ఆదుకునేవారు అన్నదాతలే

0
706

ఉత్తర భారతం నుంచి వస్తున్న వార్తలను పరిశీలిస్తే లాక్‌డౌన్ పరిస్థితి తెలుస్తోంది. లాక్‌డౌన్‌లో వ్యూహాత్మకమైన తప్పిదాలు తెలిసి వస్తున్నాయి. భారతదేశానికి అతిపెద్ద ఆర్థిక వనరు అయిన వ్యవసాయాన్ని ఈ సంక్షోభ సమయంలో భారత దేశానికి అతిపెద్ద భారంగా మార్చేస్తారా అనిపిస్తోంది. ప్రస్తుతం కరోనా సంక్షోభంలో భారతదేశానికి అతిపెద్ద బలం ఇక్కడి వ్యవసాయ రంగమే. కరోనా వ్యాధి ప్రారంభ దశలో గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాధి లేదు. పట్టణ ప్రాంతాల్లో జనసమ్మర్థం ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా జీవనం భౌతిక దూరాన్ని పాటించడానికి అనువైనది. వ్యవసాయ పనుల్లో భౌతిక దూరం పాటించడం చాలా తేలిక. నిజానికి ఫ్యాక్టరీల్లో ఈ అవకాశం ఉండదు. కాని వ్యవసాయ పనుల్లో దూర దూరంగా ఉండి పని చేయడమే కనిపిస్తుంది. వ్యవసాయ మార్కెట్లలో కూడా విస్తీర్ణం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కరోనా సంక్షోభ సమయంలో కూడా ఎలాంటి ప్రమాదమూ లేకుండా కొనసాగే ఆర్థిక కార్యక్రమం వ్యవసాయం.

లాక్‌డౌన్ కాలంలో కూడా వ్యవసాయ కార్యకలాపాలను కొనసాగించవచ్చు. నిజానికి లాక్‌డౌన్ నియమ నిబంధనలు ఇలాంటి అనుమతి ఏదీ వ్యవసాయ రంగానికి ఇవ్వలేదు. అయినా రైతులు తమ పొలం పనులు ఎలాగోలా చేసుకున్నారు. ఈ సంక్షోభ సమయంలో ఈ సంవత్సరం వ్యవసాయరంగం ఆశాదీపంలా కనిపిస్తోంది. అదృష్టమేమంటే, మనం ఆహార భద్రత సాధించిన కాలంలో ఈ కరోనా వచ్చింది. ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా వద్ద ఇప్పుడు 87 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల నిల్వఉంది. అంటే ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్క సభ్యుడికి వంద కేజీల ధాన్యం బస్తా లేదా గోధుమల బస్తా ఇవ్వవచ్చు. ఈ సంవత్సరం గోధుమల కొనుగోలు ముగిసే సరికి మరో 25 నుంచి 30 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు గోదాముల్లోకి వస్తాయి.ఈ సీజనులో రబీ పంట గొప్ప ఫలసాయాన్నిచ్చింది. గత సంవత్సరం రుతు పవనానంతర వర్షాలు బాగా కురిశాయి. కాబట్టి గోధుమలు, శనగలు, మసూర్ దాల్ వగైరా నిల్వలు పెరిగే అవకాశం ఉంది. అలాగే కూరగాయల పంటలు, పాడి కూడా పుష్కలంగా లభిస్తున్నాయి. ఈ సంవత్సరం రుతుపవనాలు కూడా సమయానికి వస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. కాబట్టి అంతర్జాతీయ వాణిజ్యం లేకపోయినా సరే కొన్ని నెలల పాటు భారతదేశం ఈ సంక్షోభాన్ని తట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

ఈ సంక్షోభంలో మనకు ఆహార సార్వభౌమాధికారం ఎంత ముఖ్యమైనదో తెలియవచ్చింది. ఈ విషయాన్ని నిజానికి మనం గుర్తించ లేదు. రైతులకు ధన్యవాదాలు చెప్పవలసిన సమయం ఇది. వారి కష్టం మనం గుర్తించకపోయినా వారు నేడు ఆదుకుంటున్నారు.వారికి ధన్యవాదాలు చెప్పడానికి మీరు చప్పట్లు కొట్టడం, పళ్ళాలు, పాత్రలు మోగించడం చేయవలసిన అవసరం లేదు. వారికి గిట్టుబాటు ధర దొరికేలా చేస్తే చాలు. ఆర్ధిక వ్యవస్థ మళ్ళీ నిలదొక్కుకోవాలంటే రైతులకు గిట్టుబాటు ధరను ఇవ్వడం ఎంతో అవసరం. ఎందుకంటే, రైతుల చేతికి డబ్బువస్తే వారు పొదుపు చేసి దాన్ని దాచుకోరు. సాధారణంగా సగటు పట్టణ నివాసి ఖర్చుపెట్టే కన్నా ఎక్కువ శాతం తమ సంపాదన నుంచి రైతులు ఖర్చు చేస్తారు. ఆర్థిక వ్యవస్థ చక్రాలు మళ్ళీ గాటన పడతాయి. కాని ఈ వాస్తవాలు మన విధాన నిర్ణేతలు గుర్తించినట్లు కనబడడం లేదు. ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాటన పెట్టాలంటే రైతులకు సహాయం అందించాలి. కాని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు అనవసరపు, అర్థంలేని ఇబ్బందులు సృష్టిస్తోంది. గ్రామీణ భారతం అంటే ఒక డస్ట్ బిన్ మాదిరిగా, తమ నెత్తిన మోస్తున్న భారం మాదిరిగా చూసే అలవాటు ఇది.

ఈ ప్రభుత్వం ప్రాధాన్యతల్లో రైతులు చిట్టచివరిన ఉన్నారు. మార్చి 24వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ లాక్‌డౌన్ కోతల కాలంలో వచ్చిందని, ఆహార ధాన్యాల మార్కెటింగ్ కాలంలో వచ్చిందనే విషయాన్ని ఆయన ప్రస్తావించనే లేదు. ఈ విషయం గురించి ఆయన ఏప్రిల్ 14న ప్రసంగంలో చెప్పారు. మొదటి విడత లాక్‌డౌన్‌లో ఈ అత్యావసర వస్తు సేవలకు సంబంధించి ఎలాంటి మినహాయింపులు లేవు. స్టాక్ మార్కెట్లకు మినహాయింపు ఇచ్చారు కాని వ్యవసాయ రంగానికి మినహాయింపు ఇవ్వలేదు. అయితే మార్చి 27వ తేదీన జారీ చేసిన కొన్ని మార్గదర్శక సూత్రల్లో వీటిలో కొన్నింటిని సరిచేశారు. కాని అప్పటికే జరగవలసిన నష్టం జరిగింది. ఉత్పత్తుల్లో కుళ్ళిపోయేవి ఉంటాయి. కూరగాయలు, పండ్లు, కోడిగుడ్లు, కోడి మాంసం, పాలు వగైరా. ఇవి మార్కెటుకు రాకుండా హఠాత్తుగా అడ్డుకున్నారు. ఫలితంగా రైతులు భారీగా నష్టపోయారు.

కరోనా వైరస్‌కు కోడి మాంసానికి సంబంధం కలుపుతూ ఫేక్ వార్తలు ప్రచారంలోకి రావడం వల్ల కోళ్ళ పెంపకం పరిశ్రమ అప్పటికే భారీ నష్టాల్లో ఉంది. ఆ తర్వాత వచ్చిన లాక్‌డౌన్ కోళ్ళ పరిశ్రమ నడుం విరగ్గొట్టింది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాపై ఆంక్షలను కాగితాలపై తొలగించినా ఆచరణలో ఇది అమలు కాలేదు. చాలా కఠినంగా లాక్‌డౌను అమలుచేశారు. కూరగాయలు, ఆహార ధాన్యాల మార్కెట్లు మూతపడే ఉండిపోయాయి. ఫలితంగా ద్రాక్ష, క్యాబేజి వంటి పంటలను రైతులు ఆగ్రహంగా ధ్వంసం చేసిన వార్తలు, పాలను కాల్వల్లో పారబోసిన వార్తలు వచ్చాయి. మరో వైపు ఎరువులు, క్రిమి సంహారక మందుల దుకాణాలు మూతపడ్డాయి. అందువల్ల రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించే అవకాశం లేకుండా పోయింది.

రాష్ట్రాల మధ్య సరిహద్దులను మూసేయడం వల్ల మధ్యప్రదేశ్ నుంచి హర్యానా పంజాబ్ వరకు రైతులు మార్గమధ్యంలోనే చిక్కుకుపోయారు. ఫలితంగా ఈ పరిస్థితి కూలీలపై ఆధారపడడాన్ని మరింత ఎక్కువ చేసింది. మరోవైపు కూలీలు దొరకని పరిస్థితి. రైతులు ఏదో ఒక విధంగా కోతలు ముగించినా, మార్కెటుకు తరలించడం పెద్ద సవాలుగా మారింది. ఏప్రిల్ 14 వరకు గోధుమల కొనుగోలు ప్రారంభం కాలేదు. చాలా మంది రైతులు ఇన్ని రోజులు వేచి ఉండే పరిస్థితిలో లేరు. హడావిడిగా అమ్మకాలు ముగించేశారు. స్థానిక వ్యాపారులకు అమ్మేశారు. గిట్టుబాటు ధర కన్నా చాలా తక్కువ ధరకు అమ్మేశారు. కాగా హర్యానాలో వ్యాపారుల సమ్మె వల్ల ప్రభుత్వ కొనుగోళ్ళు దెబ్బతిన్నాయి. పంజాబ్‌లో గాలివాన దెబ్బ తీసింది. చాలా రాష్ట్రాల్లో రైతుల నుంచి కొనుగోళ్ళకు సరైన పథకాలను ప్రభుత్వాలు ప్రవేశపెట్టలేదు. ఈ సారి పంట అద్భుతంగా ఉంటుందని ఆశించిన రైతులకు ఈ పరిస్థితులు ఆశాభంగంగా మారాయి. కాని ఈ వాస్తవాలను విధాన నిర్ణేతలు పట్టించుకోవడమే లేదు.

ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అనేక రంగాలకు అనేక పథకాలు ప్రకటించారు, కాని వ్యవసాయ రంగానికి శూన్యహస్తాలే చూపించారు. ఆ తర్వాత కిసాన్ సమ్మాన్ నిధి ప్రకటించారు. లాక్‌డౌన్ వల్ల ప్రజలకు ఎదురైన ఇబ్బందులకు ఊరటగా మోడీ ప్రభుత్వం మరికొన్ని పథకాలు ప్రకటించవచ్చు. ఈ సందర్భంగా రైతులను ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. కూరగాయలు, పండ్లు పండించే రైతులు, పాల ఉత్పత్తిదారులు, పౌల్ట్రీ రైతులకు ఎదురైన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని జాతీయ విపత్తు నిధి నుంచి వారికి నష్ట పరిహారం చెల్లించాలి. ప్రస్తుతం ఉన్న నష్ట పరిహారాన్ని మరోసారి సమీక్షించాలి. రైతుల సంక్షేమానికి వెంటనే చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. భారత దేశానికి వెన్నెముక లాంటిది వ్యవసాయ రంగం. సరైన చర్యలతో వ్యవసాయ రంగాన్ని ఆదుకోకపోతే పరిస్థితి వ్యవసాయ రంగం కూడా భారంగా మారిపోయే ప్రమాదముంది.

Courtesy Manatelangana

Leave a Reply