అయ్యో.. ఇం‘టెకీ’

0
201
 • బడా ఐటీ కంపెనీల్లో ఎడాపెడా తొలగింపులు
 • సీనియర్లకూ తప్పని తంటాలు
 • అమెరికాలో లక్ష మంది తెలుగు వారిపై ఎఫెక్ట్‌
 • చిన్న సంస్థలపై హెచ్‌-1బీ వీసాదారుల దృష్టి
 • బడా ఐటీ కంపెనీల తొలి వేటు ఉద్యోగులపైనే.. మాంద్యం సాకుతో హఠాత్తుగా కోతలు
 • ఏళ్ల కొద్దీ పనిచేసిన సీనియర్లకూ తప్పని తంటాలు
 • ఇప్పటిదాకా లక్షల కోట్ల మేర లాభాల ఆర్జన
 • లాభాలు, విలువ తగ్గొద్దనే కంపెనీల వ్యూహం!
 • ఖర్చుల తగ్గింపు, జీతాల్లో కోత వంటి
 • ప్రత్యామ్నాయాలను పట్టించుకోని వైనం
 • ఉన్నపళంగా తీసివేతలతో ఉద్యోగుల్లో ఆందోళన
 • అమెరికాలో లక్షల మంది తెలుగు వారిపై ఎఫెక్ట్‌
 • మధ్యలో వేటు వేస్తే పిల్లల చదువులెలా?
 • చిన్న కంపెనీలపై హెచ్‌-1బీ వీసాదారుల దృష్టి
 • హైదరాబాద్‌కు చెందిన సాయికృష్ణ

16 ఏళ్లుగా అమెరికాలోని గూగుల్‌లో హెచ్‌-1బీ వీసాపై పనిచేస్తున్నారు. పలు కీలక ప్రాజెక్టుల్లో సేవలందించారు. అలాంటిది.. ఆయన్ను కంపెనీ ఒక్క ఈ-మెయిల్‌తో అమానవీయంగా సాగనంపింది. అమెరికాలో వేలాది మంది ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఇదే!

హైదరాబాద్‌ : జూనియరా? సీనియరా? అని కాదు. గతంలో ఎంత బాగా పని చేశారన్నది లెక్కలోకి రాదు. ఇప్పుడు పని చేస్తున్న ప్రాజెక్టు లాభదాయకమైతే ఉద్యోగం ఉన్నట్టు.. లేకపోతే ఊడినట్టే. చిన్నా.. చితకా కాదు.. దిగ్గజ ఐటీ కంపెనీలు సైతం అనుసరిస్తున్న ఫార్ములా ఇదే. అది కూడా అత్యంత అమానవీయంగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఒకే ఒక్క మెయిల్‌తో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలు ముసురుకుంటున్న వేళ దిగ్గజ సంస్థలు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బడా కంపెనీలన్నీ ఎడాపెడా ఉద్యోగులను తొలగించేస్తుండడంతో అమెరికాలో పని చేస్తున్న మనోళ్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏడాది, రెండేళ్ల ముందు వెళ్లిన వాళ్లకే కాదు.. ఇరవై ఏళ్లుగా ఒకే సంస్థలో ఉద్యోగం చేస్తున్న వారికి సైతం ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది. దశాబ్దాలుగా లక్షల కోట్లు లాభాలు గడించిన సంస్థలు.. హఠాత్తుగా కొలువుల్లో కోత పెట్టడం ఎంతవరకు సమంజసమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

విద్యాసంవత్సరాన్ని పట్టించుకోకుండానే..
నష్టాలు తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను తొలగిస్తున్న బడా కంపెనీలు.. తమ నిర్ణయాన్ని విద్యాసంవత్సరం మధ్యలో ప్రకటించడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఉద్యోగులను అధికసంఖ్యలో తొలగించే ముందు వారి పిల్లల చదువులకు ఇబ్బంది కలగకుండా కంపెనీలు జాగ్రత్తలు తీసుకుంటాయి. అమెరికాలోనైతే జూన్‌ నుంచి ఆగస్టు వరకు వేసవి సెలవులు ఉంటాయి. ఈమధ్య కాలంలోనే బదిలీలతోపాటు కొత్త నియామకాలు కంపెనీలు చేపడుతుంటాయి. అయితే ఈసారి ఇవేమీ పట్టించుకోలేదు. ఉన్నపళంగా తొలగించడంతో హెచ్‌-1బీ వీసాదారుల పిల్లల చదువులపైనా ప్రభావం పడుతోందని అక్కడి తెలుగు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఎందుకీ తొలగింపు..?
ఆర్థికమాంద్యం కమ్ముకుంటున్న వేళ కొత్త వ్యాపారం తగ్గి, ఆదాయంపై ప్రభావం చూపిస్తుండడంతో కంపెనీలు ఉన్నపళంగా ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. గడిచిన మూడు నెలల్లో అమెరికాలో ఏకంగా 2 లక్షలకు పైగా ఉద్యోగాలకు కోత పడింది. ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు లక్షమందిపై పడనుంది. అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి అక్కడి బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి. దీంతో ఇప్పటికే రుణాలు తీసుకున్న కంపెనీలకు ఇది అదనపు భారంగా మారింది. ఎక్కువ వడ్డీలు చెల్లించాల్సి వస్తుండడంతో కంపెనీల లాభాలు తగ్గుతున్నాయి. దీంతో తక్షణ నష్ట నివారణ చర్యలపై కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. ఖర్చులు తగ్గించుకోవడం, జీతాల్లో కోత వంటి చర్యలతోనూ సమస్యను పరిష్కరించే అవకాశాలున్నా.. ఉద్యోగులను వదిలించుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. సాధారణంగా బడా కంపెనీలు ఉద్యోగిని తొలగించడానికి 30- 90 రోజుల సమయం ఇస్తాయి. కానీ, ప్రస్తుతం అలాంటివేమీ లేకుండా అకస్మాత్తుగా తొలగిస్తుండడంతో అమెరికాలో హెచ్‌-1బీ వీసాపై పనిచేస్తున్న ఐటీ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. కంపెనీ హెచ్‌-1బీ వీసాపై వచ్చిన ఒక ఉద్యోగిని తొలగిస్తే.. అతడు అప్పటినుంచి గరిష్ఠంగా 60 రోజుల్లో మరో హెచ్‌-1బీ ఉద్యోగం సాధించుకోలేకపోతే అమెరికాను వీడాల్సిందే.

తక్కువ జీతాలకూ సిద్ధం..
ఉద్యోగం కోల్పోయిన వేలాది హెచ్‌-1బీ వీసాదారులు తదుపరి ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. జీతం తక్కువ అయినప్పటికీ మిడ్‌ లెవెల్‌, చిన్న కంపెనీల్లో అయినా చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నైపుణ్యం ఉన్న ఉద్యోగులు కావడం, తక్కువ వేతనంతో వచ్చేందుకు సిద్ధంగా ఉండడంతో కొన్ని కంపెనీలు వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. అమెరికాలో ఆర్థికమాంద్యం వచ్చే ఏడాది వరకూ కొనసాగే అవకాశాలు ఉండడంతో అప్పటివరకు ఎలాగోలా అక్కడే కొనసాగాలనుకుంటున్న హెచ్‌-1బీ వీసాదారులు.. చిన్న కంపెనీల్లో చేరడమే మేలని భావిస్తున్నారు.

దంపతుల తొలగింపు
ఉద్యోగుల తొలగింపులో గూగుల్‌ వెనుకాముందు చూడటం లేదు. 4 నెలల చంటి పాప ఉందని కూడా చూడకుండా దంపతులైన ఇద్దరు ఉద్యోగులను కంపెనీ తొలగించింది. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా వారిపై వేటు వేసింది. 12వేలమంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియలో భాగంగా కంపెనీ వీరికీ ఉద్వాసన పలికింది. ఆ మహిళ ఆరేళ్లుగా గూగుల్‌లో పని చేస్తుండగా.. ఆమె భర్త రెండేళ్ల క్రితం కంపెనీలో చేరారు.

తల్లిని కోల్పోయిన బాధలోనే
గూగుల్‌లో ఉద్యోగం కోల్పోయిన ఇంజనీర్‌ టామీ యార్క్‌ది మరో విషాద గాథ.. క్యాన్సర్‌ బారిన పడిన అతని తల్లి గత నెలలో కన్నుమూసింది. ఈ ఘటన అతన్ని ఎంతగానో కుంగదీసింది. తల్లి మరణం తర్వాత సెలవు నుంచి తిరిగి వచ్చిన నాలుగు రోజులకు ఉద్యోగం నుంచి ఆయనను తొలగించారు.

నైపుణ్యాలుంటేనే కొనసాగుతారు
హెచ్‌-1బీ వీసాదారులకు ప్రస్తుతం అమెరికాలో పరిస్థితి గతంలో ఉన్నంత ఆశాజనకంగా లేకపోయినా.. నైపుణ్యం ఉన్నవారికి పెద్దగా ఇబ్బందేమీ లేదు. ఇలాంటి వారికి ఉద్యోగాలిచ్చేందుకు అనేక మధ్యతరహా కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.అత్తెసరు నైపుణ్యాలతో హెచ్‌-1బీ వీసాలు పొంది కొలువులు సాధించినవారికి అమెరికాను వీడడం తప్ప మరో మార్గం లేదు.
వెంకటరమణ గన్నె, ఐటీ కంపెనీ సీఈవో

Leave a Reply