స్వతంత్ర న్యాయ వ్యవస్థ..రాజ్యాంగ పరిరక్షణ..

0
383
– దుష్యంత్‌ దవే

స్వతంత్ర న్యాయ వ్యవస్థ, భారత రాజ్యాంగం నేడు ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రాథమిక హక్కులు, న్యాయ సంరక్షణలో న్యాయవాదుల పాత్ర గురించి చర్చించుకోవడం ఇదే మొదటి సారి కాదు. ఎప్పటి నుండో ఈ అంశాలపై చర్చ జరుగుతోంది. భారత రాజ్యాంగం ద్వారా దేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. మాంటెస్క్యూ లాంటి మేధావుల ఆలోచనల నుండి ఉద్భవించిన ‘అధికార విభజన సిద్ధాంతం’ నుండి దీనిని రూపొందించారు. శాసన, కార్యనిర్వాహక శాఖల నుండి న్యాయ వ్యవస్థను వేరు చేయకపోతే ‘స్వేచ్ఛ’ అనేది వుండదు. ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు విఘాతం వాటిల్లుతుంది. అప్పుడు న్యాయమూర్తి కూడా ఒక పాలకుడి లాగా లేదా నియంత లాగా మారతాడని ఆయన ఒకసారి అన్నారు. అలాగే ‘ప్రజలకు రాజ్యాంగం ద్వారా లభించిన స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు కలిగిన న్యాయ వ్యవస్థ లేనపుడు దానివల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం వుండదు. పైగా అవి ఏ క్షణమైనా పగిలిపోయే నీటి బుడగల వంటివి’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్‌ చెప్పారు. దీనినే పునరుద్ఘాటిస్తూ ‘భారత రాజ్యాంగం ఒక ప్రాథమిక పత్రం వంటిది’ అని డా||బి.ఆర్‌ అంబేద్కర్‌ చెప్పారు. ‘రాజ్యాంగం కేవలం ప్రభుత్వ అంగాలను రూపొందించడమే కాక, వాటికి పరిమితులు కూడా విధించింది. అవే లేకపోతే ప్రభుత్వ అంగాలు పూర్తి నియంతల్లా వ్యవహరిస్తాయి. శాసన శాఖ స్వేచ్ఛగా చట్టాలు తయారు చేయగలగాలి. కార్యనిర్వాహక శాఖ స్వేచ్ఛగా వాటిని అమలు పరచగలగాలి. అత్యున్నత న్యాయస్థానం స్వేచ్ఛగా చట్టాలను అన్వయించగలగాలి. అపుడే అందరికీ రాజ్యాంగ ఫలాలు పూర్తిగా లభిస్తాయి’ అని కూడా చెప్పారు.
‘ప్రజా సేవ చేయడంలో న్యాయ వ్యవస్థను పరిపాలన నుండి వేరు చేసే విధంగా రాజ్యం చర్యలు తీసుకోవాలి’ అని 50వ అధికరణం చెబుతుంది. అలాగే హైకోర్టులు, సుప్రీం కోర్టు జడ్జీల నియామకంలో, వారి విధి విధానాలలో న్యాయ వ్యవస్థ స్వేచ్ఛను పరిపాలన నుండి వేరుగా వుంచాలని రాజ్యాంగం లోని అనేక అధికరణలు బోధిస్తున్నాయి.

‘అత్యుత్తములు, రాజకీయాలకు అతీతులు, ధైర్యవంతులు, మచ్చ లేని నిజాయితీపరులైన వారినే జడ్జీలుగా నియమించాలని జస్టిస్‌ వర్మ 1993లో సుప్రీంకోర్టులో తీర్పు చెప్పారు. కానీ న్యాయ వ్యవస్థ ఆశించినంత స్వేచ్ఛగా లేదని నాలుగు దశాబ్దాల మన చరిత్ర తెలియచేస్తున్నది. న్యాయ వ్యవస్థ ప్రభుత్వ దైనందిన కార్యకలాపాలకు విధేయత కలిగి వున్నదని ఎ.డి.ఎం జబల్పూర్‌ కేసు తీర్పు తెలియచేస్తున్నది. అలాగే ఈమధ్య కాలంలో ప్రసిద్ధ విద్యావంతులకు, భీమా కోరెగావ్‌ ఘటనలో స్వచ్ఛంద సేవకులకు, లాయర్లకు బెయిలు నిరాకరించడం, పి.చిదంబరం పట్ల చూపే వైఖరి, అసోం ఎన్‌ఆర్‌సి కేసులు చేపట్టే విధానం, గత కొద్ది వారాలుగా జమ్మూ కాశ్మీర్‌ ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకు సంబంధించిన అంశాలలో కోర్టులు ప్రభుత్వానికి దాసోహమైనట్లు కనిపిస్తోంది.

అదేవిధంగా మూక హత్యల కేసుల్లో, హేయమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో, 1984లో ఢిల్లీ అల్లర్లు, 2002 లో గుజరాత్‌ లో జరిగిన మత దాడుల కేసులను పరిశీలించినప్పుడు న్యాయ వ్యవస్థకు స్వతంత్రత వున్నదా అనే అనుమానాలు కలగక మానవు. ప్రభుత్వానికి, ప్రజల మధ్య వచ్చే సివిల్‌, క్రిమినల్‌ కేసులకు సంబంధించిన వారిలో కోర్టులు కేంద్ర ప్రభుత్వం వైపుకే మొగ్గు చూపుతున్నాయి. ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కానప్పటికీ అధికరణం 300ఎ ప్రకారం అది ముఖ్యమైన రాజ్యాంగ హక్కు. కానీ గత నాలుగు దశాబ్దాలుగా భూసేకరణలకు సంబంధించిన తీర్పులు ఆ రాజ్యాంగ హక్కుకు పూర్తి విరుద్ధంగా వుంటున్నాయి. క్రిమినల్‌ న్యాయ శాస్త్రం పూర్తిగా అవమానించబడుతున్నది. వాటి రెండు ప్రధాన ధర్మాలైన ‘ప్రిజ్యూమ్‌ ఇన్నోసెంట్‌, బర్డెన్‌ ఆఫ్‌ ప్రూఫ్‌’ ఇకమీదట వుండబోవనిపిస్తోంది. ఫలితంగా సాక్ష్యాలను పరిగణ లోకి తీసుకోకుండానే నిందితులు తప్పుడు కేసుల్లో సంవత్సరాల తరబడి జైళ్ళలో మగ్గుతున్నారు. పై కోర్టుల చొరవతో కొంత కాలం తర్వాత నిర్దోషులుగా విడుదలైనప్పటికీ ప్రభుత్వాల నుండి వారికి ఎటువంటి పరిహారాలు అందడం లేదు. ‘బెయిలు అనేది ఒక రూలు అని, జైలు తప్పని పరిస్థితుల్లోనే’ అనే సూత్రాన్ని విస్మరిస్తున్నారు. మన అత్యున్నత న్యాయస్థానం ముందస్తు బెయిలుకు సంబంధించి ‘సిబియా’ కేసులో వివరంగా చెప్పినప్పటికీ, అనేక సందర్భాలలో అది

నిరాకరించబడుతున్నది. రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కు రిట్‌ పిటిషన్‌. అలాగే వాటి మీద ఉన్నత న్యాయస్థానాలు కచ్చితంగా పరిహారాలు ఇవ్వవలసి వుంటుంది. ప్రాథమిక హక్కులను రక్షించని పక్షంలో అవి వుండి కూడా ప్రయోజనం ఏముంది? ‘హెబియస్‌ కార్పస్‌ పిటిషన్ల’ను సాధారణ పిటిషన్లుగా న్యాయమూర్తులు పరిగణిస్తున్నారు. కొందరు ప్రభుత్వం పట్ల విధేయతను చూపుతున్నారు. ‘విపరీతమైన స్వేచ్ఛ నుండి నియంతృత్వం, బానిసత్వం ఉద్భవిస్తాయి’ అని ప్లేటో ఒక సందర్భంలో చెప్పాడు. ‘ఈ దేశంలో పూర్తిగా మాట్లాడే స్వేచ్ఛ వుంది. కానీ మాట్లాడిన తరువాత స్వేచ్ఛ లేదు’ అని మరో సందర్భంలో మలేషియా ప్రధానమంత్రి అన్నారు. ప్రస్తుతం భారత దేశంలో ఈ విధానమే కొనసాగుతున్నది.
ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉత్తమ న్యాయమూర్తులను కొలీజియం గుర్తించక పోవడం, ప్రభుత్వం నుండి రిటైర్‌ అయిన తరువాత కూడా మళ్ళీ ప్రభుత్వం వల్లే ఉద్యోగాలు పొందాలనే ఆలోచన వంటివి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తన ఎజెండాను ముందుకు తీసుకుపోవడానికి బలహీనమైన న్యాయ వ్యవస్థను కోరుకోవటం వల్ల రాజ్యాంగం, దాని విలువలూ ఘోరంగా దెబ్బతింటున్నాయి.

ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఎంత నిందించినా సరిపోదు. ఇపుడు న్యాయవాదులు కూడా ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి బాధ్యత తీసుకోవాలి. లేదంటే న్యాయ వ్యవస్థకు వేగు గా వ్యవహరిస్తున్న ‘బార్‌’, ‘రూల్‌ ఆఫ్‌ లా’, ‘రాజ్యాంగాలు’ కూడా ఇక మీదట మునుపటిలా వుండబోవు.
న్యాయవాదులమైన మనం న్యాయ వ్యవస్థకున్న అత్యున్నత విలువలను నిలపడంలో విఫలమవుతున్నాం. మన ధర్మాలను విస్మరించాం. న్యాయ వ్యవస్థలో నేడున్న బంధుప్రీతి, అవినీతి, అసమర్ధతలను గొంతెత్తి వ్యతిరేకించడంలో మన గొంతు పూడుకు పోయింది. బహుశా బార్‌ నాయకులు చట్టబద్ధ సంస్థల్లో, ఎన్నికైన సంఘాలలో వుండడం వలన కావచ్చు. న్యాయవాదులమైన మనం అత్యున్నత ప్రమాణాలను పెంచడంలో విఫలమయ్యాం. ఫలితంగా న్యాయ దక్షత విఫలమైంది.
ఆలస్యంగా అందే న్యాయం వల్ల న్యాయం జరిగినట్లే కాదు. ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కాంట్రాక్టు, సివిల్‌, రాజ్యాంగ హక్కుల కేసులు, ప్రాథమిక హక్కుల పరిహారాల కోసం దఖలు చేసే కేసుల్లో పరిహారాలు పొందడం అసాధ్యమైపోయింది.

ఫలితంగా ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతోంది. అది పూర్తిగా నశించక ముందే మనం మేల్కొని ఆ నమ్మకాన్ని కాపాడాలి. సాధారణ ప్రజలు న్యాయ వ్యవస్థ గురించి, న్యాయవాదుల గురించి తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి స్థితి నుండి మనం కోలుకోవాలి. ఆ విధంగా జరగాలంటే కచ్చితంగా న్యాయ వ్యవస్థ, దాని స్వతంత్రత, లక్ష్య సాధన, నిర్ణయాత్మక స్వేచ్ఛను కాపాడే వేగుల మాదిరిగా మనం తయారవ్వాలి. ఇందుకోసం మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనకు మనమే ఉన్నత ప్రమాణాలు పెంపొందించుకోవాలి. అప్పుడు మాత్రమే మన రాజ్యాంగానికి పూర్వ వైభవాన్ని తీసుకురాగలం. న్యాయ విధానాన్ని వ్యవస్థలో ముందు పీఠిన నిలబెట్టగలం. మనమిప్పుడు తిరస్కరణ స్థితిలో వున్నాం. కాబట్టి మనం అభివృద్ధి దిశగా పోలేక పోతున్నాం. కనుక ప్రస్తుత లోపాలను గుర్తించాలి. వాటి గురించి చర్చించాలి. వాటిని గొంతెత్తి నినదించాలి. వాటిని తొలగించాలి. అపుడు మాత్రమే విజయవంతం అవుతాం.
( సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది, ప్రముఖ న్యాయ విశ్లేషకుడు అయిన దవే…ఇటీవల విజయవాడలో జరిగిన ‘అఖిల భారత న్యాయవాదుల సంఘం ఆంధ్రప్రదేశ్‌’ 11వ రాష్ట్ర మహాసభల్లో వీడియో ద్వారా వెలిబుచ్చిన అభిప్రాయాలు క్లుప్తంగా..)

Leave a Reply