‘హెచ్‌సిక్యూ’పై దిగివచ్చిన భారత్‌

0
254

న్యూఢిల్లీ: మలేరియా నివారణ ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్ (హెచ్‌సిక్యూ) ఎగుమతిపై ఇంతకుముందు విధించిన నిషేధాన్ని తొలగించినట్టు భారత ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. దీనిని ఇప్పుడు కోవిడ్ -19 నివారణకు వాడుతున్నారు. కరోనాతో కుదేలయిన అమెరికా హైడ్రాక్సీక్లోరోక్విన్ కోసం భారత్‌ను సంప్రదించింది. క్లోరోక్విన్ సరఫరా చేయబోమని మొదట్లో చెప్పిన భారత్‌ తర్వాత వాషింగ్టన్‌ ఒత్తడితో నిషేధాన్ని ఎత్తివేయ​డంతో వివాదం రేగింది.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మానవతా దృక్పథంతో మన పొరుగు దేశాలన్నింటికీ తగిన పరిమాణంలో పారాసెటమాల్,హెచ్‌సిక్యూలను సరఫరా చేయనున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ తెలిపారు. కోవిడ్‌-19తో తీవ్రంగా ప్రభావితమైన కొన్ని దేశాలకు ఈ ముఖ్యమైన మందులను సరఫరా చేస్తామన్నారు.

ప్రభుత్వం మార్చి 25న వెలువరించిన నోటిఫికేషన్‌లో హెచ్‌సిక్యూని పరిమిత వస్తువుల జాబితాలో ఉంచింది. ఏప్రిల్ 4న ఎగుమతులపై నిషేధం విధించింది. తాజాగా నిషేధం ఎత్తివేస్తూ ఏప్రిల్ 6న జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నది. గత నోటిఫికేషన్‌ను సమర్థవంతంగా తారుమారు చేసింది.

ముందుగా ఆర్డర్‌ ఇచ్చిన అమెరికా, బబ్రెజిల్‌, యూరోపియన్‌ దేశాలకు ఔషధాలను సరఫరా చేస్తామని భారత విదేశాంగ తెలిపింది. దేశీయ డిమాండ్‌కు అనుగుణంగా మనకు సరిపడా నిల్వలు ఉంచుకుని మిగతా స్టాక్‌ను ఎగుమతి చేయనున్నట్టు వెల్లడించింది. దీనిపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేసింది. గత కొన్ని రోజులలో రెండు డజనుకు పైగా దేశాలు హెచ్‌సిక్యూని అత్యున్నత స్థాయిలో సరఫరా చేయమని అభ్యర్థించాయని అధికారులు తెలిపారు. అయితే అమెరికా, బ్రెజిల్ దేశాలు తమ ఆర్డర్‌లపై ముందస్తు చెల్లింపులు చేశాయన్నారు.

తమకు హెచ్‌సిక్యూ సరఫరా చేయకుంటే భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే అమెరికాకు అనుకూలంగా భారత్‌ విదేశాంగ ప్రకటన చేయడం గమనార్హం. హెచ్‌సిక్యూ ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నామని, మన దేశానికి సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రకటించింది. కరోనాను హెచ్‌సిక్యూ నివారిస్తుందనేది ప్రయోగపూర్వకంగా నిరూపితం కానప్పటికీ దీన్ని ‘గేమ్‌ చేంజర్‌’గా ట్రంప్‌ పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీన్ని వైద్య సిబ్బంది ప్రివేంటివ్‌ మెడిసిన్‌ వాడతారని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ తెలిపింది. కాగా, అమెరికా, ఇతర దేశాల ఒత్తిడి కారణంగా హెచ్‌సిక్యూ ఎగుమతులపై నిషేధం తొలగించామన్న విమర్శలను భారత విదేశాంగ తోసిపుచ్చింది.

Leave a Reply