జాతీయ విపత్తుగా ‘కోవిడ్’

0
204

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆదివారం నాటికి మనదేశంలో 93 మంది కోవిడ్-19 మహమ్మారి బారిన పడ్డారు. మహారాష్ట్రలో అత్యధికంగా 31 మంది కరోనా ప్రభావానికి గురయ్యారు. దేశంలో కరోనా కేసులు అధికమవుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా కల్లోలం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కోవిడ్‌ను జాతీయ విపత్తుగా ఇప్పటికే ప్రకటించింది. కోవిడ్‌ ఉధృతి నేపథ్యంలో ప్రపంచబ్యాంకు ఈ వ్యాధిని మహమ్మారిగా ప్రకటించడంతో దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌ కింద రాష్ట్రాలకు సాయం అందించేందుకు నిర్ణయించినట్టు వెల్లడించింది. వ్యాధి కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం అందించనున్నామని ప్రకటించింది.

కోవిడ్‌ వైరస్‌ను నిరోధించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నవారు అటాచ్డ్‌ బాత్రూమ్‌ ఉండే, గాలి, వెలుతురు బాగా వచ్చే గదిలో ఉండాలని సూచించింది. ఎక్కువ మంది అదే గదిలో ఉండాల్సి వస్తే మూడు అడుగుల కంటే ఎక్కువ దూరంలో ఉండాలని పేర్కొంది. వృద్ధులు, గర్భిణులు, పిల్లలకు దూరంగా ఉండాలని కోరింది. మరోవైపు కరోనా మృతుల అంతిమ సంస్కారాలపై మార్గదర్శకాలను రూపొందించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. శ్వాస సంబంధిత వ్యాధి అయిన కోవిడ్‌ దగ్గు, తుమ్ముల వల్ల బయటకు వచ్చే ద్రవాల ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని, మార్చురీ నుంచి లేదా మృతదేహం నుంచి వ్యాపించే అవకాశం లేదని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు, అపోహలను తొలగించేందుకు ఈ మార్గదర్శకాలు దోహదం చేస్తాయన్నారు.

Leave a Reply