ధరల మంటల్లో ‘అమృత’ భారతం

0
134
పి. చిదంబరం 
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

పెట్రోల్, డీజిల్‌పై భరింప శక్యంకాని పన్నులు, సెస్‌లు విధించడం వల్లే ద్రవ్యోల్బణం పెరిగిపోయింది చమురు కంపెనీల నుంచి ప్రభుత్వం ఏటా పన్నులు, సెస్‌లు, డివిడెండ్ల రూపేణా లక్షలాది కోట్లు వసూలు చేస్తోంది. పేదలు, మధ్యతరగతి ప్రజలు వినియోగించుకునే సరుకులు, సేవలపై నియతకాలికంగా జీఎస్టీ రేట్లు పెంచుతున్నారు. ఆమ్ ఆద్మీ ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే తక్షణమే పెట్రోల్, డీజిల్‌పై పన్నులు, ఎల్‌పిజి ధర తగ్గించాలి; నిత్యావసర సరుకులపై పెంచిన పన్నులను రద్దు చేయాలి.

అధ్యక్షా, ఈ చర్చను చాలా రోజుల క్రితమే నిర్వహించి ఉండాల్సింది. సభా నిబంధన 267 కింద జరిగే ఒక చర్చ, మరేదైనా నిబంధన కింద జరిగే చర్చ మధ్య తేడా ఏమిటో నేను అర్థం చేసుకోలేకున్నాను. ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోంది. పాలక పక్ష నేతల అహంకారమే అందుకు కారణమని ప్రజలు భావిస్తున్నారు. అదలా ఉంచి ధరల పెరుగుదల గురించి చర్చిద్దాం. ఇది, దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితిపై చర్చ కాదు. అదే అయినట్టయితే ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణ, కాదు, దుర్నిర్వహణ– ముఖ్యంగా అప్రతిష్ఠాకర నోట్ల రద్దు నాటి నుంచి– గురించి ఒక వంద విషయాలు చెప్పి ఉండేవాళ్లం.

సరే, ధరలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ధరలు ప్రజల, ముఖ్యంగా పేదల, మధ్యతరగతి జనుల ఆర్థిక పరిస్థితులను కుదేలు పరుస్తున్నాయి. వారి నిత్య జీవన కష్టాలను మిక్కుటం చేస్తున్నాయి. వినియోగం తగ్గిపోయింది. పొదుపులు పడిపోయాయి. కుటుంబ రుణాలు పెరిగిపోయాయి. పోషకాహార లోపం, ముఖ్యంగా మహిళలు, బాలలను తీవ్రంగా బాధిస్తోంది. పేదరికం, అనార్యోగం సమస్యలతో అసంఖ్యాక ప్రజలు తల్లడిల్లి పోతున్నారు. ఇవి కఠోర వాస్తవాలు. వీటిని అంగీకరించేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదు. పాలకుల వైఖరి శోచనీయమే కాదు, గర్హనీయం కూడా. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల పెరుగుదల ప్రజల జీవితాలను ప్రభావితం చేయడం లేదని అటు మొన్న లోక్ సభలో గౌరవనీయ ఆర్థిక మంత్రి చెప్పడం నన్ను దిగ్భ్రాంతి పరిచింది. భీతి గొల్పింది కూడా! మంత్రి ప్రకటనలోని నిజానిజాలను నిగ్గు తీయాలి. ఒక మామూలు పరీక్షతో సత్యాసత్యాలను నిర్ధారిద్దాం. అదేమిటో చివరకు చెప్పుతాను.

ధరల పెరుగుదలపై చర్చిస్తున్నాం కదూ! ఈ చర్చ అప్రస్తుత, అనవసర అంశాలలోకి జారిపోదని ఆశిస్తున్నారు. మొక్కుబడి చర్చ వల్ల ప్రయోజనం లేదు. భరింప శక్యం కాని రీతిలో ధరలు పెరిగిపోతున్నాయన్న వాస్తవాన్ని అంగీకరించాలని ప్రభుత్వాన్ని, గౌరవనీయ సహ సభ్యులు అందరినీ కోరుతున్నారు. ఒక ఉపయుక్తమైన ప్రశ్న అడగడం మన విధి: ‘ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ప్రభుత్వం చేపట్ట నున్న చర్యలు ఏమిటి?’ ప్రస్తుత ద్రవ్యోల్బణానికి కారణాలు ఏమిటో గుర్తించడం చర్చకు నాంది అవుతుంది. తొలుత ద్రవ్యలోటు విషయాన్ని తీసుకుందాం. మన ద్రవ్యలోటు భారీగా ఉంది. అదింకా పెరుగుతోంది. ధరలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది. ఎలా చేస్తోందో వివరించేందుకు నాకు వ్యవధి లేదు. ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ద్రవ్యలోటు 6.4శాతం లేదా రూ. 16,61,196కోట్లుగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో ద్రవ్యలోటు రూ.3,51,871 కోట్లకు చేరింది. వ్యయాలను ప్రభుత్వం తక్కువగా అంచనా వేసిందని మనకు తెలుసు. ద్రవ్యలోటు భర్తీకి బడ్జెట్‌లో కేటాయింపులు జరపలేదు. ఆదాయాలను కూడా ప్రభుత్వం తక్కువగా అంచనా వేసిందా? 6.4శాతంగా మాత్రమే ఉండేలా ద్రవ్య లోటును ప్రభుత్వం అదుపు చేయగలదా? ప్రభుత్వం నుంచి నిర్దిష్ట సమాధానాన్ని కోరుతున్నాం.

కరెంట్ ఖాతా లోటు విషయాన్ని చూద్దాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇది 3,000 కోట్ల డాలర్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద కరెంట్ ఖాతా లోటు 10,000 కోట్ల డాలర్లు మించి పోగలదని అంచనా. ఇదే జరిగితే మన ఆర్థిక వ్యవస్థకు దాని పర్యవసానాలు చాలా విపత్కరంగా ఉంటాయి. మరి కరెంట్ ఖాతా లోటును తగ్గించేందుకు ఏమి చేయనున్నారో సభకు ప్రభుత్వం వెల్లడించాలి. అధ్యక్షా, మరొకసారి ప్రభుత్వం నుంచి నిర్దిష్ట సమాధానాన్ని కోరుతున్నాను.

దేశ ఆర్థిక వ్యవస్థకు మూడో ప్రమాద సూచిక వడ్డీరేటు. విధాన రేటును ఆర్బీఐ (భారతీయ రిజర్వ్ బ్యాంక్) నిర్దేశిస్తుందని మనకు తెలుసు. ద్రవ్య విధాన కమిటీకి ప్రభుత్వం ముగ్గురు సభ్యులను నామినేట్ చేస్తుంది. ప్రభత్వ కార్యదర్శి ఆర్బీఐ బోర్డ్‌లో సభ్యుడుగా ఉంటారు. కనుక, వడ్డీరేటు పెరుగుదలకు బాధ్యత తనది కాదని ప్రభుత్వం చెప్పలేదు, చెప్పకూడదు కూడా. అభివృద్ధి చెందిన దేశాలు సర్దుబాటు ద్రవ్య విధానాన్ని అనుసరిస్తూ మార్కెట్‌లోకి భారీ స్థాయిలో నగదును పంపింది. మనమూ ఆ దేశాల విధానాలను అనుసరించాం కదా. మరి ఇప్పుడు ఆ దేశాలు వడ్డీరేట్లను పెంచుతున్నాయి. మరి ఇప్పుడు మన దేశం అందుకు భిన్నమైన మార్గాన్ని అనుసరించగలదా? ఇది సందేహాస్పదమే. బ్యాంకు వడ్డీరేటును ఆర్బీఐ పెంచితే జరిగేదేమిటి? డిమాండ్‌ను అదుపు చేయవచ్చు. పర్యవసానంగా ధరలు తగ్గుతాయి. అయితే ఈ పరిణామాలు విక్రయాలు, లాభాలను, మరీ ముఖ్యంగా ఉద్యోగితను ప్రభావితం చేస్తాయి. ఈ సంభావ్య పరిస్థితులను నివారించేందుకు ఏమి చేయనున్నారు? ప్రభుత్వమూ, ఆర్బీఐ గవర్నర్ ఒకే ధ్యేయంతో కలసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నారా? అయినప్పుడు వడ్డీరేట్లపై తన అంచనాలు ఏమిటో పార్లమెంటుకు ప్రభుత్వం వెల్లడించాలి.

సత్వర ఆర్థికాభివృద్ధికి సరుకుల సరఫరాలను ఇతోధికంగా పెంచే విధానం వైపు మొగ్గు చూపుతున్నారు. కొంతకాలం వరకు దిగుమతులను ఉదారంగా అనుమతించే పరిస్థితి లేదు. అయితే దేశీయ ఉత్పత్తులు, సరఫరాలను పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టనున్నది? సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమల రంగం అష్టకష్టాలలో ఉంది. తొలుత ఆ రంగానికి ఇతోధికంగా సహాయం అందించకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ సత్వర పురోగతికి అది ఎలాంటి తోడ్పాటును అందించలేదు. పెద్ద కంపెనీలు తమ లాభాలను గరిష్ఠం చేసుకోవడం పైనే దృష్టి పెట్టాయి. ఈ కారణంగా సరఫరాలను అవి కృత్రిమంగా నిరోధిస్తాయి. వ్యాపార వర్తకాలేమో జీఎస్టీ చట్టాలు, రేట్ల శృంఖలాలలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మరి వస్తు సేవలను సమృద్ధంగా సరఫరా చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది? ఈ ప్రశ్నకూ నిర్దిష్ట సమాధానాన్ని కోరుతున్నాను.ఇక చివరగా ప్రభుత్వ పన్ను విధానం. ప్రజలను అమితంగా కలవరపరుస్తున్న విషయమిది. ప్రభుత్వం ఒక సహజ పాపానికి పాల్పడిందని నేను ఆరోపిస్తున్నాను. పెట్రోల్, డీజిల్‌పై భరింప శక్యంకాని పన్నులు, సెస్‌లు విధించింది. తత్ఫలితంగానే ద్రవ్యోల్బణం పెరిగిపోయింది చమురు కంపెనీల నుంచి ప్రభుత్వం ఏటా పన్నులు, సెస్‌లు, డివిడెండ్ల రూపేణా లక్షలాది కోట్లు వసూలు చేస్తోంది. ఈ ప్రభుత్వం మొండిగా, నిర్దయగా, కఠోరంగా వ్యవహరిస్తోంది. పేదల శ్రేయస్సుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. దీనికి తోడు పేదలు, మధ్యతరగతి ప్రజలు వినియోగించుకునే సరుకులు, సేవలపై నియతకాలికంగా జీఎస్టీ రేట్లు పెంచుతోంది. ఈ సందర్భంగా మనసును మెలిపెట్టే ఒక ఉదంతాన్ని ప్రస్తావించి తీరాలి. కృతి దూబే అనే ఆరేళ్ల బాలిక మరో పెన్సిల్ కావాలని తల్లిని అడిగింది. అసలే అస్తు బిస్తు ఆదాయంతో కుటుంబాన్ని పోషించలేకపోతున్న ఆ తల్లి చిన్నారి కుమార్తెకు కొత్త పెన్సిల్ ఇవ్వలేకపోయింది. మారాము చేస్తున్న కూతురికి ఒకటిచ్చుకుంది. పెన్సిల్ అడిగినందుకు తల్లి ఎందుకు కొట్టిందో అర్థంకాక ఆ బాలిక బాధపడింది. కూతురు అడిగిన పెన్సిల్‌ను, ధనాభావం కారణంగా ఇవ్వలేకపోయినందుకు ఆ తల్లి అమితంగా ఆవేదన చెందింది. మరి ఆ చిన్నారి బాలిక బాధ, ఆమె తల్లి ఆవేదన పట్ల సంవేదన చెందే హృదయం ఈ ప్రభుత్వానికి ఉందా? ద్రవ్యోల్బణం కారణంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంటే తక్షణమే పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించాలి; ఎల్‌పిజి ధర తగ్గించాలి; నిత్యావసర సరుకులపై పెంచిన పన్నులను రద్దు చేయాలి. ఇవి జరిగినప్పుడే సామాన్యులకు శ్రేయస్సు సమకూరుతుంది.

అధ్యక్షా, నేను ఇంతకు ముందు ప్రస్తావించిన ‘పరీక్ష’ ఏమిటో ఇప్పుడు వెల్లడిస్తాను. మీరూ, గౌరవనీయ ఆర్థిక మంత్రీ, నేనూ ఒక ప్రైవేట్ కారులో, భద్రతా సిబ్బంది లేకుండా ఢిల్లీలోని మధ్యతరగతి ప్రజల కాలనీకి గానీ లేదా ఒక మురికివాడకు గానీ వెళదాం. పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజి ధరలు, జీఎస్టీ రేట్ల పెరుగుదల మీ జీవితాలను ప్రతికూలంగా ప్రభావితం చేసిందా అని మీరు ప్రజలను అడగండి. వారి తీర్పును అంగీకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఆమ్ ఆద్మీ అభిప్రాయాన్ని గౌరవనీయ ఆర్థిక మంత్రి కూడా అంగీకరిస్తారని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.

Leave a Reply