
2019వ సంవత్సరంలో 117 దేశాల కోసం తయారు చేసిన ప్రపంచ ఆకలి సూచిక (గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (జీహెచ్‌ఐ))లో భారతదేశం 102వ స్థానంలో ఉన్నదన్న వార్త దిగ్భ్రాంతిని కలుగజేయకపోగా ఒక పనికిమాలిన చర్చకు దారితీసింది. ఆకలి సమస్య లేని దేశాలను ఈ అధ్యయనంలో భాగం చేయలేదు. ఈ చర్చ ఆశ్చర్యకరంగా రెండు విషయాలకు సంబంధించి సాగింది.
2014లో 55వ స్థానంలో వున్న భారతదేశం 2019 సంవత్సరంకల్లా నాటకీయంగా 102వ స్థానానికి ఎలా దిగజారిందనేది మొదటిది. నీతి ఆయోగ్ క్రియాశీలంగా పని చేసిన స్థితిలో ప్రపంచ ఆకలి సూచిక లోని అంశాలకు సంబంధించిన అంశాల మార్పు దిశ సరైనదేనా అనేది రెండవది.
మొదటి విషయానికి సంబంధించి ఇలా వాదించారు. ప్రపంచ ఆకలి సూచికలో 5 కంటే తక్కువ స్కోర్ కలిగిన దేశాలను (ధనిక దేశాలను మినహాయించిన తరువాత కూడా) కూడా కొన్ని సార్లు ఈ దేశాల పట్టికలో చేర్చటం, కొన్నిసార్లు వేరుగా చూపుతున్నప్పుడు భారతదేశ స్థానం దిగజారటం గురించి ఎటువంటి నిర్ధారణలకూ రాలేం. నిజానికి 2014లో 76 దేశాలలో భారతదేశం 55వ స్థానంలో వుంది. 2015లో 104 దేశాల పట్టికలో ఈ స్థానం 80కి దిగజారింది. 2016లో 118 దేశాల పట్టికలో ఈ స్థానం 97. 2017లో 119 దేశాల పట్టికలో ఈ స్థానం 100. 2018లో 119 దేశాల పట్టికలో ఈ స్థానం 103. 2019లో 117 దేశాల పట్టికలో ఈ స్థానం 102. ‘ఈ పట్టిక లోని సూచిక స్కోర్లు, స్థానాలు గతం లోని నివేదికల, సూచికల స్కోర్ల, స్థానాలతో నిర్దిష్టంగా పోల్చజాలం’ అని ప్రపంచ ఆకలి సూచికల నివేదికలే చెబుతున్నాయి.
ప్రపంచ ఆకలి సూచికలో ఈ దేశాల స్థానం ఏమైనప్పటికీ మార్పు సరియైన దిశ లోనే సాగుతోందని నీతి ఆయోగ్ వాదిస్తోంది. అంటే ఆకలి సూచిక లోని అంతర్భాగాలైన అంశాలలో ప్రతిదీ కాలక్రమంలో మెరుగవుతోందని నీతి ఆయోగ్ అంటున్నది. ఈ వాదన ఒక బూటకం. ప్రపంచ ఆకలి సూచికలో నాలుగు అంశాలున్నాయి. అవేమంటే..పౌష్టికాహార లోపం (జనాభా మొత్తానికి సరైన పౌష్టికాహారం అందకపోవటం), శిశువులు సరైన రీతిలో ఎదగకపోవటం (ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు వారి వయసుకు తగినంత బరువు లేకపోవటం), శిశు మరణాల రేటు (ఐదేళ్ల లోపు శిశువుల మరణాల రేటు). అభివృద్ధి దిశ సక్రమంగానే ఉన్నదని వాదించటానికి సమగ్ర జాతీయ పౌష్టికాహార సర్వే నిర్ధారణలను నీతి ఆయోగ్ ఉపయోగిస్తుంది. సమగ్ర జాతీయ పౌష్టికాహార సర్వే ఒకే ఒక సారి జరుగుతుంది. కాబట్టి అంతకు ముందు మరో సంస్థ చేసిన సర్వేతో ఈ సంస్థ సర్వేని పోల్చి నీతి ఆయోగ్ నిర్ధారణకు వస్తుంది. అయితే ఇలా సరిపోల్చటం ప్రశ్నార్థకం అవుతుంది.
అంతేకాకుండా అది ప్రపంచ ఆకలి సూచిక లోని వివిధ అంశాలన్నింటినీ పరిగణన లోకి తీసుకోదు. ప్రపంచ ఆకలి సూచిక లోని మొదటి అంశం జనాభా మొత్తం తీసుకునే ఆహారానికి (క్యాలరీ ఇన్‌టేక్) సంబంధించినది. అలా ప్రజలు తీసుకునే ఆహారం పరిస్థితి ఎలా వుందనే విషయానికి చెందిన సమాచారం వర్తమానంలో అధికారిక సమాచార వనరులలో అందుబాటులో లేదు. కుటుంబాలు వివిధ వస్తువులను వినిమయం చేయటం పైన ఎలా ఖర్చు చేస్తాయనే విషయం గురించి నేషనల్ శాంపుల్ సర్వే ప్రతి ఐదేళ్లకొకసారి చాలా పెద్ద ఎత్తున సమాచారాన్ని సేకరిస్తుంది. ఆ సమాచారం ఆధారంగా శాంపిల్‌గా తీసుకున్న కుటుంబాల ఆహార వినిమయం ఎంత వుంటుందో లెక్కించటం జరుగుతుంది. అలా ఐదేళ్లకు ఒకసారి జరిగే సర్వేల మధ్య కాలంలో నేషనల్ శాంపిల్ సర్వే తక్కువ సంఖ్యలో కుటుంబాలను తీసుకుని వార్షిక సర్వేలను నిర్వహిస్తుంది. నేషనల్ శాంపిల్ సర్వే ఐదేళ్లకు ఒకసారి నిర్వహించే విస్తృత సర్వేలు ప్రపంచం లోనే అత్యంత విస్తృతమైనవి. భారత ఆర్థిక వ్యవస్థకు చెందిన అనేక పార్శ్వాలను గురించి పరిశోధించేవారికి ఈ సర్వేలు అందించే సమాచారం ప్రధాన డేటా వనరుగా ఉంది. అయితే మనకు ప్రస్తుతం 2011-12 వరకే సమాచారం అందుబాటులో వుంది. అప్పటి నుంచి ప్రజలు తీసుకునే ఆహారం గురించిన నేషనల్ శాంపిల్ సర్వే సమాచారం లేదు. బీజేపీ ప్రభుత్వ పాలనలో నేషనల్ శాంపిల్ సర్వేకి ఏం జరిగిందనేది ఒక నిగూఢ రహస్యంగానే ఉంది. భారత దేశంలో ఆకలికి సంబంధించి సరైన దిశలోనే పయనిస్తున్నామనే నీతి ఆయోగ్ చేస్తున్న వాదన పట్ల దానికి ఏమాత్రం నిజాయితీ వున్నా అసమగ్ర సమాచారం ఆధారంగా భావజాలపరమైన విషయాలను సమర్థించు కునే బదులుగా… ఒక ప్రధాన డేటా వనరుగా వున్న నేషనల్ శాంపిల్ సర్వేని పునరుద్ధరించాలి.
ఇప్పుడు ఈ చర్చలన్నింటినీ పక్కనబెట్టి 2019 ప్రపంచ ఆకలి సూచికను అనుసరించి రెండు నిస్సందేహ నిర్ధారణలకు రాగలుగుతాం. 2019 ప్రపంచ ఆకలి సూచికనుబట్టి చూసినప్పుడు దక్షిణాసియా దేశాలన్నింటిలో కల్లా భారతదేశం అత్యంత నికృష్ట స్థానంలో ఉందనేది మొదటిది. 2010-2019 మధ్య కాలంలో శిశువులలో ‘ఎదుగుదల లోపం’ (ఐదేళ్ల లోపు శిశువులలో సాపేక్షంగా వారి ఎత్తుకు తగినంత బరువు లేని వారి నిష్పత్తి ఆందోళకర స్థాయిలో పెరిగింది. ఇది పౌష్టికాహార లోపానికి ప్రతి బింబం) ఆందోళకర స్థాయిలో పెరగటం రెండవది.
ఈ రెండు నిర్ధారణలకు చాలా ప్రాధాన్యత ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్‌లను అటుంచి… ప్రపంచం లోనే ‘అత్యంత వెనుకబడిన దేశాల’లో ఒకటని ఐక్యరాజ్య సమితి చేత వర్గీకరింపబడిన నేపాల్… ప్రపంచ ఆకలి సూచికలో భారత దేశం కంటే ముందుంది. ఆవిధంగా ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్ కూడా భారతదేశం కంటే ముందుంది. అంతకు ముందు పాకిస్తాన్ కంటే భారతదేశం ముందుండేది. కానీ 2019లో ఈ క్రమం తారుమారైంది.
ఈమధ్య కాలంలో నెలకొన్న మందగమనానికి ముందు తాను ‘ఆవిర్భవిస్తున్న ఆర్థిక అగ్రరాజ్యం’ అని భారతదేశం చెప్పుకునేది. కొంత కాలం పాటు భారతదేశ స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు చైనాను కూడా మించి పోయి ప్రపంచం లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా చెలామణి అయినప్పుడు కూడా (నిజానికి ఈ లెక్కలు ఎంతవరకు వాస్తవం అనేది కాసేపు పక్కన పెడదాం) బీజేపీ ప్రభుత్వం ప్రజలకు అసలు నిజాలను తెలియనివ్వలేదు.
ప్రజల ఆకలిని, దారిద్య్రాన్ని ఏమాత్రం పట్టించుకోక పోవటాన్ని ఎలా వివరించగలం? పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం ఒక ధృవం వద్ద సంపదను మరో ధృవం వద్ద దారిద్య్రాన్ని (ప్రపంచ ఆకలి సూచికలో క్యూబా 5వ స్థానం కంటే తక్కువ ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదు) పోగు చేస్తుంది. కానీ సామాన్య ప్రజల నిరాశా నిస్పృహల పట్ల పాలక పార్టీ అవలంభిస్తున్న నిర్దాక్షిణ్య వైఖరి పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్దేశించేదానిని మించి ఉంది. ఉదాహరణకు ప్రజలు ఆకలితో అలమటిస్తున్న కాలం లోనే భారత దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు అపారంగా ఉండటమే కాకుండా వాటిని పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నారు. ఈ ఆహార ధాన్యాలనే గనుక ప్రజలు వినియోగించటానికి ఉపయోగించి ఉన్నట్టయితే దేశంలో ఆకలి బాధ విస్తృతిని మనం గణనీయంగా తగ్గించగలిగేవాళ్ళమే. ఇది ఎందుకు జరగలేదు?
ప్రజల దుర్భర పరిస్థితి పట్ల పాలక పార్టీ అనుసరిస్తున్న నిర్దాక్షిణ్య వైఖరి పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్దేశించిన దానిని మించి వుంది. అంతేకాకుండా ఇతర దేశాలలో వున్న దానికంటే మరింత ఘోరంగా ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే ఈ నిర్దాక్షిణ్య వైఖరికి ప్రత్యేకమైన భారతీయ మూలాలు ఉన్నాయి. అలాంటి మూలాలలో ఒకటి కుల వ్యవస్థలో ఉండటమనేది సుస్పష్టం. దళితులకు, ‘వెనుకబడిన’ కులాలకు చెందిన వారిని అగ్రకులాలు ‘సమానులు’గా కూడా భావించనప్పుడు…ఈ వ్యవస్థీకృత అసమానత వారి పట్ల సానుభూతిని చూపటానికి కూడా అడ్డు వస్తుంది. వారిలో చాలా వరకు పేదలు. వేరే మాటల్లో చెప్పాలంటే కుల వ్యవస్థ చేత వ్యవస్థీకృతమైన అసమానతపైన… పెట్టుబడిదారీ వ్యవస్థ జనింపజేసిన అసమానత పైనుంచి విధించగా ఏర్పడిన సమాజిక నిర్మాణం మనది. ఇటువంటి సామాజిక నిర్మాణం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక నిర్దాక్షిణ్యమైన ధోరణిని జనింపజేస్తుంది. ఈ వాస్తవం హిందూత్వ శక్తుల పాలనలో మరింతగా ప్రస్ఫుటమౌతోంది. దళితుల, ఇతర వెనుకబడిన కులాల నుంచి ఎన్నికల్లో మద్దతు సంపాదించినప్పటికీ వారి జీవన స్థితిగతులను మెరుగు పర్చటం కోసం ప్రభుత్వం చేయవలసిన వ్యయాన్ని చేయకుండా విస్మరిస్తోంది.
ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపర్చటానికి ప్రభుత్వం ప్రకటించిన విత్త సంబంధిత చర్యలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. విద్య, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి సంక్షేమ కార్యక్రమాలపై చేసే వ్యయాన్ని పెంచితే ఆకలి, దారిద్య్రం తగ్గటమే కాకుండా ఆర్థిక వ్యవస్థ కూడా ఉత్తేజితమయ్యేది. అయితే ఈ ప్రభుత్వం వీటిలో ఏమీ చేయలేదు. అందుకు బదులుగా భారతదేశం లోని అత్యంత సంపన్నులకు ఉపయోగపడే విధంగా 1.45 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ పన్ను రాయితీలను ఇచ్చింది! స్థూల జాతీయోత్పత్తి లో అధిక వృద్ధి రేటు నమోదు కావటాన్ని గర్వంగా భావించే ఈ ప్రభుత్వం ప్రపంచ ఆకలి సూచికలో దేశం కింద నుంచి 16వ స్థానంలో ఉండటాన్ని కనీసం పట్టించుకోవటం లేదనే వాస్తవం బీజేపీ ‘తీవ్ర జాతీయవాదం’ ఎంత మోసపూరితమైందో తెలియజేస్తుంది. ఈ దిశగా పయనిస్తుండటం పట్ల ప్రభుత్వ ఉన్నత స్థాయి సలహా సంస్థగా వున్న నీతి ఆయోగ్ పూర్తిగా సంతృప్తి చెందుతున్నట్టు ప్రకటించింది!