దుర్గమ్మకు.. హక్కేదీ..!

0
205

అటవీశాఖ పరిధిలోనే ఇంద్రకీలాద్రి
ఏ అభివృద్ధికైనా వారి అనుమతి తప్పనిసరి
ఇప్పటికే సగం ఆక్రమణ.. ఉన్నదీ హారతే

అమరావతి
విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై దుర్గమ్మకు హక్కును కల్పించడంలో అధికారులు దశాబ్దాలుగా విఫలమవుతున్నారు. ఇప్పటికీ అటవీశాఖ పరిధిలోనే ఇంద్రకీలాద్రి ఉంది. కొండపై ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రాంతం తప్ప.. మిగతా ఎక్కడైనా ఏదైనా నిర్మాణాలు చేపట్టాలంటే అటవీశాఖ అనుమతి తీసుకోవాల్సిందే. ఇంద్రకీలాద్రిపై పూర్తి హక్కును దుర్గమ్మకు కల్పించాలంటూ దశాబ్దాలుగా ప్రతిపాదనలు ఉన్నా.. వాటిని కార్యరూపంలోనికి తీసుకొచ్చేవాళ్లు లేకుండాపోయారు. అందుకే ఎప్పుడూ ఉన్న ప్రాంతంలోనే నిర్మాణాలు కట్టడం.. మళ్లీ కొట్టడం.. తిరిగి కట్టడం.. ప్రాతిపదికనే సాగుతున్నాయి. మూడున్నర కిలోమీటర్ల పొడవైన ఇంద్రకీలాద్రి కొండను పూర్తిస్థాయిలో అమ్మవారి ఆలయం అవసరాల కోసం వినియోగించాలని అనేకసార్లు ప్రయత్నాలు జరిగినా.. అవి కార్యరూపం దాల్చలేదు. ఇంద్రకీలాద్రిని పూర్తిగా అటవీశాఖ నుంచి దుర్గగుడికి బదలాయించేందుకు చర్యలు చేపడతామంటూ గత ప్రభుత్వం సైతం ప్రకటించినా.. అది పట్టాలెక్కలేదు.

దుర్గమ్మ కొలువుండే ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ ఇప్పటికే సగం వరకూ  ఆక్రమణకు గురైంది. దుర్గగుడికి అధికారం లేకపోవడం.. అటవీ, రెవెన్యూ, నగరపాలక సంస్థలు పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైంది. మిగతా పైభాగంలో ఉన్న ప్రాంతాన్నైనా కాపాడి.. అమ్మవారి ఆలయానికి బదలాయిస్తే.. భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకునేందుకు వీలుంటుంది. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ఆలయమైన దుర్గగుడికి కనీసం కాటేజీలు సైతం కొండపై లేవు. కిందన ఒకటీ అరా ఉన్నా.. అవి దూరంగా ఉండడంతో వచ్చే భక్తుల అవసరాలకు ఉపయోగపడడం లేదు. అందుకే.. అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు ఎవరైనా.. ఇలా వచ్చి అలా వెళ్లిపోయేలా ప్రణాళిక రూపొందించుకుని వస్తారు. వచ్చే భక్తుల్లో అధికశాతం మందికి ఆలయానికి వచ్చి.. ఇక్కడ ఒకటి రెండు రోజులు ఉండాలని ఉన్నా.. కాటేజీలు లేక వెళ్లిపోతుంటారు. దశాబ్దంన్నర కిందటి నుంచి కొండపై కాటేజీలు కట్టాలని ప్రతిపాదనలు ఉన్నా.. స్థలాభావం, అధికారుల నిర్లక్ష్యంతో అవి పట్టాలెక్కడం లేదు.

కొండపై వేల ఎకరాలు..
ఇంద్రకీలాద్రి కొండపై వేల ఎకరాల స్థలం ఉంది. కొండ పైభాగంలో చదును చేసి కాటేజీలు వంటి వాటికి వినియోగించుకోవచ్చు. గతంలో అలాంటి ప్రణాళికలు సైతం రూపొందించారు. కానీ.. కొండను పూర్తిగా అటవీశాఖ నుంచి ఆలయానికి బదలాయించడం దగ్గరే.. మొత్తం ప్రణాళికలు ఆగిపోయాయి. తొలిసారి ఐఏఎస్‌ అధికారి హోదాలో ఈవోగా వచ్చిన సూర్యకుమారి సమయంలోనూ దీనికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించడం జరిగింది. గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ లాంటి చిన్న ఆలయాలకూ ఎప్పుడో అటవీశాఖ నుంచి పూర్తిగా బదలాయింపు చేసుకోగలిగారు. స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు పట్టుబట్టి మరీ చేయించుకున్నారు. కానీ.. ఏటా రెండు కోట్ల మంది భక్తులు వచ్చి రూ.100 కోట్లకు పైగా ఆదాయం ఉండే అతిపెద్ద దేవాలయమైన దుర్గమ్మ ఆలయానికి మాత్రం ఇంద్రకీలాద్రిని సొంతం చేయలేకపోతున్నారు. ప్రస్తుతం దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్థానికులే కావడంతో ఇప్పటికైనా ఈ విషయంపై దృష్టిసారిస్తే.. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు పూర్తిగా హక్కును కల్పించేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తలచుకుంటే.. వెంటనే ప్రక్రియను పూర్తిచేసేందుకు ఆస్కారం ఉంది. దశాబ్దాలుగా ఆచరణకు నోచుకోని అతిపెద్ద సమస్య పరిష్కారం అవుతుంది.

Courtesy Eenadu..

Leave a Reply