కాషాయ మూకదాడుల అమానుషత్వం

0
196

మోడీ పాలనలో 266.. 2009-13లో 22 
– మైనార్టీలకు వ్యతిరేకంగా కాషాయ మూకల విషప్రచారం 
– పక్కా ప్రణాళికలతో హిందూత్వశక్తుల హింసోన్మాదం 

న్యూఢిల్లీ : బీజేపీ పాలనలో గతంలో ఎన్నడూలేనన్ని మూకదాడులు జరుగుతున్నాయి. మత విద్వేషం, ముస్లిం వ్యతిరేక ప్రచారం బహిరంగంగా, సామాజిక మాధ్యమాల్లో ముమ్మరంగా సాగుతున్నది. దళితులు, మైనార్టీలపై అఘాయిత్యాలకు అంతేలేకుండా పోతున్నది. శాంతి భద్రతలను బేఖాతరు చేస్తూ.. ఆ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిర్భయంగా సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఈ విద్వేషపు మూకదాడులు పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయని, కేంద్రంలో మొదటిసారి మోడీ సర్కారు వచ్చినప్పటి నుంచే ఈ తరహా హింసాత్మక ఘటనలు పదుల రెట్లు పెరిగాయని ఓ అధ్యయనం వెల్లడించింది. ‘జై శ్రీరాం, జై హనుమాన్‌’ అని నినదించాలని బలవంతం చేస్తూ.. జార్ఖండ్‌లో 24 ఏండ్ల తబ్రేజ్‌ అన్సారీపై ఈ నెల 17న ఓ మూకదాడికి దిగింది. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తబ్రేజ్‌ చనిపోయాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జార్ఖండ్‌లో ఏకంగా 14వ మూకదాడి ఇది. కాగా, దేశంలోని హిదూత్వశక్తుల హింసోన్మాదాల సంఖ్య 266కి చేరింది. ఈ ఏడాదిలో ఇది 11వది కావడం గమనార్హం.
కోరలు చాచిన విద్వేషం
2014లో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూత్వ మూకలు బరితెగిస్తున్నాయి. మోడీ సర్కారుకు ముందు ఐదేండ్లలో(2009-2013) దేశంలో మొత్తం 22 మూకదాడులు జరిగాయి. కానీ, బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఈ దారుణాలు భారీగా పెరిగాయి. 2014లో 18 దాడులు జరగ్గా… 2015లో 30, 2016లో 42, 2017లో 73, 2018లో పరాకాష్ట(92)కు చేరింది. అంతకు ముందు ఐదేండ్లలో 22 మూకదాడులు జరగ్గా.. బీజేపీ హయాంలోని ఐదేండ్ల(2014-2018)లో 255 దాడులు జరిగాయి. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మూకదాడులకు మధ్య ప్రత్యక్ష సంబంధమున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
విస్తృత విషప్రచారం..
సంఫ్‌ు పరివార్‌ విష ప్రచారం.. నిందితులకు బహిరంగంగా మద్దతునివ్వడం, ఆ దాడులు అసలు తప్పే కాదన్న అభిప్రాయాన్ని తీసుకొచ్చే యత్నాలను కాషాయమూకలు విస్తృతం చేస్తున్నాయి. ఇందుకు జార్ఖండ్‌ను ఉదాహరణగా తీసుకుంటే.. ఫ్యాక్ట్‌ చెకర్‌ అనే వెబ్‌సైట్‌ అధ్యయనం ప్రకారం ఆ రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటి వరకు 14 మూకదాడులు జరిగాయి. రెండు మూకదాడులకు ప్రత్యక్షంగా మరో ఆరు మూకదాడులకు పరోక్షంగా రామనవమి సందర్భంగా చేపట్టిన ప్రదర్శన కారణంగా ఉన్నది. ముస్లిం నివాసాల్లో, మసీదులున్న ప్రాంతాల్లో వారిని లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టే పాటలు, నినాదాలు చేయడం, కత్తులు, శూలాలు, ఇతర ఆయుధాలతో కొన్ని కాషాయ మూకలు విన్యాసాలు చేశాయి. అందులో చాలా పాటలు రెచ్చగొట్టేలా ఉన్నాయనీ, ఆ పాటలను కొందరు రింగ్‌టోన్‌గా కూడా పెట్టుకున్నారని అధ్యయనం వివరించింది. ఇలా రెచ్చగొట్టే ప్రదర్శనలు తీవ్ర ఘర్షణలకు కారణమవుతాయని పోలీసులకు తెలుసనీ, కొన్ని సందర్భాల్లో వారు అడ్డుకున్నారనీ తెలిపింది. కానీ, వాటిద్వారా ప్రబలే ద్వేషాన్ని అడ్డుకోలేమని పేర్కొంది. సోషల్‌ మీడియాలో మరింత తీవ్రమైన వ్యాఖ్యానాలు, కథనాలుంటాయని వివరించింది. గోవధ, బీఫ్‌ తినడం, లవ్‌ జీహాద్‌, పాకిస్థాన్‌ మద్దతుదారులనీ, అనేక నేరాలకు పాల్పడ్డారంటూ ముస్లింలపైకి రెచ్చగొట్టేలా విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని తెలిపింది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు గాలికి..
మూకదాడులు, నేరాలను అడ్డుకునేందుకు 2018లో సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు గాలికి వదిలేశాయి. సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాల్లో కొన్ని..
– మూకదాడులు, నేరాలను పురికొల్పే బాద్యతారహిత, ద్వేషపూరిత సందేశాలు, వీడియాలు, ఇతరత్రలను సామాజిక మాధ్యమాల్లో అడ్డుకోవాలి
– కొన్ని వర్గాల మధ్య శత్రుత్వాన్ని కలుగజేసే సందేశాలు, వీడియోలను ప్రచారం చేస్తున్న వ్యక్తిపై ఐపీసీలోని 153 ఏ కింద పోలీసులు తప్పకుండా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి
– తీర్పు వెలువడిన నెలరోజుల్లో మూకదాడి బాధితులకు పరిహారం అందజేయాలి
– ప్రతి జిల్లాలోని ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ప్రతి రోజూ విచారణ చేపట్టాలి
– ట్రయల్‌ కోర్టులు దోషులకు కఠిన శిక్షలు విధించాలి
– ఈ మార్గదర్శకాలను పాటించని అధికారులు, పోలీసు అధికారులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తే.. వారిపై చర్యలు తప్పనిసరి
– లౌకిక విలువలు, విభిన్న సాంప్రదాయాలను పాటించే సమాజంలో శాంతి భద్రతలు కాపాడేలా.. లా అండ్‌ ఆర్డర్‌ యంత్రాంగాన్ని పర్యవేక్షించే బాధ్యత ప్రభుత్వాలదే
– మూకదాడిని ప్రత్యేక నేరంగా పరిగణించి అందుకు తగిన శిక్షగా అమలు చేయాలనీ పార్లమెంటుకు సుప్రీంకోర్టు సూచనలు చేసింది.
అమెరికా సంస్థ ఖండన
వాషింగ్టన్‌ : జార్ఖండ్‌లో హిందూత్వశక్తుల మూకదాడి ఘటనను అమెరికన్‌ ఇంటర్నేషనల్‌ రెలీజియస్‌ ఫ్రీడమ్‌ కమిషన్‌ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌) ఖండించింది. ‘ఈ క్రూరమైన హత్యను మే ఖండిస్తున్నాం. మత నినాదాలు చేయాలంటూ బాధితుడు తాబ్రేజ్‌ అన్సారీని గంటల తరబడి తీవ్రంగా కొట్టడం దారుణమైన విషయం. అన్సారీ హత్యపై సమగ్ర దర్యాప్తుతో పాటు, ఈ కేసులో పోలీసుల పాత్రపైనా విచారణ జరపాలి. హింస, భయానక వాతావరణాన్ని తొలగించేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం’ అని యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ అధ్యక్షులు టోనీ పెర్కిన్స్‌ డిమాండ్‌ చేశారు.

(నవ తెలంగాణ సౌజన్యంతో)

Leave a Reply