అంతా అనుకున్నట్టుగానే..

0
257

అనుకున్నదే జరిగింది. అందరూ అనుకుంటున్నట్టుగానే దేశంలో లాక్‌డౌన్‌ పొడిగించారు.

న్యూఢిల్లీ : మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మంగళవారం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశారు. నేడు బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను ప్రధాని మోదీ స్మరించుకున్నారు. కరోనా వైరస్‌ బారి నుంచి దేశాన్ని రక్షించుకునేందుకు ఐక్యత చాటడమే అంబేద్కర్‌ మనం ఇచ్చే గొప్ప నివాళి అని మోదీ పేర్కొన్నారు.

కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఏప్రిల్‌ 20వరకు కఠిన ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. 20 తర్వాత పరిస్థితులను బట్టి ఆంక్షల సడలింపు ఉండొచ్చని వెల్లడించారు. కరోనా రెడ్‌జోన్‌ కానీ ప్రాంతాల్లో షరతులతో కూడిన సడలింపు ఉంటుందని తెలిపారు. లాక్‌డౌన్‌కు సంబంధించి పూర్తి మార్గదర్శకాలు బుధవారం(ఏప్రిల్‌ 15) విడుదల చేస్తామన్నారు. రబీ సీజన్‌ పంటల కోత సమయం కాబట్టి రైతులను ఆదుకునేలా చర్యలు చేపడతామన్నారు. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పుకొచ్చారు. దేశ ప్రజల త్యాగం వల్లే భారత్‌లో కోవిడ్‌ వ్యాప్తి తక్కువగా ఉందన్నారు.

కరోనా కట్టడికి ఏడు సూత్రాలు పాటించాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ సూచించారు.
1. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలి
2. అందరూ మాస్క్‌ ధరించి, భౌతికదూరం పాటించాలి.
3. ప్రతి ఒక్కరు రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి.
4. ఆరోగ్య సేతు యాప్‌తో కరోనా సమాచారం తెలుసుకోవాలి
5. నిరు పేదలకు, అన్నార్తులకు ఆహారాన్ని అందించాలి.
6. ఏ ఒక్క ఉద్యోగిని కూడా తొలగించవద్దు.
7. పోలీసులు, వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి గౌరవం ఇవ్వాలి.

Leave a Reply