కమలం నేత.. కోట్లలో మేత.. 4 రాష్ట్రాల్లో రూ.30 కోట్ల దందా!

0
25
  • నామినేటెడ్‌ పోస్టులు, పదవుల ఆశ చూపి వసూళ్లు
  • ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో బాధితులు
  • పోలీసులకు ఫిర్యాదు.. ఆధారాలతో ఉచ్చు.. రంగంలోకి ఎంపీ
  • అర్ధరాత్రి అధికారులకు ఫోన్లు.. అరెస్టు చేయవద్దంటూ ఒత్తిడి
  • తమిళ నేతల ద్వారా ఢిల్లీ పెద్దల దృష్టికి.. రాష్ట్ర నేతల్లో వణుకు

‘జాతీయ స్థాయిలో నామినేటెడ్‌ పోస్టు కావాలా? ఎంత ఖర్చు పెట్టగలవు.? సరే అడ్వాన్స్‌ తీసుకురా.? చేయించేస్తా’ అంటూ రూ.కోట్లలోనే మేసేస్తున్న రాష్ట్రానికి చెందిన ఓ బీజేపీ నేత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ప్రస్తుతం ఆయన రాష్ట్ర స్థాయి పార్టీ పదవిలో కొనసాగుతున్నారు. పదవులు, నామినేటెడ్‌ పోస్టులు ఇప్పిస్తానంటూ మన రాష్ట్రంతోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో సైతం భారీగా వసూళ్లకు పాల్పడ్డాడు. ‘పార్టీ ఖర్చుల పేరుతో లక్షలు వసూళ్లు చేయండి.. మీరు కొంత ఖర్చు పెట్టుకుని మాకు కొంత పంపండి.. మూడు లక్షలు పంపితే నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి’ అంటూ ఆఫర్లు పెట్టినట్టు తెలిసింది. డబ్బులు తీసుకుని వాటిని ఇప్పించక పోవడంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. ప్రాథమిక దర్యాప్తు చేసిన రాష్ట్ర సీఐడీ పోలీసులు… పక్కా ఆధారాలు సేకరించి ఆయనను అరెస్టు చేసేందుకు సిద్ధమయినట్టు చెబుతున్నారు. ఇంతలోనే….. ఢిల్లీ పెద్దలతో సాన్నిహిత్యం ఉండి, పదేపదే మీడియా ముందుకు వచ్చి స్పీచులిచ్చే ఒక ఎంపీ రంగంలోకి దిగి, అరెస్టును ఆపేందుకు తన అధికార బలంతో సదరు నేత అరెస్టు కాకుండా అడ్డుపడుతున్నట్లు సమాచారం. ‘అరెస్టు దాకా వద్దు. వసూలు చేసిన డబ్బును వెనక్కి ఇప్పించేస్తా’ అని పోలీసు అధికారులను ప్రాధేయపడుతున్నట్లు తెలిసింది. రాష్ట్రాలు దాటిన ఈ దందాలో ఇప్పటివరకు ఆ కమలం నేత 30కోట్ల రూపాయలమేర దండుకున్నారని చెబుతున్నారు. పొరుగు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ద్వారా ఈ విషయం పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

85మంది – 30 కోట్లు..
వివాదాస్పద నేతది రాష్ట్ర నడిబొడ్డున ఉండే జిల్లా. గతంలో టీడీపీలో ఉంటూ మహిళా ప్రజాప్రతినిధి పట్ల అనుచితంగా వ్యవహరించి అప్పట్లో ఆ పార్టీ పెద్దల ఆగ్రహానికి గురయ్యారు. ఎన్నికల తర్వాత పార్టీ మారి బీజేపీలో రాష్ట్ర స్థాయి పదవి సాధించుకున్నారు. పార్టీలోని కొందరు పెద్దలకు అవసరమైన సౌకర్యాలు ఆయన ఏర్పాటు చేస్తుంటారు. అందులోభాగంగానే ఒక పార్లమెంటు సభ్యుడితో సఖ్యతగా ఉంటూ తరచూ ఢిల్లీకి వెళుతూ జాతీయ పార్టీ పెద్దలు, రాష్ట్రానికి వచ్చే కేంద్ర మంత్రులతో ఫొటోలు దిగుతూ, తన సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తుంటారు. తనకు పలుకుబడి ఉన్నట్లు నామినేటెడ్‌ పదవి కోసమో, ఏదైనా డైరెక్టర్‌ పోస్టు కావాలనో సంప్రదిస్తే ఇప్పించగలను అనేలా పరిస్థితులు సృష్టించుకుంటారు. ఎవరైనా బుట్టలో పడితే వాళ్ల శక్తి, ఆశించే పదవిని బట్టి కోట్లలో సమర్పయామి అనాల్సిందే. సుమారు 85మందితో భారీగా వీరినుంచి డబ్బులు వసూలు చేయించారు. తెలంగాణలో 35 మంది, కర్ణాటకలో 16మంది, తమిళనాడులో సుమారు 20మంది ఏదో ఒక రూపంలో అతనికి సహకరించినట్టు తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన కొందరు బాధితులు అక్కడి నాయకులకు ఈ విషయం చెప్పారు. ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ కీలక నాయకుడు, మాజీ ఐపీఎస్‌ అధికారి… ఏపీ పోలీసులతో మాట్లాడటంతో డొంక కదిలినట్లు తెలుస్తోంది. ఏపీలో ఈ నాయకుడి బుట్టలో పడ్డ బాధితులు రాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రాథమికంగా నిర్ధారించుకుని ఆధారాలు లభించడంతో ఉచ్చు భిగించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అయితే విచారణలో భాగంగా మధ్యవర్తులతో పోలీసు అధికారులు మాట్లాడటంతో తన అరెస్టుకు రంగం సిద్ధమైందని పసిగట్టిన బీజేపీ నాయకుడు ఢిల్లీలో తనకు అండగా ఉండే ప్రజాప్రతినిధిని రంగంలోకి దించినట్లు సమాచారం. వసూళ్ల సమయంలోనే ఆయనకు కూడా కొంత మేర వాటా ఇస్తున్నట్లు చెప్పినా పెద్దగా నమ్మని బాధితులు అదే నాయకుడే పోలీసులకు అర్ధరాత్రుల్లో ఫోన్లు చేసి అరెస్టు చేయవద్దని, డబ్బులు వెనక్కి ఇప్పించేస్తానని బతిమాలు కోవడంతో అనుమానం బలపడింది.  పోలీసులు సైతం ఏపీ ప్రభుత్వంలోని పెద్దలతో ఆయనకున్న సంబంధాలు తెలిసి కాస్త నెమ్మదించారని బాధితులు వాపోతున్నారు. ఇదే సమయంలో తమిళనాడులోని బాధితుల ద్వారా తెలంగాణలో మోసపోయిన వారిని కూడా ఏకం చేసి ఢిల్లీ పెద్దలకే నేరుగా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అగ్రనాయకత్వం గట్టి చర్యలు తీసుకొంటుందని కొందరు వ్యాఖ్యానిస్తుండగా, గతంలో తిరుపతికి సమీపంలోని ఓ ఆశ్రమంలో వసూళ్లు చేసిన నాయకులపై చర్య తీసుకున్నారా…అనే వాదన మరికొందరు వినిపిస్తున్నారు.

రియల్‌ దందా…
చూడటానికి సౌమ్యుడిలా కనిపించే సదరు నేత…రాష్ట్ర నడిబొడ్డున ఉండే జిల్లాలో ఖరీదైన భూములపై కన్నేసి మంత్రాంగం నడుపుతుంటారనే  ఆరోపణలు, ఫిర్యాదులు తరచూ వస్తుంటాయి. భూ యజమానులు ఎవరైనా చనిపోతే వాళ్లు బతికున్నప్పుడు తనకు అగ్రిమెంట్‌ చేశారంటూ డాక్యుమెంట్లు పుట్టిస్తారని, వాటి ఆధారంగా కుటుంబ సభ్యులను బెదిరిస్తారనే ఆరోపణలున్నాయి. ఏదోరూపంలో ఆస్తిని ఆక్రమించుకోవడం, కుదరకపోతే కుటుంబసభ్యులతో రాజీపడి డబ్బులు వసూలుచేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని కోస్తాలోని ఒక నగరంలో టాక్‌.  రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తానని చెబుతూ రెండు, మూడు కార్లలో మనుషుల్ని తీసుకుని బీజేపీ నేతల వద్దకు వస్తూ దర్పం ప్రదర్శిస్తుంటారు. అదే హంగు, ఆర్భాటంతో ఢిల్లీ పెద్దల వద్దకు చేరి ఫొటోలు దిగి తన దందాలకు వాడుతున్నట్లు బాధితులు చెబుతున్నారు.

దొంగిలించిన కార్లకు నంబర్లు మార్చి..
దేశంలోని వివిధ ప్రాంతాల్లో కార్లు దొంగలించి విక్రయించే ముఠాతో సదరు నేత గతంలో సంబంధాలు నెరిపినట్టు తెలుస్తోంది. ఆ కార్లను తక్కువ ధరకు ఆయన కొనుగోలు చేసి, అప్పటికే పాడై గుజిరీకి చేరిన వాహనాల నంబర్లతో సీ బుక్‌ ఇప్పించి విక్రయించేవారని సమాచారం. కోల్‌కతా, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి కార్లు దొంగలించి తీసుకొచ్చేవారితో ఒకప్పుడు సంబంధాలు నెరిపిన చెబుతున్నారు. వారిలో కొందరి ద్వారా నామినేటెడ్‌ పోస్టులు, పదవులు ఆశించేవారిని బుట్టలో వేసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర బీజేపీ నాయకుడు వసూళ్లు చేసిన కోట్లాది రూపాయల గురించి మూడు వారాల క్రితమే బయటిపడింది. దీంతో రాష్ట్రానికి తరచూ వచ్చే ఢిల్లీ ప్రజాప్రతినిధి ఇటువైపు చూడటమే మానేశారని ప్రచారం జరుగుతోంది. అంతకుముందు దర్జాగా పోలీసు కాన్వాయ్‌తో వెళుతూ దర్పం ప్రదర్శించే ఆయన….ఇప్పుడు పోలీసుల్ని బతిమాలుకొంటూ బయట పడేందుకు మార్గాలు వెతుక్కొంటున్నారని సమాచారం. అయితే ఢిల్లీలో పార్టీ పెద్దలకు ఈ విషయం తమిళనాడు నాయకుల ద్వారా తెలిసిందని, త్వరలోనే చర్యలుంటాయని కొందరు బీజేపీ నేతలు చెబుతున్నారు.

Leave a Reply