సైబర్‌ వల.. అమాయకుల విలవిల

0
646

పేటీఎం’, ‘గూగుల్‌పే’ అంటూ వస్తున్న ఫోన్లు
నగదు బహుమతులు, తక్కువ ధరలకే ఖరీదైన వస్తువులంటూ ఎర
మూడురెట్లు పెరిగిన సైబర్‌ నేరాలు
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కొత్త నేరస్థులు
హైదరాబాద్‌

మీకు ‘పేటీఎం.. గూగుల్‌పే’ ఖాతాలున్నాయా..? అంటూ ఫోన్లు వస్తున్నాయా..? ఇలా వస్తున్నాయంటే.. మీ వ్యక్తిగత వివరాలు సైబర్‌ నేరస్థుల వద్ద ఉన్నట్లే. మీకు కార్లు ఇస్తాం.. రూ.కోట్లలో నగదు బహుమతులు ఇస్తామంటూ చెప్పనున్నారు.. మరికొందరు మీ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో ఉంచి వాటిన అశ్లీలంగా మార్చి బ్లాక్‌ మెయిల్‌ చేయనున్నారు. డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు కొత్తవి ఇస్తామంటూ ఓటీపీ నంబర్లు చెప్పించుకుని రూ.లక్షలు కొల్లగొట్టనున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో బాధితులు మోసపోయారు. కొత్తగా పదుల సంఖ్యలో బాధితులు ఫిర్యాదు చేసేందుకు సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సైబర్‌ నేరాలు గతేడాదితో పోలిస్తే మూడింతలయ్యాయి. 2018వ సంవత్సరంలో మొత్తం 401 కేసులు నమోదు కాగా ఈ ఏడాది జవవరి నుంచి 11 నెలలకు 1,206 కేసులు నమోదయ్యాయి. స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరగడం.. డిజిటల్‌ చెల్లింపులపై పూర్తిగా అవగాహన లేని వారు సైతం వినియోగించడం.. బ్యాంక్‌ అధికారుల పేర్లతో ఫోన్‌ చేస్తే.. రెండో ఆలోచన లేకుండా ఓటీపీ నంబర్లను చెప్పడంతో సైబర్‌ నేరాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. సామాజిక మాధ్యమాలు, డిజిటల్‌ పద్ధతుల్లో నగదు చెల్లింపులు. బహుమతులపై అవగాహన పెంచుకోకపోతే మరిన్ని నేరాలు నమోదయ్యే అవకాశాలున్నాయని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు.

ఐదు నెలలు.. ఏడువందల కేసులు
సైబర్‌ నేరాలపై ప్రజలు, విద్యావంతులు, విద్యార్థులకు అవగాహన కలుగుతున్న నేపథ్యంలో క్రమంగా మోసపోతున్న వారి సంఖ్య తగ్గుతుందని పోలీస్‌ అధికారులు భావించారు. వీరి అభిప్రాయాలకు అనుగుణంగానే ఈ ఏడాది జూన్‌ నెలాఖరు వరకు 487 కేసులు నమోదయ్యాయి. కొత్త పద్ధతుల్లో సులభంగా రూ.లక్షలు కొల్లగొట్టవచ్చంటూ సైబర్‌ నేరస్థులు తెలుసుకోవడంతో సైబర్‌ నేరాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. తక్కువ ధరకే వాహనాలు విక్రయిస్తామని, సగం ధరకే కెమెరాలు, ఖరీదైన ఫోన్లు ఇస్తామంటూ సైబర్‌ నేరస్థులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఓఎల్‌ఎక్స్‌, గూగుల్‌పే, పేటీఎంలకు జనం బాగా అలవాటవడంతో పోలీస్‌ అధికారుల అంచనాలు తప్పాయి. జులై నుంచి నవంబరు నెలాఖరు వరకూ ఐదు నెలల్లో 700 కేసులు నమోదయ్యాయి. సైబర్‌ నేరస్థుల మాటలు నమ్మి బాధితులు వారు సూచించిన బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. తొలుత వేలల్లో నగదు బదిలీ చేయించుకుంటున్న నేరస్థులు తర్వాత దశలవారీగా రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. వివిధ మార్గాల్లో మధ్యతరగతి వారిని లక్ష్యంగా చేసుకుని మోసాలు చేస్తున్నారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేస్తున్నా..నేరస్థులుపుట్టుకొస్తున్నారు.

ఉత్తర భారతం నుంచే…
ఈ ఏడాది ప్రారంభం నుంచే సైబర్‌ నేరాలు పెరుగుతుండడంతో పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. బాధితులు తెలిపిన వివరాల ఆధారంగా సైబర్‌ నేరస్థుల్లో సింహభాగం దిల్లీ నుంచే నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దిల్లీ తర్వాత జాతీయ రాజధాని ప్రాంతీయ కారిడార్‌ నోయిడా, గుర్‌గావ్‌, రాజస్థాన్‌, ఝార్ఖండ్‌, బిహార్‌ రాష్ట్రాల నుంచి నేరస్థులు ఎక్కువగా మోసాలకు తెగబడుతున్నారు. నేరాలు చేస్తున్న వారి చరిత్రను పరిశీలించగా.. దిల్లీలో ఉంటున్న వారిలో పాతికేళ్లలోపు యువకులు ఎక్కువమంది ఉంటున్నారు. ఇక రాజస్థాన్‌, ఝార్ఖండ్‌, బిహార్‌ రాష్ట్రాలకు చెందిన నిందితులకు కనీస అక్షరజ్ఞానం కూడా లేదు. దిల్లీ, నోయడా, గుర్‌గావ్‌లకు ఉపాధి కోసం వచ్చిన యువకులు సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని నెలరోజుల్లో నేర్చుకుంటున్నారు.

స్పందిస్తే లాగేస్తున్నారు : అవినాశ్‌ మహంతి, సంయుక్త కమిషనర్‌(నేర పరిశోధన)
సైబర్‌ నేరస్థుల మాటలు, ప్రకటనలకు మనం స్పందించిన వెంటనే లాగేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం బాధితులు ముందు జాగ్రత్తలు పాటించకపోవడమే. నేరస్థుడు ఫోన్‌ చేసి డబ్బు పంపించమని అభ్యర్థించగానే నగదు బదిలీ చేస్తున్నారు. వస్తువులు చూడకుండా లాటరీ సొమ్ము చెక్కు పంపుతున్నామంటే చెక్కు వచ్చేంత వరకూ ఆగకుండా బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తున్నారు. సైబర్‌ నేరాలపై మేం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం.

Courtesy Eenadu…

Leave a Reply