నియంత రాజ్యం దిశగా దేశం

0
412

కోప్ర

మిత్రుడి నుంచి మాత్రమే కాదు
మనం, శత్రువు నుంచీ నేర్చుకోవాలి
మిత్రుని నుంచి పాఠం నేర్చుకుంటే,
శత్రువు నుంచి గుణపాఠం నేర్చుకోవాలి
ఒక్కోసారి గుణపాఠం కూడా మనల్ని
గట్టెక్కిస్తుంది
చేయాల్సిందేదో, చేయకూడనిదేదో
స్పష్టం చేసి మార్గ నిర్దేశనం చేస్తుంది
శత్రువు ఆయువుపట్టును మనకందించి
వాడిని నిస్సహాయుడిని చేసి
మనకు విజయాన్ని అందిస్తుంది
అవును! శత్రువునుంచీ మనం నేర్చుకోవాలి.
ప్రజా జీవితంలో అసలు ముఖాన్ని దాచడం, అసలు మాటను దాచడం చాలా కష్టం. ప్రజా వ్యతిరేకమైన తన సిద్ధాంతాన్ని, ప్రజా వ్యతిరేకమైన తన లక్ష్యాన్ని దాచి, ఆ సిద్ధాంత సఫలీకరణకోసం, ఆ లక్ష్య సాధనకోసం తిరిగి ఆ ప్రజలనే సాధనంగా వాడుకోవడం మరీ కష్టం. అంతటి కష్టమైన పనిని నిష్టగా చేస్తూ వస్తోంది సంఫ్‌ుపరివారం. 1925లో సంఫ్‌ు ఏర్పడినప్పటినుంచీ ఇప్పటి వరకూ దాదాపు 95ఏండ్లు అది ఏనాడూ చెప్పిన పని చేయలేదు. చేసిన పని చెప్పలేదు. చాపకింద నీరులా నిశ్శబ్దంగా అల్లుకు పోయింది. హక్కులు తప్ప బాధ్యతలు లేని ఒక ఉక్కు వ్యవస్థగా తనను తాను మలచుకుంది.
‘అఖండ హిందూ భారతం’ తన అంతిమ లక్ష్యమని పైకి చెబుతున్నప్పటికీ పెట్టుబడిదారీ వర్గ ఆర్థిక ప్రయోజనాలే సంఫ్‌ు పెద్దలకు అత్యంత ముఖ్యం. ఆ ఆర్థిక ప్రయోజనాలను నెరవేర్చడమే అంతిమ లక్ష్యం. అధికారం లేకుండా తన లక్ష్యం చేరడం అసాధ్యమనీ వారికి తెలుసు. అందుకనే మొదటి సార్వత్రిక ఎన్నికలకు ముందు తన రాజకీయ శాఖగా 1951 అక్టోబర్‌ 29న భారతీయ జనసంఫ్‌ు పార్టీని ఏర్పాటు చేసుకుంది. జనసంఫ్‌ు ప్రకటించిన తన మొదటి ఎన్నికల మేనిఫెస్టోలో ”ఒక దేశం, ఒక జాతి, ఒకే చట్టపరమైన పాలన” తన లక్ష్యమని ప్రకటించుకుంది. అలాగే, ‘హిందీని జాతీయ భాషగా, దేవనాగరి లిపిని అన్ని భారతీయ భాషలకు ఉమ్మడి లిపిగా అనుసరిస్తా’మని చెప్పింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు అధికార బలంతో అమలు చేస్తున్న, చేయబోతున్న, చేయబోయే ప్రయత్నం చేస్తున్న ఎజెండాను ఆరున్నర దశాబ్దాల క్రితమే స్పష్టంగా ప్రకటించింది. అయితే, ఆ ఎజెండాను ప్రచారంలో పెట్టకుండా అత్యంత జాగ్రత్త వహించింది. సమయానుకూలంగా కొత్త ఎజెండాలను, నినాదాలనూ సృష్టించి పబ్బం గడుపుకుంటూ, బండి లాక్కుంటూ వచ్చింది. అప్పటి వరకూ రాజకీయంగా అనామకంగా, అత్యంత బలహీనంగా ఉన్న సంఫ్‌ు ఎమర్జెన్సీ అనంతరం అందివచ్చిన రాజకీయ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఏకంగా తన రాజకీయ పార్టీని తానే రద్దు చేసుకుంది. జనసంఫ్‌ును రద్దు చేసుకుని అప్పుడు కొత్తగా ఏర్పడిన జనతా పార్టీలో 1987లో మమేకమైపోయింది. ఇది ఎంతో ముందుచూపుతో పన్నిన ఎత్తుగడ. తాము సొంతంగా ఎంత ప్రయత్నించినా రాజకీయంగా నిలదొక్కుకోవడం అసాధ్యమని గ్రహించిన సంఫ్‌ు పెద్దలు ఎమర్జెన్సీ అనంతరం ఏర్పడిన ఇందిర వ్యతిరేకతతో జనతాపార్టీకి అధికారం ఖాయమని భావించి, ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని విస్తరించేందుకు జనతా పార్టీలో భాగమైపోయింది. జనతాపార్టీ ముసుగులో తమ ప్రయాణం కొద్దికాలమేమని సంఫ్‌ు పెద్దలకు ముందే తెలుసు, అందుకు అనుగుణంగానే అందివచ్చిన అధికారాన్ని తన విస్తరణ సంపూర్ణంగా వాడుకుని అనతి కాలంలోనే 1980లో సొంతంగా భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసుకుంది.

అప్పటి వరకూ తను పొందిన అనుభవాల కారణంగా తమ అసలు ఎజెండాను సూటిగా ప్రకటించడం ప్రయోజనకరం కాదని గ్రహించి రెండు ముఖాల ప్రదర్శనకు పూనుకుంది. కఠినమైన హిందూత్వ ప్రతినిధిగా అద్వానీని, మృదు హిందూత్వ ప్రతినిధిగా వాజ్‌పేయిని ఎంచుకుని ముందుకు నడిచింది. ఇద్దరూ తమ తమ పాత్రలలో పూర్తిగా ఇమిడి పోయారు. మరీ ముఖ్యంగా వాజ్‌పేయి అయితే సాధారణ జనం గుర్తించలేనంత అసాధారణంగా తన ముఖోటా ముసుగు పాత్రను పోషించారు. ”ఈ రోజు నేను ప్రధానమంత్రిగా ఉన్నా రేపు లేకపోవచ్చు. కానీ నేను మొదటినుంచీ సంఫ్‌ు సేవకుడిని, ఇక ముందుకూడా అలాగే ఉంటాను” అని 2001లో న్యూయార్క్‌లో స్పష్టంగా ప్రకటించేంతవరకూ వాజ్‌పేయి అసలు రూపును ప్రపంచం పసిగట్టలేకపోయింది. ఇది ఆ పార్టీకి ఎంతో మేలు చేసింది. ఇతర పార్టీలను, తటస్థ ప్రజలను ఆకర్షించేందుకు వారిని వాడుకునేందుకూ ఉపయోగపడింది. వాజ్‌పేయి బహిరంగ వ్యక్తిత్వాన్ని అలా మలచకుంటే, ఇతర పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని మొదటి సారిగా ఏర్పాటు చేయడం సాధ్యమయ్యేది కాదు.
తన ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం సాధ్యమై, అధికారం చేతికందిన తరువాత సమాంతరంగా తన ఎత్తుగడ మార్చి అసలు ఎజెండాను ఒక్కొక్కటిగా బయటకు తీయడం మొదలుపెట్టింది పరివార్‌. మోడీ హయాం వచ్చే సరికి ”మతం పేరుతో భావోద్వేగాలు రెచ్చగొట్టడం, ఓటర్లలో ఆశలు కల్పించడం, సనాతన హిందూ సమూహం యొక్క విశ్వాసాలను సొమ్ముచేసుకోవడం ద్వారా అధికారంలోకి వచ్చి పెట్టుబడిదారీ వర్గం ప్రయోజనాలు నేరవేర్చడం” తన విధానంగా పెట్టుకుంది.అయినా మోడీ ప్రధాని పదవికి పోటీపడుతున్న 2014 ఎన్నికల్లో తన అసలు నినాదాలను పక్కనపెట్టి పేదల అనుకూల నినాదాలను ప్రచారం చేసింది. పేదలను ఆకర్షించడంలో భాగమే మోడీని ‘చారువాలా’గా విపరీతంగా ప్రచారం చేయడం. మోడీ ఒంటరి వాడు. ఎలాంటి కుటుంబ సంబంధాలు లేని మోడీకి అవినీతికి పాల్పడాల్సిన అవసరమేముంది? అంటూ ఊదరకొట్టడం. మరోవైపు, కోటి ఉద్యోగాలు, ‘మేకిన్‌ ఇండియా అంటూ యువతను, నిరుద్యోగులను భ్రమల్లో ముంచడం. మోడీ రెండవసారి ప్రధాని అయిన తరువాత సంఫ్‌ుకు రెండు ముఖాలు, రెండు నాల్కలూ అవసరం లేకుండా పోయింది. సంపూర్ణ మెజారిటీ తన చేజిక్కింది. దేశంలో ప్రతిపక్షం బాగా బలహీనపడింది. ఇదే సరైన సమయం. అందుకే తన అసలు ఎజెండాను అమలు చేసేందుకు పూనుకుంది. ఇందులో భాగమే కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370, 35(ఎ) రద్దు, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ స్వాధీనం, ఒక దేశం ఒకేసారి ఎలక్షన్‌, ఒక దేశం ఒక భాష, రిజర్వేషన్ల సమీక్ష, పెట్టుబడిదారులకు దేశ సంపదను బహిరంగంగా ప్రభుత్వ నిర్ణయాల ద్వారా దోచి పెట్టడం చేస్తూ ఉంది. ప్రతి ప్రభుత్వ నిర్ణయం వెనుక ఉన్న నిర్ణయాత్మక శక్తి సంఫ్‌ుపరివార్‌. పైకి కనిపించే ప్రధాని, మంత్రులు తదితరులు అంతా నటులు మాత్రమే. డైరెక్టర్‌ సంఫ్‌ుపరివార్‌. దాని అధినేత మోహన్‌ భగవత్‌. బీజేపీ ప్రభుత్వంలో భగవత్‌ మాటే ఫైనల్‌. అయితే ఇదంతా బయటకు కనిపించదు. కానీ పైకి ఎన్ని మాటలు చెప్పి, ఎన్ని నినాదాలు ఇచ్చినా, పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనాలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం సాగిపోతూ ఉంటుంది. అందుకే, మనం బీజేపీని అర్థం చేసుకోవాలంటే ఆర్‌ఎస్‌ఎస్‌ను అర్థం చేసుకోవాలి. దాని సిద్ధాంతాలను, లక్ష్యాలను స్పష్టంగా తెలుసుకోవాలి. అప్పుడు మనకు కేంద్ర పాలకులు, బీజేపీ నాయకులు పైకి ఏమి మాట్లాడినా వారి ఆచరణ అంతా ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యాన్ని సాధించేందు కోసమేనని అర్థమవుతుంది. బీజేపీ అసలు రూపు కండ్లకు కడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సంఫ్‌ు ప్రజలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలూ తీసుకోదు. కానీ ప్రధాని సంఫ్‌ు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాడు. ఆ ఆదేశాల అమలుకు తన అధికారాలను ఉపయోగిస్తాడు.
సంఫ్‌ు లక్ష్యానికి ప్రజాస్వామ్యానికీ చుక్కెదురు. సంఫ్‌ు లక్ష్యం నేరవేరాలంటే తక్షణం ప్రజాస్వామ్య భావన నుంచి దేశం బయట పడాలి. అది జరగాలంటే పార్టీ ఆధారిత ప్రభుత్వం కాకుండా వ్యక్తి ఆధారిత ప్రభుత్వం. పార్టీ ఆధారిత ప్రభుత్వం ఉంటే ఇతర పార్టీలూ ఉనికిలో ఉంటాయి. ఇతర పార్టీలు ఉనికిలో ఉంటే ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యతలూ ఉంటాయి. అవి తమ మార్గంలో పల్లేరులు అవుతాయి.
వ్యక్తి ఆధారిత ప్రభుత్వాన్ని అంటే నియంత రాజ్యాన్ని రూపొందించే ప్రక్రియ ఇప్పుడు ఊపందుకుంది. ఆ ప్రక్రియలో భాగంగానే గతవారం బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఢిల్లీలో మాట్లాడుతూ ” దేశంలో బహుళ పార్టీ వ్యవస్థ విఫలమైంది” అని సెలవిచ్చారు. అంటే ఏక పార్టీ వ్యవస్థ అనివార్యమని ఆయన చెప్పకనే చెప్పారు. ఈ దేశంలో ఒక్క బీజేపీ తప్ప ఇతర పార్టీల అవసరం లేదని, వాటిని ఎలాగైనా తెరమరుగు చేస్తామని పరోక్షంగా షా హెచ్చరిస్తున్నారు. ఇంకా లోతుకు వెళ్ళి ఆలోచిస్తే ”ఒక దేశం ఒక పార్టీ ఒకే నాయకుడు” అన్నది ఆయన అంతర్గత భావన. ఆ ఒకే నాయకుడు మరెవరో కాదు మోడీ. మోడీని ఒకే నాయకునిగా, అంటే నియంతగా తీర్చిదిద్ది, ఈ దేశంలో ఎన్నికలే లేకుండా చేసి ఈ దేశాన్ని ఒక బహిరంగ జైలుగా మార్చి తమ లక్ష్యాన్ని సాధించాలన్నది సంఫ్‌ు పరివార్‌ సంకల్పం. ఈ సంకల్పం నుంచే ‘ఈ దేశానికి ఇవే చివరి ఎన్నికలు’ అని ఎన్నికల అనంతరం ఒకరిద్దరు బీజేపీ నాయకులు వ్యాఖ్యానించడాన్ని మనం విన్నాం. ఇప్పుడు సాక్షాత్తూ బీజేపీ అధినేత అమిత్‌ షా అంతరంగాన్ని చదివాం.
నిజాలన్నీ నియంతృత్వం వైపే
అడుగులు పడుతున్నాయి అంటున్నాయి
వాస్తవాలన్నీ వచ్చే
ఉపద్రవాన్ని సూచిస్తున్నాయి
మరింకెందుకు ఆలస్యం
సమైక్య పోరుకు సిద్ధమవుదాం
చనిపోబోతున్న ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం!

సెల్‌: 6301289321

Leave a Reply