లౌకికభారతానికి తీరని అన్యాయం

0
235
లౌకికభారతానికి తీరని అన్యాయం

Image result for లౌకికభారతానికి తీరని అన్యాయం"– సీఏఏపై అంతర్జాతీయ మీడియా
– ప్రధాని మోడీ మతతత్వ ఎజెండాపై సర్వత్రా ఆందోళన
– స్వతంత్ర పోరాటయోధుల నమ్మకాన్ని వమ్ము చేశారంటూ విమర్శలు

న్యూఢిల్లీ : మొన్న ఆర్టికల్‌ 370రద్దు, నిన్న ‘పౌరసత్వ సవరణ చట్టం’…భారత్‌లో ప్రధాని మోడీ ప్రభుత్వ తీరు ప్రమాదకరంగా ఉందని పేర్కొంటూ ప్రపంచ మీడియా సైతం ఆందోళన వ్యక్తం చేసింది. మతపరమైన హిందూత్వ ఎజెండాను బలంగా ముందుకు తెస్తున్నారని వార్తా కథనాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. లౌకిక సామ్యవాద దేశంగా భారత్‌ ఆవిర్భవించాలని కలలుగన్న వారికి ప్రస్తుత పాలకులు తీరని ద్రోహం చేశారనీ, వారి ఆశల్ని వమ్ము చేశారనీ అంతర్జాతీయ మీడియా అభిప్రాయపడింది. సీఏఏకు వ్యతిరేకంగా నిరసనల నేపథ్యంలో ద న్యూయార్క్‌ టైమ్స్‌, ఫారెన్‌ పాలసీ, ద సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌, ద గార్డియన్‌, ద జపాన్‌ టైమ్స్‌, హారెట్జ్‌…మొదలైన ప్రఖ్యాత వార్తా దినపత్రకలు రాసిన వార్తా కథనాలు ఈ విధంగా ఉన్నాయి.

హిందూత్వ ఎజెండా ముందుకు
– న్యూయార్క్‌ టైమ్స్‌, 20 డిసెంబరు
సీఏఏకు వ్యతిరేకంగా వెలువడుతున్న నిరసనగళాన్ని దెబ్బతీసేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారు. ‘వారు వేసుకున్న దుస్తులను బట్టి నిరసనకారులెవరో గుర్తించవచ్చు’ అంటూ ముస్లింలను ఉద్దేశించి ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తద్వారా నిరసనల గళాన్ని తక్కువచేసే ప్రయత్నం ప్రధాని చేశారు. అన్ని వర్గాల ప్రజలు నిరసనల్లో పాల్గొంటున్నారు. విద్యార్థులు, సామాజిక, పౌరహక్కుల కార్యకర్తలు, మేథావులు, పలు రంగాల నిపుణులు….పెద్ద సంఖ్యలో నిరసనల్లో పాల్గొంటున్నారు. లౌకక భారతాన్ని బలహీనపర్చి, హిందూత్వ ఎజెండాను బలపర్చాలన్న దిశగా ప్రధాని మోడీ వ్యూహాలు ఉన్నాయి.

విద్యార్థులది ఒకేమాట..ఒకేబాట
– ద గార్డియన్‌, 16 డిసెంబర్‌
సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వర్సీటీల్లోని విద్యార్థులంతా ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ ఉద్యమిస్తున్నారు. వర్సిటీ క్యాంపస్‌లలోకి చొచ్చుకొచ్చి విద్యార్థులపై పోలీసులు దాడులు జరుపుతున్నారు. ఢిల్లీలో చోటుచేసుకున్న ఘటనలు సర్వత్రా ఆగ్రహం తెప్పించాయి. జామియా మిలియా వర్సిటీ క్యాంపస్‌లో పోలీసులు దాడులు చేసి, 100మందికిపైగా విద్యార్థుల్ని అరెస్టు చేశారు. మరోవైపు శాంతియుతంగా నిరసనలు చేపడుతున్నవారిని తీవ్రంగా కొట్టారు. టియర్‌గ్యాస్‌ ప్రయోగించారు.

స్వాతంత్రోద్యమానికి ద్రోహం చేయటమే
– ఫారెన్‌ పాలసీ, 17 డిసెంబర్‌
ప్రధాని మోడీ తీసుకొచ్చిన ‘సీఏఏ’ భారతదేశ లౌకికవిధానానికి కొత్త సవాల్‌ కాబోతున్నది. మతపరమైన లక్ష్యంతో కొత్త చట్టాన్ని చేశారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. దేనికోసం స్వతంత్ర ఉద్యమం సాగిందో…ఆ విధానాల్ని దెబ్బతీసే చట్టాలు వస్తున్నాయి.

ముస్లింలే లక్ష్యం..
– ద న్యూయార్కర్‌, 16 డిసెంబర్‌
ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం జరిపి, మోడీ మరోమారు ప్రధాని పదవి చేపట్టారు. దాంతో ముస్లింలను లక్ష్యంగా చేసుకొని పలు నిర్ణయాలు వెంట వెంటనే చేస్తున్నారు. సీఏఏ తీసుకురావటం ద్వారా ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పరిమితులు దాటి చాలా దూరం వెళ్లింది.

సెక్యూలర్‌ విధానాలకు దూరంగా ఇండియా
– ద జపాన్‌ టైమ్స్‌, 17, డిసెంబర్‌
పాకిస్థాన్‌లా మతప్రాదిపదికన భారతదేశం ఏర్పడటం లేదనీ, భారత్‌ లౌకికదేశమనీ గర్వంగా చెప్పుకున్న స్వాతంత్రోద్యమ నాయకులకు తీరని ద్రోహం జరిగింది. దేశ విభజన సమయంలో మతంతో సంబంధం లేకుండా భారత్‌ అందరికీ ఆశ్రయం కల్పించింది. 70ఏండ్ల తర్వాత అదే భారత్‌ నేడు ముస్లింలకు వ్యతిరేకంగా చట్టం చేసింది. ఇతర దేశాల్లో మానవ సంక్షోభం కారణంగా శరణార్థులుగా మారుతున్న ముస్లింలకు భారత్‌లో చోటులేదని మోడీ ప్రభుత్వం చెప్పదల్చుకుంది. ఇండియాను హిందూత్వదేశంగా మార్చాలనుకుంటున్నారు.

ఆందోళనలో భారతీయ ముస్లింలు
– ద సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌, 19, డిసెంబరు
అసోంలో నిర్వహించిన ఎన్నార్సీ లక్షలాది మందికి దేశ పౌరసత్వాన్ని దూరం చేసింది. మరికొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా ఎన్నార్సీని చేపడతామని ప్రకటించారు. ముస్లింలకు వ్యతిరేకంగా సీఏఏ చట్టాన్ని చేశారు. ఈనేపథ్యంలో భారతీయులంతా తాము దేశ పౌరులమేనని నిరూపించుకోవాలి. ఇదంతా కూడా ముస్లిం మైనార్టీల్లో పెద్ద ఎత్తున ఆందోళనకు దారితీసింది.

ప్రమాదంలో ప్రజస్వామ్యం
– హారెట్జ్‌, 24 డిసెంబర్‌
ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అమలుజేస్తున్న హిందూత్వ ఎజెండా దేశ ఆర్థికరంగాన్నే కాదు, ప్రజాస్వామ్యాన్ని కూడా దెబ్బతీస్తున్నది. ముస్లిం మైనార్టీలపై, నిరసనకారులపై ప్రభుత్వ అణచివేత పతాకస్థాయికి చేరుకుంది. ప్రజల మధ్య మత విభజన తీసుకురావడం కోసం అనేక ఎత్తుగడలు వేస్తున్నారు. మరోవైపు దేశంలో అంతా సజావుగా ఉందన్న ప్రచారాన్ని ప్రధాని మోడీ వినిపిస్తున్నారు. కానీ…ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా భారతీయ సమాజంలో అసంతృప్తి, ఆందోళన తీవ్రరూపం దాల్చుతున్నాయి.

(Courtesy Nava Telangana)

Leave a Reply