డిగ్రీ విద్యార్థిని అనూషపై అమానుషం

0
370

 

నరసరావుపేట : డిగ్రీ విద్యార్థినిని ప్రేమ పేరుతో తోటి విద్యార్థే హత్య చేశాడు. మృతదేహౄన్ని కాల్వలో పడేసి మృతురాలి తల్లికి చెప్పి శవాన్ని తెచ్చుకోండని చెప్పడంతోపాటు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఈ ఘటన నరసరావుపేట మడలంలో చోటుచేసుకుంది. దీంతో మృతురాలి కుటుంబీకులతోపాటు విద్యార్థులు, రాజకీయ పార్టీలు అనూష మృతదేహంతో పెద్దఎత్తున ఆందోళన చేపట్టాయి. దీనిపై పోలీసుల వివరాల ప్రకారం..

ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన కోట అనూషా (19) నరసరావుపేటలోని కృష్ణవేణి డిగ్రీ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతోంది. తన తరగతికే చెందిన బొల్లాపల్లి మండలం పమిడిపాడుకు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి కొన్నాళ్లుగా ప్రేమపేరుతో అనూషను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో అనూష బుధవారం బస్సు దిగి కాలేజీకి వెళ్తుండగా మాట్లాడాలంటూ విష్ణువర్ధన్‌రెడ్డి అనూషను ఆటోల బలవంతంగా ఎక్కించుకుని పాలపాడు రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఇద్దరి మధ్య వాగ్వాదనం అనంతరం అనూషపై విష్ణువర్ధన్‌రెడ్డి దాడి చేయడంతోపాటు గొంతునులిమి హతమార్చాడు. మృతదేహాన్ని గోవిందపురం మేజరు కాల్వలో పడేశాడు. అనంతరం అప్పటికే పొలం పనిలో ఉన్న అనూష తల్లికి ఫోన్‌ చేసి ‘మీ అమ్మాయిని చంపాను..’ అని చెప్పాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.

తన కుమార్తెపై ఘాతుకంపై గుండెలు పగిలేలా రోధించిన తల్లి పట్టణంలోని మరో కళాశాలలో చదువుతున్న తన కొడుకుకి చెప్పగా వారు ఘటనా స్థలికి వెళ్లారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతురాలి సోదరుని ద్వారా మృతదేహాన్ని గుర్తించి బయటకు తీసి నరసరావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.

న్యాయం కోసం భారీ ఆందోళన
విషయం తెలిసిన పట్టణంలోని విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడున్న మృతురాలి కుటుంబీకులు, బంధువులతో కలిసి ఆస్పత్రి నుండి మృతదేహాన్ని పల్నాడు రోడ్డులోని మయూరి లాడ్జి సెంటర్‌కు తీసుకెళ్లి రాస్తారోకో చేపట్టారు. ఉదయం 11 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఆందోళన కొనసాగింది. విష్ణువర్ధన్‌రెడ్డిని తక్షణమే కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గంటల తరబడి ఆందోళన చేస్తున్నా జిల్లాకు చెందిన మహిళ అయిన హోం మంత్రి సుచరిత స్పందించకపోవడం దారుణమని అరవిందబాబు విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో దిశా చట్టం అమలులో ఉందా? లేదా? అని ప్రశ్నించారు. నిందితుని సామాజిక తరగతి దృష్ట్యా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? లేదా? అని అనుమానం వ్యక్తం చేశారు. టిడిపి నాయకులు డాక్టర్‌ కోడెల శివరాం మాట్లాడుతూ నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. సిపిఎం నాయకులు కామినేని రామారావు, డి.శివకుమారి, మొటిల్దాదేవి, శిలార్‌ మసూద్‌ వెంకటేశ్వరరాజు, ఎస్‌ఎఫ్‌ఐ పశ్చిమ గుంటూరు జిల్లా కార్యదర్శి టి.వంశీ ఆందోళనలో పాల్గొన్నారు.

అనూష మరణవార్త నేపథ్యంలో రామిరెడ్డిపేటలోని కళాశాలపై రాళ్ల దాడి చేశారు. అయితే అనూష వ్యవహారంలో తమకు ఏ విషయం తెలియదని ప్రిన్సిపల్‌ నాతాని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. తను చదువులో ముందుండేదన్నారు. బాధిత కుటుంబానికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ పోన్‌ద్వారా పరామర్శించారు.

పాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ
విషయం తెలుసుకున్న సబ్‌కలెక్టర్‌ శ్రీనివాస్‌నుపూర్‌ అజరుకుమార్‌ ఆందోళన ప్రదేశానికి చేరుకున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినా మృతురాలి కుటుంబీకులు, విద్యార్థులు, నాయకులు అంగీకరించలేదు. ఇప్పుడే న్యాయం చేయాలని, అందుకు ఎంత సమయం కావాలో తీసుకోవాలని పట్టుబట్టారు. అయితే పాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ చేపట్టి 21 రోజుల్లో శిక్ష పడేలా చేయాలని రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్ని ఆదేశించినట్లు డిఎస్‌పి విజయభాస్కర్‌ తెలిపారు. సిఎం రూ.10 లక్షల పరిహారం ప్రకటించారని, కేసు సత్వరమే దర్యాప్తు చేస్తామని చెప్పారు. మృతదేహం పాడవకముందే అంత్య క్రియలు నిర్వహించాలని కోరారు. సబ్‌కలెక్టర్‌ హామీతో మృతదేహాన్ని రాత్రి వేళ తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా తిరుపతికి వెళ్లిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కనీసం ఆ పార్టీ వారినైనా ఇంత పెద్ద ఆందోళన వద్దకు పంపలేదని పలువురు విమర్శించారు.

Courtesy Prajashakti

Leave a Reply