అత్యంత పేదలున్న దేశం భారత్!

0
263

జి. తిరుపతయ్య

భారత్‌లో పేదరికం అత్యధికమే కాదు అతి సున్నితమైనది, సహజ విపత్తులకు త్వరగా ప్రభావితమయ్యేది కూడా. కరోనా వైరస్‌ కబంద హస్తాల్లో చిక్కుకున్న భారత జాతిని ఉద్దేశించి, జూన్‌ 7న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ… దేశంలోని 80కోట్ల మందికి వచ్చే దీపావళి అనగా నవంబర్‌ వరకు ”ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజనా” పథకం ద్వారా ప్రతి నెల 5కిలోల చొప్పున రేషన్‌ పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే ఈ ప్రకటన ద్వారా ప్రధానమంత్రి స్వయంగా దేశంలో 80కోట్ల మంది పేదలు ఉన్నట్టు అంగీకరించినట్టే కాక 65శాతం జనాబా రేషన్‌ సప్లయి కోసం ఎదురు చూసే కడు పేదలన్నది అందరూ గమనించాల్సిన అంశం. మిగతా జనాబా అంతా ధనవంతుల జాబితాలోకి వస్తారని కాదు, వివిధ కారణాల వల్ల ప్రజా పంపిణీ వ్యవస్థలో లేరంతే! ఈ సహాయం సరిపోతుందా లేదా అన్నది వేరే మాట, అయినప్పటికీ ఈ అడుగు ఆహ్వానించదగిందే. కొరోనా విజృంభన రిత్యా ఏర్పడిన ఉపాధి కొరత కారణంగా ఈ రేషన్‌ పంపిణీ అవసరం ఏర్పడిందన్నది కేంద్రం అభిమతం. అయితే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అనేక రాష్ట్రాలు తక్కువ ధరలకు రేషన్‌ పంపిణీలో నిత్యవసర సామాగ్రిని అందిస్తున్నప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో తిండి గింజలకు అల్లాడే ప్రజలు ఉండటం పరిపాలనా లోపం కాదా? కేంద్రమిచ్చే ఈ ఉచిత రేషన్‌ ఎవరి దాయాదాక్షిణ్యాలూ కావు. ప్రత్యక్ష పన్నుల శాతాన్ని తగ్గించి పరోక్ష పన్నులను పెంచినప్పుడే పేదలు మరింత పేదలవుతారనే ఎకనామిక్స్‌ మామూలే. ఎందుకంటే పరోక్ష పన్నులు చెల్లించేది సంఖ్యా పరంగా అత్యధికులు పేదలేగా.

వాస్తవాన్ని ఒప్పుకోకపోవడం వారి నైజం
భారతీయ జనతా పార్టీ క్యాడర్‌, లీడర్లు ఎప్పుడూ పేదరికాన్ని, ఓటమిని, వెనుకబాటుతనాన్ని అంగీకరించరు. అలా ఒప్పుకోవటం వారికి నామోషీగా భావిస్తారు. అది వారి భూటకపు ప్రతిష్ట (ఫాల్స్‌ ప్రిస్టేజ్‌)కి ఉదాహరణ. గతంలోనూ వాజ్‌పేయి నేతృత్వంలో ఐదేండ్ల పరిపాలన తర్వాత, స్వతంత్ర భారతదేశం మొత్తం సస్యశ్యామలంగా మారి పోయినంతగా పిక్చర్‌ ఇస్తూ, 2004లో ”షైనింగ్‌ ఇండియా” అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లి బొక్క బోర్లా పడ్డారు. గత సంవత్సరం గాల్వాన్‌ వ్యాలీలో చైనా సైనికులతో భారత్‌ సైనికులు తలపడి 20మంది ప్రాణాలు కోల్పోవడం మనకు తెలుసు. నోట్లరద్దు సందర్భంగా అనేకమంది ఇబ్బంది పడ్డారని, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలన్నీ కొంతకాలం మూతపడడంతో ఉపాధి లేక కూలీలు ఇబ్బంది పడ్డారని, నగదు అందుబాటులో లేక ఓ ఆరు నెలల పాటు అనేక రకాల కష్టనష్టాలు సామాన్య ప్రజలు ఎదుర్కొన్నారని ఎన్ని సంస్థలు రిపోర్టులను ఇచ్చినా కేంద్రం ఇప్పటికీ అంగీకరించడం లేదు. ఒక ప్రణాళిక లేకుండా హడావిడిగా ప్రవేశపెట్టిన గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ (జీఎస్‌టీ) విషయంలోనూ తలెత్తిన ఇబ్బందుల వల్ల వ్యాపారులే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక నష్టాలను ఎదుర్కొన్నా అట్టి వాటిని అంగీకరించడానికి, సరి చేయడానికి కేంద్రం సిద్ధంగా లేదు. కరోనా మహమ్మారి మొదటి వేవ్‌ సందర్భంగా గత సంవత్సరం మార్చిలో ప్రకటించిన ఆకస్మిక లాక్‌డౌన్‌ వల్ల దాదాపు 20కోట్ల మంది ఉన్నపళంగా ఉపాధి లేక నిరాశ్రయులై, రవాణా సౌకర్యాలు లేక కాలినడకన వేల కిలోమీటర్లు నడిచి వెళుతూ అనేక మంది ప్రాణాలు కోల్పోయిన వాస్తవాన్నీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. ప్రస్తుత సంవత్సరం ప్రజలందరినీ భయబ్రాంతులకు గురి చేస్తున్న కొరోనా రెండవ వేవ్‌లోను బయటపడిన లోటుపాట్లను అంగీకరించడానికి కూడా కేంద్రం ముందుకు రాలేదు. ముఖ్యంగా రెండవ వేవ్‌ సందర్భంగా జరిగిన మరణాల్లో ఆక్సిజన్‌ కొరత వల్లనే అనేకులు చనిపోయారు. ఆక్సిజన్‌ ట్యాంకులు పేలి ఆసుపత్రుల ఐసీయూల్లో చికిత్స పొందుతున్న రోగులు చనిపోయే దుస్థితికి ఈ నిర్లక్ష్యమే కారణం. టీకాలు అందించడానికి విఫలమై ప్రయివేటు ఆస్పత్రులు అధిక ధరలకు టీకాలను పంపిణీ చేసేలా వెసులుబాటు కల్పించింది. విపరీతమైన వ్యతిరేకత వచ్చిన తర్వాత, సుప్రీం కోర్టు చీవాట్లకు మేల్కొని టీకాను ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంలోనూ తమ తప్పును ఒప్పుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాల చేతగానితనం వల్ల కేంద్రమే ఉచితంగా పంపిణీ చేస్తుందని ప్రకటించడం లోనే వారి ఆంతర్యం తెలుస్తున్నది. కరోనా మొదటి వేవ్‌ సందర్భంలో జరిగిన నష్టానికి గానూ జీడీపీలో 24శాతం నెగటివ్‌ వృద్ధి కనిపించింది. ఈ సంవత్సరం లాక్‌డౌన్‌ ఎత్తి వేయకముందే జీడీపీ 7.93శాతం నెగెటివ్‌ గ్రోత్‌ కనబరిచింది. అయినప్పటికీ కేంద్రం ఈ గణాంకాలను లెక్కపెట్టకుండా దేశం ఆర్థిక అభివృద్ధిలో ఏమాత్రం తగ్గడం లేదని ప్రకటనలు చేస్తుండడం గర్హనీయం.

విధానపరమైన లోపాలు
డెబ్బై ఏండ్ల స్వతంత్ర భారతదేశ పాలనలో తాత్కాలిక ఉపశమనాలకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, జరుగుతూనే ఉన్నది. అందుకే సమాజంలో నెలకొని ఉన్న అసమానతలు అలాగే కొనసాగడానికి ఈ తరహా పాలననే ప్రధాన కారణం. ఇలాంటి విధానాలతో ఇంకా ఎన్ని దశాబ్దాలు గడిచినా భారతదేశం నుంచి పేదరికాన్ని తరిమివేయడం అసాధ్యంగా కనిపిస్తున్నది. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 1970వ దశకం లోనే గరీబీ హటావో అనే నినాదాన్ని ఇచ్చారు. ఇప్పటికీ దేశంలో ఇంత మంది పేదలు ఉన్నారు అంటే ఏం జరుగుతున్నట్టు? ప్రతి పూరి గుడిసెకూ కరెంటు అనే నినాదాన్ని ఇచ్చారు. అయినప్పటికీ కరెంటులేని గ్రామాలిప్పటికీ చీకట్లోనే ఉన్నాయి. పాలకులు వీటిని చూడటానికి ఇంకెప్పుడు వెలుగు కళ్ళద్దాలు దరిస్తారు? ప్రధాన మంత్రి గ్రామ సడక్‌ యోజన అంటూ మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలోనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశమంతా రహదారులున్నాయా మరీ? బాలింతలనూ, వృద్దాప్యపు రోగులనూ డోలెల మీద, కావడి మీదా ఇద్దరో, నలుగురో కలిసి కాలువలూ బురదలూ దాటుకుంటూ ఆసుపత్రులకు తరలించటాలను వార్తా పత్రికలు మోస్తూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఇదే సమయంలో తలపెట్టిన ఇంటింటికీ మరుగుదోడ్ల నిర్మాణం కార్యక్రమం తరువాతి పాలనలో స్వచ్ఛభారత్‌ అభియాన్‌లో భాగమైంది. మరి మరుగుదొడ్ల నిర్మాణం, డ్రైనేజీ విధానం దేశమంతటా విస్తరించినట్లేనా? బాలింత మరణాలూ, శిశు మరణాలకు కారణమవుతున్న ఈ అపరిశుభ్ర పరిసరాలను తరిమేసినట్లేనా? నెహ్రూ కాలంలోనే నిర్భందోచిత విద్యను ప్రారంభించారు, 2006లో విద్యను ప్రాథమిక హక్కుల్లో చేర్చారు. అయినప్పటికీ ప్లాటినమ్‌ జుబిలీ సంబరాలకు సిద్దమవుతున్న స్వతంత్ర భారత్‌ అక్షరాస్యతలో ప్లాటినం(75) శాతాన్ని దాటడం లేదు! ఎందుకంటారు? పథకాలను ప్రకటించి, ప్రారంభించి ఫలితాలను గాలికొదిలేసిన వీరందరికీ జవాబుదారి తనం ఎలా? కరోనా కాటేసిన ఉపాధి డోలాయమానం ఎప్పటికి స్థిరపడుతుందో గానీ మరింత మంది పేదరికంలోకి నెట్టబడటం ఖాయం. అధికారాన్ని ఆశించే ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల సందర్భంగా తమ మేనిఫెస్టోలో చేర్చుకుంటున్న అంశాల్లో ప్రధానంగా కనిపించేవి పేదరికాన్ని నిర్మూలిస్తామని, పేదలకు ఇళ్లు కట్టిస్తామని, అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామనేవి. లక్షల కొద్దీ ఇండ్లు కట్టిస్తున్నట్లు, వాటికి శంకుస్థాపనలు చేస్తున్నట్లు, కొన్నిచోట్ల నూతన గృహాలు ప్రారంభిస్తున్నట్లు అప్పుడప్పుడు పత్రికల్లో ఫొటోలు ప్రచురితం అవుతూ ఉంటాయి. అయినప్పటికీ ఇంకా పేదలకు ఇళ్లు కట్టించాల్సిన అవసరం ఎందుకు తీరడం లేదు? దీనికి శాశ్వత పరిష్కారం లేదా? కనీసం ఈ తాత్కాలిక ఉప శమనాల్లో నైనా నాణ్యత, పారదర్శకతా పాటించ లేరా? ఇక శాశ్వత పరిష్కారం దిశలో ఆలోచించి నప్పుడు పౌరులను స్వయం సమృద్ధి గల స్థితికి చేర్చాలి. శాశ్వత, స్థిరమైన ఉపాధి ద్వారానే ఇది సాధ్యం. కానీ, అజీమ్‌ ప్రేమ్జీ యూనివర్సిటీ రిపోర్టు ప్రకారం మన దేశంలో శాశ్వత ప్రాతిపదికన ఉపాధి గలవారు 9.7శాతం మాత్రమే. రోజువారి వేతనాల పై ఆధారపడ్డ వారు 27శాతం, వీరి సగటు నెలసరి ఆదాయం రూ.7,965 మాత్రమే. స్వయం ఉపాధిపై ఆధారపడ్డ వారు 52శాతం మంది. వీరి నెలసరి సగటు ఆదాయం రూ.12,955 మాత్రమే. అధిక జనాభా, సహజ వనరుల కొరత ఉన్న ఏ దేశంలో నైనా విధాన పరమైన నిర్ణయాలు శాశ్వత ప్రాతి పదికన ఉంటేనే అసమానతలు తగ్గి పేదరికపు తగ్గు ముఖం ప్రారంభమౌతుంది.

Courtesy Nava Telangana

Leave a Reply