అగాథంలో భారత ఆరోగ్య వ్యవస్థ

0
253

భారతదేశంలో భూస్వామ్య వ్యవస్థ చిక్కుకున్న సంక్షోభాన్ని వివరించడానికి డి.డి.కొశాంబి తరచూ ఒక ఉదాహరణ చెప్పేవారు. 1761లో మూడో పానిపట్టు యుద్ధంలో ఒకవైపున ఉన్న సైన్యాలకి తిండి లేదు. రెండో వైపున ఉన్న సైన్యాలు తమ ఆకలిని తీర్చుకోవడం కోసం చుట్టుపక్కల ఉండే గ్రామాలను లూటీ చేసేవి. మొత్తానికి ఇరువైపులా తమ సైన్యాలకు కావలసిన ఆహారాన్ని ఏర్పాటు చేసుకోలేదన్నమాట. అదే విధంగా ప్రస్తుతం భారత దేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఎటువంటి సంక్షోభంలో ఇరుక్కుని వుందో చెప్పడానికి ఒక్క దృష్టాంతం చాలు. ఇంత భయంకరమైన మహమ్మారితో ఒక పక్కన పోరాటం జరుగుతూ వుంటే దేశ రాజధాని లోని అనేక ఆస్పత్రుల్లో పని చేసే వైద్య సిబ్బందికి కొన్ని నెలలుగా మామూలుగా అందవలసిన జీతాలు కూడా ముట్టలేదు.

అయితే ఈ ఉదంతం మన ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని మాత్రమే కాకుండా భారతదేశ పెట్టుబడిదారీ వ్యవస్థ సాధారణ స్వభావాన్ని కూడా వెల్లడి చేస్తోంది. దీన్ని చూడాలంటే మనం కొద్దికాలం వెనక్కి వెళ్ళాలి. ఈ కోవిడ్‌-19 మహమ్మారి రాక మునుపే, ఇంకా ఆర్థిక సంక్షోభం మన మీద తన ప్రభావాన్ని చూపక మునుపే, మన దేశంలో ఒక వైద్య ఆరోగ్య వ్యవస్థ ఉంది. నిస్సందేహంగా అది ప్రపంచంలోనే అతి చెత్త వ్యవస్థల్లో ఒకటి. మన దేశం ఒక ఆర్థిక సూపర్‌ పవర్‌ గా ఆవిర్భవిస్తోందంటూ పాలకులు హడావుడిగా ప్రచారం చేసుకొంటోన్న కాలంలోనే మన ఆరోగ్య వ్యవస్థ పరిస్థితి అలా ఉండేది.

మన జిడిపిలో ఎంత శాతం ఆరోగ్యం మీద ఖర్చు చేస్తున్నామనేది ఒక కొలబద్దగా ఉంటుంది. ఆ లెక్కలను ప్రభుత్వం ఏనాడూ స్పష్టంగా ప్రకటించదు కాని ప్రపంచబ్యాంకు కొన్ని వివరాలను ప్రకటించింది. ఆరోగ్యం మీద ప్రభుత్వం వైపు నుంచి పెట్టే ఖర్చు, ప్రజలు తమ జేబుల్లోంచి పెట్టే ఖర్చు కలిపితే అది 2017లో మన దేశంలో మన జిడిపిలో 3.53 శాతం మాత్రమే. అదే సబ్‌-సహారన్‌ ఆఫ్రికా లో 5.18 శాతం. ఆ ప్రాంత దేశాలు మన కన్నా ఆర్థికంగా ఎంతో వెనకబడి వున్నాయి. వాటిలోకెల్లా కాస్త అభివృద్ధి చెందిన దేశం దక్షిణాఫ్రికా. ఆ దేశాన్ని మినహాయించి తక్కిన దేశాలలో ఆరోగ్యం మీద పెట్టిన ఖర్చుతో పోల్చి చూసినా మనం పెడుతున్నది తక్కువే.

ప్రపంచబ్యాంకు ఉన్నతాదాయ దేశాలు, మధ్య స్థాయి ఆదాయ దేశాలు, అల్పాదాయ దేశాలు అంటూ ప్రపంచ దేశాలను వర్గీకరించింది. ఆ ప్రకారం ఉన్నతాదాయ దేశాలు ఆరోగ్యం మీద తమ జిడిపిలో 12.53 శాతం ఖర్చు చేస్తుంటే, మధ్య స్థాయి ఆదాయ దేశాలు 5.39, అల్పాదాయ దేశాలు 5.24 శాతం చొప్పున ఖర్చు చేస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే గణాంకాలు ఇక్కడి వాస్తవ పరిస్థితిని తెలియ జెప్పడంలో కొన్ని తేడాలు వుండవచ్చు. కాని, ఒక విషయం మాత్రం స్పష్టం. మన దేశం ఆరోగ్యం మీద పెట్టే ఖర్చు మన జిడిపితో పోల్చితే అది ప్రపంచ దేశాల స్థాయిలో అతి దిగువన ఉంది. దక్షిణాసియా దేశాలన్నీ కలిపితే ఈ శాతం 3.46 ఉంది. దీనికి ప్రధాన కారణం ఆ దేశాలలో మన జనాభాదే పెద్ద భాగం. దానికి తోడు బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ మనకన్నా దిగువన ఉన్నాయి. బంగ్లాదేశ్‌ లో మందుల ధరలు అక్కడి విధానం ప్రకారం తక్కిన దేశాలకన్నా చాలా తక్కువగా ఉన్నాయి. అందువలన అక్కడ పెట్టే ఖర్చూ తగ్గుతుంది. అందువలన ఆ దేశంలో వైద్య వ్యవస్థ పరిస్థితి మన కన్నా అధ్వాన్నంగా ఉందన్న నిర్ధారణకు రాలేము.

క్యూబాలో ఆరోగ్యంపై పెట్టే ఖర్చు అక్కడి జిడిపిలో 11.74 శాతం. ఆ దేశం సంపన్న దేశం కాకపోయినా అధికాదాయ దేశాల స్థాయితో సమానంగా ఆరోగ్యం మీద ఖర్చు చేస్తోంది. బ్రిటన్‌ (9.63), జర్మనీ (11.25), ఫ్రాన్స్‌ (11.31) వంటి సంపన్న దేశాలు సైతం క్యూబా కన్నా వెనకబడే ఉన్నాయి. ఒక్క అమెరికా మాత్రం 17.06 శాతం ఖర్చు చేస్తోంది. ఎంత ఖర్చు చేస్తే మాత్రం ఏం ఉపయోగం? అమెరికాలో ఆరోగ్య వ్యవస్థ తీరు బాగులేదని, ప్రధానంగా ఆరోగ్య బీమా ద్వారా మాత్రమే అక్కడ వైద్యం అమలు జరుగుతోందని, అటు ఆస్పత్రులూ ఇటు ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలూ విచ్చలవిడిగా దోచేస్తున్నాయని అందరూ చెప్పుకుంటారు. అదే క్యూబాలో గాని, యూరోపియన్‌ దేశాలలో గాని ప్రభుత్వమే ప్రధానంగా బాధ్యత వహిస్తుంది.

ఇక్కడ మొత్తం ఖర్చును కొలబద్దగా పెట్టుకోవడం కొంత తప్పుదోవ పట్టించవచ్చు. మొత్తం ఖర్చులో ప్రైవేటు వైద్య సదుపాయాల కోసం చేసే ఖర్చు కూడా కలిసిపోయి వుంటుది. ఆ ప్రైవేటు సంస్థలు లాభాల కోసం చార్జీలు విపరీతంగా వసూలు చేస్తాయి. అందువలన ఖర్చు ఎక్కువైనట్టు కనపడు తుంది. మన దేశంలో చాలామంది వైద్య అవసరాలకోసం అప్పులపాలై, ఆస్తులనూ అమ్ముకుంటున్నారు. ఆ విధంగా పేదరికంలోకి దిగజారుతున్నారు. కనుక వైద్యం కోసం ఖర్చులో ప్రైవేటు వైద్యం పాలు ఎంత అన్నది కూడా ఒక అంశం. మన దేశంలో పెరుగుతున్న రైతన్నల ఆత్మహత్యల వెనక రుణభారం పెరిగిపోవడం ప్రధాన కారణం. ఆ రుణాలు పెరగడానికి ఒక ముఖ్య కారణం వైద్యం ఖర్చు విపరీతంగా పెరగడం. నయా ఉదారవాద కాలంలో వైద్యం ఎక్కువగా ప్రైవేటు పరం కావడం వలన వైద్యం ఖర్చు బాగా పెరిగిపోయింది.

ఈ కారణాలన్నిటిరీత్యా వైద్యం మీద జరిగే ఖర్చులో ప్రభుత్వం పెట్టే ఖర్చు ఆ దేశ జిడిపిలో ఎంత శాతమో లెక్కించి చూడడం ద్వారా ఆ దేశపు ఆరోగ్య వ్యవస్థ పరిస్థితిని అంచనా వేయడం మెరుగైన పద్ధతి అవుతుంది. ఆ లెక్కన చూస్తే మన దేశం పరిస్థితి ఇంకా అన్యాయంగా ఉంది. 2017-18లో మన ప్రభుత్వం వైద్యం కోసం చేసిన ఖర్చు మన జిడిపిలో కేవలం 1.17 శాతం! అదే యూరోపియన్‌ యూనియన్‌ దేశాలకు చూస్తే 7 శాతం. అత్యల్ప ఆదాయ దేశాల ఖర్చు మొత్తంగా చూస్తే 1.57 శాతం ఉంది. మన దేశంలో అంతకన్నా హీనంగా ఉంది. మన ప్రభుత్వం పెట్టే ఖర్చు శాతం పొరుగు దేశాలైన శ్రీలంక, భూటాన్‌, నేపాల్‌ లతో పోల్చినా తక్కువగానే ఉంది.

నిజానికి ప్రభుత్వం వైద్యంపై పెట్టే ఖర్చు ఒక దశాబ్దంగా ఆ ఒక్క శాతం చుట్టూ పరిమితం అయిపోయింది. 2004-5 లో 0.9 శాతం, 2010-11 నాటికి 1.1 శాతం, 2017-18 లో 1.17 శాతం, 2018-19లో 1.28 శాతం ఉంది.

వాస్తవానికి మన జిడిపి ఎంత మోతాదులో వృద్ధి చెందుతూ వస్తుందో అదే మోతాదులో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరుగుతూ రావాలి. ఇలా ఆదాయం పెరిగినంత మాత్రాన ప్రభుత్వ నిర్వహణ వ్యయం, రక్షణ వ్యయం వంటివి అదే మోతాదులో పెరగనవసరం లేదు. అటువంటి ఖర్చులు స్థిరంగా ఉంటే అదనంగా పెరిగిన ఆదాయాన్ని వైద్యం, విద్య వంటి ఇతర పద్దుల మీద ఎక్కువగా ఖర్చు చేయవచ్చు. అలాగనుక పెంచితే జిడిపిలో వాటి శాతం కూడా పెరుగుతుంది.

ప్రస్తుత నయా ఉదారవాద పాలనలో ఉపాధి కల్పన తగినంతగా లేదు. అందువలన ఉద్యోగాలున్న వారితో పోల్చుకున్నప్పుడు సాపేక్షంగా నిరుద్యోగుల శాతం పెరుగుతోంది. దీని పర్యవసానంగా ఉద్యోగుల జీతాల స్థాయి కనీస వేతనాల స్థాయి వద్దనే నిలిచిపోయింది తప్ప జిడిపి పెరిగినా ఆ మేరకు పెరగడం లేదు. అంతకంతకూ కార్మికుల స్థితిగతులు దిగజారిపోతున్నాయి. ఆదాయాల్లో వ్యత్యాసాలు పెరిగిపోతున్నాయి. ఇలా పేదరికం, ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నప్పుడు ప్రభుత్వం మరింతగా ప్రజల ఆరోగ్యం కోసం ఖర్చు పెంచాలని ఎవరైనా కోరుకుంటారు. కాని మన దేశంలో దానికి పూర్తి రివర్స్‌లో జరుగుతోంది. అంతకంతకూ ప్రభుత్వం ప్రజారోగ్యం పైన చేసే ఖర్చు తగ్గిస్తోంది.

భారత దేశంలో పెట్టుబడిదారీ విధానాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం జుగుప్సాకరంగా ఉంది. వ్యవస్థ వలన పెరుగుతున్న పీడనను, పేదరికాన్ని ఎంతోకొంత మేరకు తగ్గించి ఉపశమనం కలిగించే బదులు దానిని మరింత పెంచుతున్నది. ప్రభుత్వ వైద్యసేవలలో ఉన్న ఉద్యోగుల జీతాలను కూడా చెల్లించకుండా నిలిపివేయడం ఈ జుగుప్సాకర స్వభావానికి అద్దం పడుతోంది.

ప్రభాత్‌ పట్నాయక్‌
(స్వేచ్ఛానుసరణ)

Courtesy Prajasakti

Leave a Reply