దిగజారుతున్న..ఆర్థికం

0
268
దిగజారుతున్న..ఆర్థికం

రూ.2 లక్షల కోట్లమేర తగ్గనున్న ఆదాయం
– 7.3 శాతానికి నిరుద్యోగిత, పట్టణాల్లో 9.3 శాతానికి చేరిక
ఆరేండ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం

న్యూఢిల్లీ: మొదటి ఐదేండ్ల పాలనలో భారత ఆర్థిక వ్యవస్థను అధ:పాతాళానికి నెట్టిన మోడీ సర్కార్‌… రెండో దఫా అధికారం చేపట్టిన తర్వాతనైనా గత తప్పిదాలులాంటివి పునరావృతం కాకుండా ఎంతో కొంత జాగ్రత్త పడుతుందని అంతా ఆశించారు. కానీ, 2019లో తిరిగి అధికారం చేపట్టిన తర్వాత తొలి(మధ్యంతర) బడ్జెట్‌లోనే కార్పొరేట్లకు పన్ను మినహాయింపులిచ్చింది. ఆ ఒక్క నిర్ణయంతోనే దేశ ఖజానాకు రూ.లక్షా 45 వేల కోట్ల నష్టమని ఆర్థికవేత్తలు లెక్కలు వేసి చెప్పారు. అదే నిజమని తాజా బడ్జెట్‌కు ముందు ఇటీవల లీకైన ఆర్థికశాఖ అంచనాల్లో స్పష్టమైంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి అంచనాకన్నా రూ.2 లక్షల కోట్లమేర ఆదాయం తగ్గనున్నట్టు తేలింది.

ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థకు సూచీలుగా భావించే పలు అంశాల్లో తాజాగా వెల్లడైన గణాంకాలు నిరాశపరిచేలా ఉన్నాయి. దేశ ఎగుమతులు వరుసగా ఆరు నెలలు, దిగుమతులు వరుసగా పది నెలలు తగ్గుతూ వచ్చాయి. దీంతో, వాణిజ్య లోటు మరింత పెరిగింది. బ్యాంకింగ్‌ వ్యవస్థ పరపతి 2019 జనవరిలో 14.8 శాతం ఉండగా, 2020 జనవరిలో 7.1 శాతానికి దిగజారింది. మరోవైపు ప్రజల వినియోగ సామర్థ్యం తగ్గింది. పారిశ్రామిక ఉత్పత్తులు మందగించాయి. దాంతో, నూతన ఉద్యోగాల కల్పన సన్నగిల్లింది. నిరుద్యోగిత పెరిగింది. భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ కేంద్రం(సీఎంఐఈ) ఫిబ్రవరి 14న విడుదల చేసిన వారాంతపు నివేదిక ప్రకారం నిరుద్యోగిత 7.3 శాతానికి చేరింది. పట్టణాల్లో 9.3 శాతంగా, గ్రామీణ ప్రాంతాల్లో 6.6 శాతంగా నమోదైంది. మొత్తమ్మీద ఏడాది కాలంగా నిరుద్యోగిత 7 నుంచి 8 శాతం మధ్య ఊగిసలాడుతోంది. పట్టణాల్లో 2017 మే నెలలో 4.9 శాతంగా ఉన్న నిరుద్యోగిత ఇప్పుడు 9.3 శాతానికి, గ్రామీణ ప్రాంతాల్లో 3.7 శాతంగా ఉన్నది ఇప్పుడు 6.6 శాతానికి చేరింది. దీంతో, గతంలో బీజేపీకి అనుకూలంగా ఉన్న యువత నేడు పునరాలోచనలో పడ్డట్టుగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అది ప్రతిఫలించిందని, అందుకే పది నెలల క్రితం ఢిల్లీలోని ఏడింటికి ఏడు లోక్‌సభ స్థానాల్లో బీజేపీని గెలిపించిన ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీకి పట్టం కట్టారని వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ మందగమన ప్రభావం ధనికవర్గాలకన్నా పేద, మధ్య తరగతి వర్గాలపై తీవ్రంగా ఉన్నది. ఉపాధి, ఉద్యోగావకాశాలు కోల్పోవడంతో సగటు ఆదాయాలు బాగా తగ్గిపోయాయి. దాంతో,కొనుగోలు శక్తి తగ్గిపోయింది. మరోవైపు ఉత్పత్తులు పడిపోవడంతో ద్రవ్యోల్బణం ఆరేండ్ల గరిష్టానికి చేరింది. ఆహార పదార్థాల రేట్లు మునుపెన్నడూ లేనిరీతిలో పెరిగాయి. 2019 ఫిబ్రవరిలో సాధారణ ద్రవ్యోల్బణం 2.57 శాతముండగా, 2020 జనవరిలో 7.59 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం మైనస్‌ 0.07 నుంచి ప్లస్‌ 11.79 శాతానికి పెరిగింది. అంటే ఏడాదిలో 12 శాతంమేర ఆహార పదార్థాల ధరలు పెరిగాయని అర్థం. పేద, మధ్యతరగతి ప్రజల జీవనోపాధి దెబ్బతింటున్నా మోడీ సర్కార్‌ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కార్పొరేట్లకు లాభాలు చేకూర్చడం కోసం కార్మిక చట్టాలను వారికి అనుకూలంగా మార్చడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం మరిన్ని రాయితీలు ప్రకటించడం ద్వారా సులభతర వాణిజ్యమంటూ పాడిందే పాటగా అదే తీరున ఉదార ఆర్థిక విధానాలను కొనసాగిస్తోంది. తమ సమస్యలపై గళమెత్తే రైతులు, కార్మికులు, నిరుద్యోగులు, విద్యార్థులపై లాఠీలతో బెదిరించి హింసతో అణచివేయాలని చూస్తోంది. మరోవైపు సీఏఏ, ఎన్నార్సీ పేరుతో మత విభజన రాజకీయాలు చేస్తూ అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని చూస్తోంది.

Courtesy Nava Telangana

Leave a Reply