2 నెలల్లో రూ.5 వేల కోట్ల నష్టం

0
184

కాశ్మీర్‌లో వ్యాపార రంగంపై ఆర్టికల్‌ 370 రద్దు‌’ ప్రభావం
ఆంక్షలతో నష్టాల ఊబిలో వ్యాపారులు
పర్యాటకరంగానికి పెద్ద దెబ్బ
  శ్రీనగర్‌ : కాశ్మీర్‌ చరిత్రలోనే తొలిసారిగా అక్కడి వ్యాపార, వాణిజ్య రంగాలు తీవ్ర సంకట స్థితిని ఎదుర్కొంటున్నాయి. జమ్ము కాశ్మీర్‌ స్వయం ప్రతిపత్తి రద్దు తర్వాత కేంద్రంలోని మోడీ సర్కార్‌ విధించిన ఆంక్షలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థ దిగ్బంధనం లాంటి నిరంకుశ చర్యల వల్ల రాష్ట్రంలోని అన్ని వ్యాపారాలు నష్టాలు చవిచూస్తున్నాయని వర్తక సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు నెలల కాలంలో ఈ నష్టాల భారం రూ.5 వేల కోట్లకు చేరిందని కాశ్మీర్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీస్‌ (కెసిసిఐ) గణాంకాలు చెబుతున్నాయి. ఆర్టికల్‌ 370ని కేంద్రం ఆగస్టు 5న రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అల్లర్లు చెలరేగుతాయన్న అనుమానంతో కేంద్రం కొన్ని రోజుల పాటు కర్ఫ్యూ విధించింది. రవాణా, కమ్యూనికేషన్‌ వ్యవస్థలపై ఆంక్షలు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. అప్పటి నుంచి దుకాణాలు తెరిచే పరిస్థితి లేకపోవడంతో, వ్యాపార రంగం తీవ్ర స్థాయిలో దెబ్బతింది.

పర్యాటక రంగంలో రూ.1500 కోట్లకుపైగా నష్టం
కాశ్మీర్‌ ఆర్థికాభివృద్ధిలో పర్యాటక రంగం కీలక పాత్ర పోషిస్తుంది. సగటున దాదాపు రూ.5 వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఆర్టికల్‌ 370 రద్దుకు ముందుగా రాష్ట్రంలో ఉన్న పర్యాటకులు వెంటనే వారి ప్రాంతాలకు వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రభావం పర్యాటక రంగంపై తీవ్రంగా పడింది. కాశ్మీర్‌లో 1300 హోటళ్లు, 900 హౌస్‌బోట్లు, 650 షికారు బోట్లు ఉన్నాయి. ఆంక్షల నేపథ్యంలో అవన్నీ ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు నెలల కాలంలో పర్యాటక రంగంలో నష్టం ఇప్పటికే రూ.1,500 కోట్లు దాటిందని కెసిసిఐ వెల్లడించింది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే వ్యాపార రంగం మరింత సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని, భారీ నష్టాలతో వ్యాపారులు తిరిగి తేరుకోలేని పరిస్థితికి చేరుకుంటారని కెసిసిఐ అధ్యక్షుడు షేక్‌ అషిఖ్‌ అన్నారు.
రాష్ట్రంలో ఎటువంటి ఘర్షణలు, హింస చెలరేగినా తామే బాధితులుగా మిగులుతున్నామని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తమతో ఆడుకుంటోందని, వ్యాపార రంగాన్ని రాజకీయ కోణంతో చూస్తోందని విమర్శించారు. వాణిజ్య రంగంలో సంక్షోభాన్ని పట్టించుకోని కేంద్రం రాష్ట్రంలో శాంతి భద్రతల పేరుతో మరిన్ని సమస్యలు సృష్టిస్తోందని ఆషిఖ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం కాశ్మీర్‌లో 70 వేల దుకాణాలు మూతపడి ఉన్నాయని, శ్రీనగర్‌లోని ప్రధాన వ్యాపార కేంద్రమైన లాల్‌చౌక్‌లోని దాదాపు అన్ని దుకాణాలు మూతదశలో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రధానమైన ఆపిల్‌ పరిశ్రమపైనా ఆంక్షల ప్రభావం పడిందన్నారు. రవాణా రంగానికి వస్తే గత రెండు నెలల కాలంలో రూ.500 కోట్ల మేర నష్టం వచ్చిందని సమాచారం. రాష్ట్ర జిడిపిలో రెండు శాతం ఉన్న హస్తకళా రంగం పూర్తిగా నిలిచిపోయిందని, రానున్న కాలంలో ఈ రంగం మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని అన్నారు.
గత రెండు నెలల కాలంలో కేంద్రం ఎంతమంది వ్యాపారులను, వర్తక సంఘాల నేతలను అదుపులోకి తీసుకుందనే దానిపై ఇప్పటి వరకూ కచ్చితమైన సమాచారం లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఆషిఖ్‌ అన్నారు. ముబేన్‌ షా, షకీల్‌, యాసిన్‌ ఖాన్‌ వంటి నేతలను అరెస్టు చేయడం భయాందోళన సృష్టిస్తోందని తెలిపారు.
కేంద్ర బలగాల అదుపులో వర్తక సంఘాల నేతలు
కేంద్ర ప్రభుత్వ బలగాలు పలు వర్తక సంఘాల నేతలను అదుపులోకి తీసుకు న్నాయి. ఖైదు చేయబడిన వ్యాపారవేత్త లను, వర్తక సంఘాల నేతలను వెంటనే విడుదల చేయాలని వ్యాపారులు డిమాండ్‌ చేస్తున్నారు. ‘హాజ్‌ అండ్‌ ఉమ్రా సర్వీసెస్‌’ కేంద్రాన్ని నిర్శహించే వ్యాపార వేత్త షేక్‌ ఫిరోజు మాట్లాడుతూ ఆంక్షలు, ఇంటర్నెట్‌, టెలిఫోన్‌ సర్వీసుల బంద్‌ వల్ల తాను మంచి సీజన్‌లో వ్యాపారాన్ని కోల్పో వాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలంలోనే ముస్లిములు ఎక్కువగా ఉమ్రా యాత్రకు వెళ్తుంటారని, టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌కు దాదాపు 2 వేల మంది ముందుకొచ్చా రని, కేంద్రం ఆంక్షల నేపథ్యంలో వారు వెనక్కి తగ్గారని తెలిపారు. ఒక్కొక్క టికెట్‌ విలువ రూ.75 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ఉంటుందని, దీంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని అన్నారు. ఏటా ఆగస్టు-అక్టోబర్‌ మా సాల్లో సగటున 35 వేల టికెట్ల బుకింగ్‌ జరుగుతుందని, ఈ ఏడాది అటువంటి పరిస్థితులు లేవని ఆందోళన వ్యక్తం చేశారు.

Courtesy Prajasakthi…

Leave a Reply