ఆత్మహత్య వంటి అభివృద్ధి అవసరమా?

0
124

చినుకు చినుకు చిరుజల్లై, వానై, వరదై, పల్లానికి పారి వాగవుతుంది. వాగులు విడివిడిగా కలివిడిగా పారి నదులవుతాయి. ఇది కదా జలసూక్తం. ఎక్కడ వీలయితే అక్కడ, ఏది వీలయితే అది చేసి, దోసిలిపట్టి, చెలిమలు తవ్వి, అడ్డుకట్టలు కట్టి, తూములు తవ్వించి అలుగులు పారించి నీటి నుంచి దాహం తీర్చుకుంటాము, ఆహారాన్ని పిండుకుంటాము. భూమిని, ఆకాశాన్ని గౌరవిస్తూ చేసే మనుగడ ప్రయాణం ఇది. తెలివిమీరిపోయి అభివృద్ధి మతం పుచ్చుకుని అంతా తలకిందులు చేసుకున్నాము కదా, అందుకని, ఇప్పుడు వరద వాగై చెరువై నదిలోకి పారదు. నదిలోనుంచి నీటిని వెనకకు తరిమి, చెరువులను నింపుకుంటాము. నదిని ఉపనదిలోకి తోడిపోస్తాము. వర్షాకాలాన్ని ఎండబెట్టుకుని, జీవితాన్ని ఎడారి చేసుకుని, దూరాల నీటి కోసం భగీరథ ప్రయత్నం చేస్తాము.

వందల కిలోమీటర్ల దూరం నుంచి మెగావాట్ల ఖర్చుతో మంచినీళ్లు తెచ్చుకుంటున్నాము కదా, మనకింక చెరువెందుకు, పూడ్చుకుందాం అని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ మధ్య సభాముఖంగా అన్నారు. అవే మాటలు కావు కానీ, అటువంటి మాటలే అన్నారు. హైదరాబాద్ మహానగరానికి పశ్చిమాన అనంతగిరి కొండల్లో పుట్టి, అరవై డెబ్భై కిలోమీటర్లు దిగువకు ప్రవహించే మూసీ, అటువంటిదే మరో సహనది ఈసా, వాటి మీద ఏడో నిజాం కాలంలో నిర్మించిన జంటజలాశయాలు ఇక ఏమాత్రం సంరక్షణకు అర్హమైనవి కావని, వాటికిక నీళ్లు వదలవచ్చునని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. పాతికేళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో 111 నెంబర్ జీవో ద్వారా, ఈ జంటజలాశయాలకు పది కిలోమీటర్ల వ్యాసార్థం మేర ఎటువంటి మహా నిర్మాణాలు, కర్మాగారాలు, నివాస కాలనీలు, వ్యాపార భవనాలు నిర్మించకూడదని నియంత్రణలు విధించారు. సుప్రీంకోర్టు కూడా ఈ నియంత్రణ అమలు విషయంలో పట్టింపుగా ఉండి, ఎటువంటి సడలింపులను, ఉల్లంఘనలను అనుమతించరాదన్న వైఖరి తీసుకున్నది.

జంటనగరాల వాసులు తాగే నీరు పరిశుభ్రంగా, కాలుష్యరహితంగా ఉండడం కోసం ఆ ప్రభుత్వాదేశాన్ని ఉద్దేశించారు. మరి, ఆ నీళ్లే తాగనప్పుడు, వాటి నుంచి మంచినీటి సరఫరా జరగనప్పుడు, ఇక ఆంక్షలెందుకు? ముఖ్యమంత్రిగారి వాదన తీసిపారేయదగినది కాదు. పైగా, ఆ జీవోను తొలగించాలని లేదా సడలించాలని నియంత్రణల పరిధిలోకి వచ్చే 84 గ్రామాల ప్రజలు కోరుతున్నారు, పంచాయితీలు తీర్మానాలు చేశాయి. ఆ గ్రామాల్లో భూములున్నవారంతా, ఎప్పుడెప్పుడు తమ భూములను అమ్ముకోగలమా అని తహతహలాడుతున్నట్టు ప్రచారం మొదలయింది కూడా. ఈ జీవో నుంచి విముక్తి ప్రసాదించండి మహాప్రభో అంటూ గ్రీన్ ట్రైబ్యునల్ ముందు కూడా ‘బాధితులు’ మొరపెట్టుకున్నారు. నిజమే. హైదరాబాద్ నగరం విపరీతంగా విస్తరిస్తూ, భూముల ధరలు ఆకాశాన్ని అందుకుంటుంటే, ఎటువంటి ‘అభివృద్ధీ’ లేకుండా కునారిల్లి పోవలసిందేనా అని ఆ ప్రాంత వాసులు బాధపడడం సమంజసమే. అవసరానికి ఎవరైనా ఆస్తులు అమ్ముకోవాలనుకుంటే, వారికి లభించే ధర– నియంత్రణలోలేని సమీప భూములతో పోల్చుకుంటే దయనీయంగా తక్కువగా ఉండడం అన్యాయమే. ఆంక్షలు ఎందుకు ఉద్దేశించారో ఆ ప్రయోజనాన్ని కాపాడుకుంటూనే, అక్కడి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం సరిదిద్దవచ్చు. నీటి ఉద్యమ నాయకుడు రాజేంద్రసింగ్ చెప్పినట్టు, గ్రామాలన్నిటినీ ఖాళీచేయించి, ఆ ప్రజలకు సంతృప్తికరమైన చోట, ఖరీదైన భూవిలువలున్న చోట పునరావాసం ఇవ్వవచ్చు.

ఒక సాముదాయిక, విశాల ప్రయోజనానికి, స్థానికమయిన సామూహిక, లేదా వ్యక్తి ప్రయోజనానికి వైరుధ్యం ఉండడం అనేక చోట్ల చూస్తాము. వైభవ చరిత్ర కలిగిన విజయనగర సామ్రాజ్య శిథిలాల కేంద్రం హంపీని ఐక్యరాజ్యసమితి చారిత్రక వారసత్వ కేంద్రంగా గుర్తించి, నిధులిచ్చి, పరిరక్షించే కార్యక్రమాన్ని తీసుకున్నది. ఆ గుర్తింపు కారణంగా, హంపీ, కమలాపురం, ఆనెగొంది గ్రామాల పరిధిలోని గుర్తించిన ప్రాంతాలలో బహుళ అంతస్థుల నిర్మాణం కానీ, కాంక్రీటు శ్లాబులు కానీ వేయడం నిషిద్ధం. ఈ యునెస్కో ప్రాజెక్టు ఎప్పుడు ముగుస్తుందా, ఎప్పుడు తమ ఆస్తుల విలువలను పెంచుకుందామా అని స్థానికులు ఆశపడుతూ ఉంటారు. జంటజలాశయాల పరిధిలోని గ్రామాల రైతులు కానీ, హంపీ పరిసరాల ప్రజలు కానీ ఆంక్షలు తొలగినందువల్ల పెద్దగా లాభపడేదేమీ ఉండదు. లాభం కనుక నిజంగా వారికే ఉంటే, ఆంక్షల ఎత్తివేతపై ఇంతగా వత్తిడి ఉండేది కాదు.

లాభం ఇతరులకు అన్నది గ్రహించాలి. హైదరాబాద్‌లో గ్రామాలకు గ్రామాలు ఆనవాలు లేకుండా పోయి, ఇప్పుడు కోటీశ్వరుల ఆవాసాలుగా మారాయి. ఆ పరిణామంలో మొట్టమొదట అమ్ముకున్నవారికి లేదా అమ్ముకోవలసి వచ్చినవారికి దక్కింది అతి తక్కువ. జీవో 111 నిష్క్రమణ తరువాత లబ్ధి పొందేది ఆయా గ్రామస్థులు కాదు. ఇప్పటికే గ్రామస్థుల భూములు చాలా మటుకు అనధికారికంగా నామమాత్రపు ధరలకు చేతులు మారాయి. రాజకీయవాదుల చేతుల్లోకి, ముఖ్యంగా అధికార రాజకీయుల చేతిలోకి తరలిపోయాయి. తక్కినవి, భూవ్యాపారస్థుల ఖజానాగా మారిపోయాయి. ఆంక్షలు తొలగిన తరువాత జరగవలసింది లాభాల స్వీకరణ మాత్రమే. ఆయా గ్రామాల ప్రజల పేరుతో సడలింపో, తొలగింపో ఉద్దేశించినప్పటికీ, మహా లబ్ధిదారులు వారు కాబోరు.

లబ్ధిదారుల సంగతి పక్కనబెడితే, నష్టపోయేది ఎవరు? అసలు జంట జలాశయాల విషయంలో అయినా, ఏ సహజవనరుల విషయంలోనైనా లాభనష్టాలకు ఆస్కారం ఉన్నవారెవరు? కేవలం అక్కడ స్థానికంగా ఉన్నవారు మాత్రమేనా? జంటజలాశయాల భవితవ్యాన్ని నిర్ణయించేది వాటికి నీరు అందించే ప్రాంతాల గ్రామాలు మాత్రమేనా? ఆ జలాశయాలపై జంటనగరాల వాసులకు, నగరాన్ని దాటి మరొక రెండు వందల కిలోమీటర్ల మేర ఉన్న మూసీ ప్రవాహమార్గంలోని ప్రజలకు ఎటువంటి ప్రమేయం లేదా? రెండున్నర దశాబ్దాల నుంచి 111 జీవో అమలులో ఉన్నప్పటికీ, వేలాది అక్రమనిర్మాణాలు జరిగాయి. వీటి ఫలితాన్ని జంటనగరాల ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు. మూసీ మురుగుకాలువగా మారిపోవడం, శివారు ప్రాంతాలలో కాలుష్యజలాలతో పండించిన కూరగాయలను నగరవాసులు తినవలసిరావడం, సూర్యాపేట మూసీప్రాజెక్టు దాకా కూడా రసాయన విషాలు నీటిలో కొనసాగడం అందరికీ అనుభవమే. మరొక పక్క హైదరాబాద్‌లోని వందలాది జలాశయాలు వివిధ నిర్మాణాల కారణంగా ఎండిపోయి, చిన్న వర్షానికే నివాసప్రాంతాలన్నీ వరదమయంకావడం చూస్తూనే ఉన్నాము. నీరు, చెట్టు, గాలి కేవలం స్థానికమయిన ప్రభావాలను మాత్రమే వేయవు. విషపూరితం అయితే, నష్టాలు స్థానికంగా మాత్రమే పరిమితం కావు.

జీవో 111 మంచినీటి నాణ్యతను రక్షించేందుకు ఉద్దేశించింది అయి ఉండవచ్చును కానీ, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించింది కేవలం మంచినీటి కోసం కాదు. వరదల నివారణకు. జలాశయాలకు నీరందించే వరదకాల్వలను సంరక్షించడం, వర్షపు వరదను క్రమబద్ధం చేయడం కోసం కూడా. హైదరాబాద్ నగరపు ఎనిమిది దిక్కులలో కనీసం ఒక దిక్కు పచ్చదనంతో, ఆహ్లాదంగా ఉంటున్నది. నగరానికి గాలిని, చల్లదనాన్ని అందించే వనరుగా ఉంటున్నది. ఇప్పుడు, ఈ దిక్కును కూడా కాంక్రీటువనంగా మారిస్తే, దాని ఫలితాలను తెలంగాణ రాజధానిలోని కోటికి పైగా జనం అనుభవిస్తారు. నూరు సంవత్సరాల దాకా సరిపోతాయట కృష్ణా–గోదావరులు? అవి మాత్రం మూసీ వంటి నదులు కావా, వాటికి నీరు వచ్చే మార్గాలను మరెవరో అభివృద్ధి చేయరా, అక్కడ మాత్రం నిర్మాణాలు వచ్చి నదులు దారిమారవా? మరెవరో వాటి వల్ల ఉపయోగం ఏమిటని, పర్యావరణ నియమాలను రద్దుచేయరా?

అభివృద్ధి అంటే ఫలానాదే అన్న అర్థం రూఢి అయినప్పుడు, అది లోపించినప్పుడు జనం బాధపడడం సహజం. కొందరు ప్రజలు నష్టపోయి తక్కినవారికి మేలు చేయాలని ఆశించడం న్యాయం కాదుకూడా. కానీ, పర్యావరణాన్ని, జలప్రవాహమార్గాలను కాపాడడం ప్రభుత్వాల బాధ్యత. ఇంధనం ఖర్చు లేకుండా పల్లానికి పారే మంచినీరును వదిలిపెట్టి, నీళ్లను ఎత్తిపోసుకోవడమే తలకిందుల అభివృద్ధి. చెరువులను, నదీమూలాలను క్షీణింపజేసి రియల్ వ్యాపారులకు అప్పజెప్పడం వినాశకర అభివృద్ధి.

నష్టపోతున్న ప్రజలకు పరిహారాన్ని ఇవ్వండి. పచ్చదనం ఇసుమంత కూడా పోకుండా, నిబంధనలకు లోబడి జీవనోపాధులకు ఆస్కారం ఇవ్వండి. పర్యావరణహితమైన నిర్మాణ, స్థల నిష్పత్తితో విద్యాలయాలు, అధ్యయన సంస్థలు నిర్మించండి. తలచుకుంటే, తలపులుంటే ప్రకృతిని కాపాడుకుంటూనే ప్రగతి సాధించవచ్చు. ఉపనదిని మహానదిగా తీర్చిదిద్దవచ్చు.

Courtesy Andhrajyothi

Leave a Reply