ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి

0
110
  • ఆమె తల్లికీ కత్తిపోట్లు.. ఆపై యువకుడి ఆత్మహత్యాయత్నం

మియాపూర్‌ : మియాపూర్‌ పరిధిలోని ఆదిత్యనగర్‌లో ప్రేమోన్మాది ఘాతుకం కలకలం రేపింది. తనను కొంతకాలంగా దూరం పెడుతున్నదని కక్ష పెంచుకున్న యువకుడు యువతితోపాటు ఆమె తల్లిపై కత్తితో దాడిచేసి, తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం తాను గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసుల కథనం ప్రకారం..గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన హమాలీ సందీప్‌కుమార్‌ (22) అదే గ్రామానికి చెందిన వైభవి (19) మూడేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే, రెండేండ్లుగా సందీప్‌ను వైభవి దూరంపెడుతున్నది. ఈ ఏడాది మే నెలలో స్వగ్రామం రేపల్లె నుంచి వైభవి తన తల్లి శోభ (38), సోదరుడితో కలిసి మియాపూర్‌కు మకాం మార్చింది. ఇటీవల వైభవికి వేరే సంబంధాలు చూస్తున్నారని తెలుసుకొన్న సందీప్‌ రేపల్లె నుంచి మియాపూర్‌కు చేరుకొన్నాడు. మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో వైభవి ఇంటివద్ద కత్తి పట్టుకొని హల్‌చల్‌చేశాడు. వైభవి, ఆమె తల్లి శోభపై దాడిచేశాడు. అనంతరం తాను సైతం గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు అక్కడికి చేరుకొని ముగ్గురిని దవాఖానకు తరలించారు. తల్లీకూతుళ్ల పరిస్థితి నిలకడగానే ఉన్నదని మియాపూర్‌ సీఐ తిరుపతి తెలిపారు. సందీప్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో కోఠి ఈఎన్‌టీ దవాఖానకు తరలించినట్టు చెప్పారు. అతడికి గ్రీన్‌ యూనిట్‌ వైద్యుడు నాగరాజు ఆధ్వర్యంలో గొంతు సర్జరీ చేశారని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తిరుపతి వెల్లడించారు.

Leave a Reply