అసమానతల భారతం

0
601

– ప్రసాద్‌

ఆదాయాల్లో పెరుగుతున్న అంతరాలు

భారత్‌లో ఆదాయం, సంపదపరంగా తీవ్ర అసమానతలు రాజ్యమేలుతున్నాయని ప్యారిస్‌లోని ప్రపంచ అసమానతల అధ్యయన సంస్థ (వరల్డ్‌ ఇనీక్వాలిటీ ల్యాబ్‌) 2022 నివేదిక వెల్లడించింది. దాంతో భారత ఆర్థిక విధానంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆర్థిక సంస్కరణలకు స్వస్తి చెప్పి సంక్షేమానికి మారడం మంచిదేమో అనే సందేహం మేధావుల నోట వినిపిస్తోంది. భారత సమాజంలో ఉన్నత వర్గాల సంపద, ఆదాయాలు పెరుగుతుంటే, దిగువ శ్రేణివారి పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. 2021లో భారత సమాజంలో అగ్రశ్రేణిలోని 10శాతం- జాతీయ ఆదాయంలో 57శాతాన్ని, వారిలోనూ అత్యున్నత స్థాయిలోని ఒక శాతం 22శాతాన్ని సొంతం చేసుకుంది. దిగువ శ్రేణిలోని 50శాతం కేవలం 13శాతం వాటాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దిగువ అంచెలో ఉన్న 50శాతం జనాభా సగటు ఆదాయం రూ.53,610. ఉన్నత శ్రేణిలోని 10శాతం దానికన్నా 20 రెట్లు అధికంగా సగటున రూ.11,66,520 ఆర్జిస్తున్నారు.

ఆర్థిక సంస్కరణలే కారణమా?
అతి కొద్దిమంది సంపన్నులు, అత్యధిక పేదలతో భారత్‌ తీవ్ర అసమానతల దేశంగా నిలుస్తోందని తాజా నివేదిక పేర్కొంది. 1980ల నుంచి భారత్‌ చేపట్టిన ఆర్థిక సంస్కరణలే ఆ పరిస్థితికి కారణమని వ్యాఖ్యానించింది. 1980తో పోలిస్తే భారత్‌లో ప్రైవేటు వ్యక్తుల సంపద రెట్టింపు అయింది. పేద ప్రజల సంపద మాత్రం నానాటికీ కోసుకుపోతోంది. భారత్‌లో కుటుంబాల సగటు సంపద రూ.9,83,010. చైనాతో పోలిస్తే అది సగానికి తక్కువ. భారతీయ సమాజంలో అగ్రశ్రేణిలోని 10శాతం సగటు సంపద రూ.63,54,070. వారిలో అత్యున్నత స్థాయిలో ఉన్న ఒక శాతం సంపద రూ.3.25 కోట్లు. మధ్యతరగతి కుటుంబాల సగటు సంపద రూ.7,23,930. దిగువ అంచెలోని 50శాతం సగటు సంపద రూ.66,280 మాత్రమే. ఇటీవలి దశాబ్దాల్లో చైనాలోనూ ప్రైవేటు వ్యక్తుల సంపద అత్యధికంగా పెరిగింది. దాన్ని సరిదిద్దడానికి డ్రాగన్‌ ప్రభుత్వం అవినీతిపై, వ్యాపార గుత్తాధిపత్యంపై పోరు ప్రారంభించింది. భారత్‌లోనూ 1980లో 290శాతం ఉన్న ప్రైవేటు వ్యక్తుల సంపద 2020నాటికి 560శాతానికి పెరిగింది. ప్రపంచవ్యాప్త జనాభాలోనూ 10శాతం సంపన్నులు ప్రపంచ సంపదలో 76శాతాన్ని చేజిక్కించుకుంటే, దిగువనున్న సగం జనాభా కేవలం రెండు శాతంతో తృప్తిపడాల్సి వస్తోంది. కొవిడ్‌ మహమ్మారి కారణంగా అసమానతలు మరింత తీవ్రమయ్యాయి. 2019-21 మధ్య ప్రపంచ కుబేరుల సంపద 50శాతానికిపైగా పెరగ్గా- పేద, మధ్యతరగతికి ఆర్థికంగా తీవ్ర కడగండ్లు తప్పలేదు. అసమానతలకు ఆర్థిక సంస్కరణలే కారణమని తేలుతున్నందువల్ల వాటిని వెంటనే ఉపసంహరించాలని ఒక వర్గం ఆర్థిక వేత్తలు డిమాండు చేస్తున్నారు. 1980-2015 మధ్య భారత్‌లో పేదరికం స్థాయి తగ్గిందని మరోవర్గం వాదిస్తోంది. 1981లో భారత జనాభాలో రోజుకు 3.2 డాలర్లకన్నా ఎక్కువ సంపాదిస్తున్నవారు కేవలం 13శాతం. 2017కల్లా వారు 55శాతానికి పెరిగారని తాజా నివేదిక చాటుతోంది. దానికి ద్రవ్యోల్బణం కొంతవరకు కారణం కావచ్చుకానీ, ఆర్థిక సంస్కరణల వల్ల ప్రజల ఆదాయాలు పెరగడమే ప్రధాన కారణమనే వాదన వినిపిస్తోంది. కాబట్టి పేదరికాన్ని తగ్గించడం లేదా అసమానతలను రూపుమాపడం… ఈ రెండింట్లో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ప్రశ్న తలెత్తుతోంది.

పేదరికంలోకి ప్రభుత్వాలు
గడచిన 40 ఏళ్లలో ప్రపంచంలో కొద్దిమంది ప్రైవేటు వ్యక్తుల సంపద, ఆదాయాలు పెరిగాయి. ప్రభుత్వాలు నానాటికీ పేదలవుతున్నాయి. జాతీయ సంపదలో సంపన్న దేశాల ప్రభుత్వాల వాటా సున్నా. కొద్దిమంది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే సంపద అంతా కేంద్రీకృతమైంది. కొవిడ్‌ సంక్షోభం విరుచుకుపడిన తరవాత ప్రభుత్వాలు తమ జీడీపీలో 10 నుంచి 20శాతానికి సమానమైన మొత్తాన్ని ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి రుణంగా తీసుకోవలసి వచ్చింది. దాదాపు వంద దేశాలు తాము తీసుకున్న రుణాలపై ఈ ఏడాది చెల్లించాల్సిన వడ్డీలు 13,000 కోట్ల డాలర్లని అంచనా. అందులో సగ భాగాన్ని ప్రైవేటు రంగానికే చెల్లించాలి. కొవిడ్‌వల్ల ప్రభుత్వాలకు ఆరోగ్యసంరక్షణ ఖర్చులు పెరిగాయి. లాక్‌డౌన్ల వల్ల పన్నుల ఆదాయాలు కోసుకుపోయాయి. ఆదాయం సున్నా, అప్పులు మిన్న అనే దుస్థితిలోకి జారిపోయిన ప్రభుత్వాలకు అసమానతలను తొలగించడానికి ఆస్కారం ఉందా అనే సందేహమూ ఉద్భవిస్తుంది. దానికి పరిష్కారంగా ప్రైవేటు వ్యక్తులు, సంస్థల సంపదపై కొంత పన్ను విధించాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. కొవిడ్‌ సమసిపోయాక ఆర్థిక రథాన్ని తిరిగి పట్టాలు ఎక్కించడానికి ప్రభుత్వాలు కొత్త అప్పులు చేయాల్సిందే. దానివల్ల ఆర్థిక వ్యవస్థలు అస్థిరమవుతాయి. ద్రవ్యోల్బణం పెరిగి కరెన్సీ విలువలు పతనమవుతాయి. ప్రజలు దాచుకున్న పొదుపు మొత్తాల విలువ హరించుకుపోతుంది. కొవిడ్‌ తరవాత పన్నుల బాధను, కరెన్సీ విలువ క్షీణతను తప్పించుకోవడానికి సంపన్నులు ఇప్పటినుంచే జాగ్రత్తపడుతున్నారు. క్రిప్టో కరెన్సీలవైపు వారు మొగ్గుచూపడాన్ని ఈ కోణం నుంచే చూడాలి. క్రిప్టోలవల్ల తమ ఆదాయం కోసుకుపోతుందని గ్రహించిన ప్రభుత్వాలు వాటిని నిషేధించి, సొంత డిజిటల్‌ కరెన్సీలను ప్రవేశపెడతామంటున్నాయి.

Courtesy Eenadu

Leave a Reply