మండలి అనుమతి తప్పనిసరి. ఇవేవీ లేకుండానే 111జీవో పరిధిలో ఉన్న శంషాబాద్‌, గండిపేట, రాజేంద్రనగర్‌ మండలాల్లో దాదాపు 22 యూనిట్లు రాత్రింబవళ్లూ పనిచేస్తున్నాయి. అక్కడ ఎవరైనా తనిఖీలకు వెళితే డీజిల్‌ ఇంజిన్లు కనిపిస్తాయి. కానీ వాటిని అప్పుడప్పుడూ మాత్రమే వినియోగిస్తారు. రాత్రిపూట సమీప ప్రాంతాల నుంచి విద్యుత్‌ చౌర్యం చేస్తారు. ఇలా ఏటా రూ.వందల కోట్ల విలువైన విద్యుత్తును అక్రమంగా వాడేస్తున్నారు. ఈ విషయం స్థానిక విద్యుత్తు శాఖ అధికారులకూ తెలుసు. అయినా పట్టించుకోవట్లేదు.

రాజధాని శివార్లలో పుష్పరాజ్‌లు - Andhrajyothyఅలాగే.. ఈ దందాపై కాలుష్యనియంత్రణ మండలి (పీసీబీ) కూడా కన్నెత్తి చూడట్లేదు. అసలు ఈ మూడు మండలాల్లో మైనింగ్‌కు ఎలాంటి అనుమతులూ లేవు. ఈ విషయం రెవెన్యూ, గనులశాఖ, కాలుష్యనియంత్రణ మండలి, మెట్రోవాటర్‌ బోర్డు, హెచ్‌ఎండీఏ అధికారులందరికీ తెలుసు. 111జీవోకు ముందు అనుమతులిచ్చిన క్రషర్స్‌ను ఇక్కడ నుంచి బయటకు తరలించారు. అక్రమంగా దందా చేస్తున్న వారిని మాత్రం వదిలేస్తున్నారు. వీరిపై పీసీబీ అధికారులకు అనేక ఫిర్యాదులు అందుతున్నా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు.

మూడు మండలాల్లో..
రాజేంద్రనగర్‌, శంషాబాద్‌, గండిపేట, శేరిలింగంపల్లి, శంకరపల్లి మండలాల్లో అక్రమ మైనింగ్‌ పెద్ద ఎత్తున జరుగుతోంది.  గండిపేట, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌ మండలాల్లో ఉన్న 22 క్రషర్ల ద్వారా నెలకు 12లక్షల టన్నుల విక్రయాలు జరుగుతున్నాయి. కొన్ని క్రషర్లు నెలకు లక్ష టన్నులపైన సామర్థ్యం ఉన్నవి. ఇలా ఏడాదికి  1.44 కోట్ల టన్నుల స్టోన్‌ విక్రయిస్తున్నారు. నిబంధనల ప్రకారం టన్నుకు రాయల్టీ రూ.171. అంటే..  సక్రమ మైనింగ్‌ అయితే ఏటా రూ. 246 కోట్ల దాకా రాయల్టీ ప్రభుత్వానికి వస్తుంది.  అక్రమ మైనింగ్‌ అయితే 5 రెట్లు పెనాల్టీ కట్టాలి. ఈ లెక్కన పెనాల్టీ వేస్తే రూ. 1,232 కోట్ల ఆదాయం వస్తుంది. కానీ,  రూపాయి  కూడా రావట్లేదు.

Courtesy Andhrajyothi

Leave a Reply