బీమా సంస్థలకే లాభాల పంట

0
328

రైతులను ఆదుకోని పథకాలు

ప్రకృతి ప్రకోపాలకు పంట కోల్పోయి, అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతు జీవితాలు దుర్భరం కావడం ఈ దేశంలో సర్వసాధారణం. దుర్గతి నుంచి రైతులను కాపాడటానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. పంట బీమా పథకాలతో ప్రయోగాలు చేస్తూ వచ్చాయి. దురదృష్టవశాత్తు అవేవీ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. పంట బీమా పథకాలకు ఎప్పటికప్పుడు మార్పుచేర్పులు చేసినా రైతులకు ఒరిగిందేమీ లేకపోగా, వారి పరిస్థితి మరింత క్షీణించింది. ప్రస్తుతం అమలవుతున్న ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనదీ ఇదే వరస. అయినా కూడా కేంద్రం ఈ పథకాన్ని కొంత సంస్కరించి కొనసాగించాలని చూస్తోందే తప్ప, రైతులకు నిజంగా మేలు చేసే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి ఆలోచించడం లేదు. పాత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని రైతుకు నికరమైన ఆదాయం వచ్చేలా చూడాలన్న తపన కనిపించడం లేదు.

అంచెలవారీగా రూపం
ఇక్కడ పంటల బీమా పథకం పూర్వాపరాల గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. మైసూరు రాష్ట్రానికి చెందిన జె.ఎస్‌.చక్రవర్తి రైతులకు అనావృష్టి నుంచి రక్షణ కల్పించడం కోసం వర్ష బీమా పథకం చేపట్టాలని 1915లోనే ప్రతిపాదించారు. భారతదేశ పరిస్థితులకు తగిన వ్యవసాయ బీమా అనే అంశంపై ఆయన 1920లో ఒక పుస్తకం ప్రచురించారు. ఆ తరవాత మద్రాసులో, దేవస్‌, బరోడా సంస్థానాల్లో పంటల బీమా పథకాలను పోలినవి ప్రవేశపెట్టినా, అవి చెప్పుకోదగిన ఫలితాలను ఇవ్వలేదు. కాబట్టి స్వాతంత్య్రానంతరం చేపట్టిన పథకాలకు పనికొచ్చే గతానుభవాలు, పూర్వ విజయాలు ఏమీ లేకుండా పోయాయి. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే పంటల బీమా పథకాన్ని చేపట్టలేకపోయినా, దానిపై తర్జనభర్జనలు మాత్రం జరిగాయి. 1947లో పార్లమెంటు పంటల బీమా గురించి చర్చించింది. అప్పటి కేంద్ర ఆహార, వ్యవసాయ మంత్రి డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ పంటలు, పశువుల బీమాలను ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలిస్తామని లోక్‌సభకు హామీ ఇచ్చారు. ఆ మేరకు ప్రభుత్వం దీనిపై అధ్యయనం చేయించింది. పంటల బీమాను వ్యక్తిగత స్థాయిలో అమలు చేయాలా లేక ప్రాంతాలవారీగా అమలు చేయాలా అన్న మీమాంస అధ్యయన బృందానికి ఎదురైంది. మొదటి పద్ధతిలో రైతులకు వ్యక్తిగతంగా జరిగిన పంట నష్టం ఎంతనే అంశం ఆధారంగా బీమా మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. వారు గతంలో సాధించిన దిగుబడులు, ఎదురైన నష్టాల ఆధారంగా ప్రీమియం నిర్ణయించాలి. దీనికోసం దీర్ఘకాల గణాంకాలు అవసరమవుతాయి. అదే సమయంలో రైతులు తమకు జరిగిన నష్టాన్ని వాస్తవంకన్నా ఎక్కువ చేసి చూపుతారనే అనుమానమూ విధానకర్తల్లో వ్యక్తమైంది.

రెండో పద్ధతిలో ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని బీమా యూనిట్‌గా తీసుకుని, అక్కడ సాధారణంగా వేసే పంటలు, వార్షిక వాతావరణ, పంట వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇక్కడ బీమాకు రైతు వ్యక్తిగత నష్టాన్ని కాకుండా మొత్తం ప్రాంతంలోని రైతుల నష్టాలను ప్రాతిపదికగా తీసుకుని బీమా మొత్తాలు చెల్లించాల్సి ఉంటుంది. అధ్యయన బృందం సిఫార్సుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ రెండో పద్ధతిని ఆమోదించింది. కానీ, ఈ పథకం కింద ఆర్థిక భారాన్ని భరించలేమంటూ రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని తిరస్కరించాయి. 1965లో కేంద్ర ప్రభుత్వ పంటల బీమా బిల్లును, ఒక ఆదర్శ పథకాన్ని అవి తోసిపుచ్చాయి.

మొట్టమొదటి పంటల బీమా పథకం ఎట్టకేలకు 1972లో వెలుగు చూసింది. జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)కి చెందిన జనరల్‌ ఇన్సూరెన్స్‌ విభాగం గుజరాత్‌లో కేవలం హెచ్‌4 పత్తి పంటకు బీమా వర్తింపజేసింది. తరవాత కొత్తగా నెలకొల్పిన జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (జీఐసీ) ఈ ప్రయోగాత్మక పథకం పరిధిలోకి వేరుసెనగ, గోధుమ, బంగాళా దుంప (ఆలూ) పంటలనూ తెచ్చింది. నాటి ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ్‌ బంగలకూ దీన్ని విస్తరించింది. 1978-79 వరకు కొనసాగిన ఈ పథకాన్ని రైతులకు వర్తింపజేశారు. ప్రయోగాత్మక పథకం కాబట్టి ఆదిలో 3,110 మంది రైతులకు వర్తింపజేశారు. దీని కింద రూ.4.54 లక్షల ప్రీమియం వసూలు చేసి, దానికి ఎనిమిది రెట్లు ఎక్కువగా రూ.37.88 లక్షల క్లెయిములు చెల్లించారు. దానితో పంటల బీమాను వ్యక్తిగత స్థాయిలో కాకుండా ప్రాంతాలవారీగా అమలు చేయాలన్న వాదనకు బలం చేకూరింది. తదనుగుణంగా 1979 నుంచి 1985 వరకు జీఐసీ ప్రాంతాల ప్రాతిపదికపై ప్రయోగాత్మక పంటల బీమా పథకం అమలైంది. ఇందులో రాష్ట్రాలు తప్పనిసరిగా పాల్గొనాలనే నిర్బంధమేమీ లేదు. జీఐసీ, స్వచ్ఛందంగా చేరిన రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పథకం కింద నష్టభయాన్ని 2:1 నిష్పత్తిలో పంచుకున్నాయి. బీమా చేసిన మొత్తంలో అయిదు నుంచి 10 శాతాన్ని ప్రీమియంగా నిర్ణయించారు. ఆహార ధాన్యాలు, చిరు ధాన్యాలు, నూనె గింజలు, పత్తి, ఆలూ, సెనగలు, బార్లీ పంటలను బీమా పరిధిలోకి తెచ్చారు. మొత్తం 6.27 లక్షలమందికి పంటల బీమా వర్తింపజేసింది. ఈ ప్రయోగాత్మక పథకం నుంచి గడించిన అనుభవంతో కేంద్రం 1985 ఏప్రిల్‌లో సమగ్ర పంటల బీమా పథకం (సీసీఐఎస్‌) తీసుకొచ్చి 1999వరకు అమలు చేసింది. సీసీఐఎస్‌ సైతం విఫలమయ్యాక మరికొన్ని పథకాలు చేపట్టినా అవి సంతృప్తికర ఫలితాలు ఇవ్వకపోవడంతో కొత్తగా ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకాన్ని చేపట్టారు. 2011 నుంచి 2016 వరకు పంటల బీమా పథకం అమలులో చాలా లోపాలు దొర్లాయని కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (కాగ్‌) 2017లో వెల్లడించింది. ఎన్నో పంటల బీమా పథకాలు ప్రవేశపెట్టి, వాటికి ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దినా, ఈ పథకాల పరిధిలోకి వచ్చిన రైతుల సంఖ్య చాలా తక్కువ. గడచిన అయిదేళ్లలో అయిదు ఖరీఫ్‌ సీజన్లలో బీమా రక్షణ పొందిన రైతులు 14 నుంచి 22 శాతమే. దారుణమేమంటే చిన్న, సన్నకారు రైతుల్లో బీమా లభించినవారు వరసగా 5.75 శాతం, 13.32 శాతమే. రబీ సీజనులో బీమా పొందినవారి సంఖ్య మరీ అధ్వానం. ఈ సీజనులో అన్ని వర్గాల రైతుల్లో కేవలం ఎనిమిది నుంచి 12 శాతానికే బీమా రక్షణ లభించింది. చిన్న రైతుల్లో 2.7 శాతానికి, సన్నకారు రైతుల్లో 5.62 శాతానికే బీమా సొమ్ము దక్కింది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యాంశం ఒకటుంది. అది- బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులకే పంటల బీమా రక్షణ లభించడం. బ్యాంకులు వ్యవసాయ రుణాలిచ్చేటప్పుడు తమ ఖాతాదారులతో తప్పనిసరిగా పంటల బీమా చేయిస్తాయి కాబట్టి, వారికి మాత్రమే లబ్ధి చేకూరుతోంది.

లక్ష్యానికి దూరంగా…

ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకంతోనూ పరిస్థితి మారలేదు. 2016లో అమలులోకి వచ్చిన ఈ పథకం రైతులకు ప్రీమియం భారం తగ్గిస్తానని హామీ ఇచ్చింది. ఖరీఫ్‌ సీజనులో ఆహార ధాన్యాలు, నూనె గింజల పంటలకు బీమా చేసిన మొత్తంలో రెండు శాతాన్ని రైతు ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. రబీ సీజనులో ఇది 1.5 శాతం. వాణిజ్య, ఉద్యాన పంటలకు అయిదు శాతం ప్రీమియం చెల్లించాలి. రైతుల చెల్లింపులకు, అసలు బీమా ప్రీమియానికీ మధ్య తేడాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. ప్రకృతి ఉత్పాతాల్లో పంటలు ధ్వంసమై, రైతులు చెల్లించిన ప్రీమియంకన్నా చెల్లింపు మొత్తాలు 350 శాతం కన్నా ఎక్కువైనా, లేదా బీమా చేసిన మొత్తంలో 35 శాతంకన్నా ఎక్కువైనా బీమా కంపెనీల ఆర్థిక భారాన్ని ప్రభుత్వం తన భుజాలపై వేసుకుంటుంది.

చిన్న రైతుల కష్టం
కాగ్‌ 2017లో వెలువరించిన నివేదిక ఈ వైరుద్ధ్యాన్ని ధ్రువీకరించింది. చిన్న, సన్నకారు రైతుల్లో 86 నుంచి 98 శాతానికి బీమా రక్షణ లేదని, బ్యాంకు రుణాలు తీసుకున్న రైతులకే ఆ సౌకర్యం లభిస్తోందని వెల్లడించింది. వ్యవసాయ రంగానికి భారీగా రుణాలు అందిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పుకొంటున్నా చిన్న, సన్నకారు రైతుల్లో రెండు నుంచి 14 శాతానికే అవి అందుతున్నాయి. వీరిలోనూ అందరికీ పంటల బీమా రక్షణ లభిస్తోందని చెప్పలేం. కాగ్‌ సర్వే చేసిన రైతుల్లో మూడింట రెండొంతుల మందికి అసలు పంటల బీమా పథకం గురించే తెలియకపోవడం శోచనీయం. మరింత చింతించాల్సిన అంశమేమంటే- పంటల బీమా పథకం వల్ల రైతులకన్నా బ్యాంకులకే ఎక్కువ లబ్ధి చేకూరడం. వాటి వడ్డీ వసూలుకు ఢోకా లేకపోవడం. రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణ మొత్తాలకన్నా ఎక్కువ మొత్తాలకు బీమా తీసుకోవచ్చు. ఆ సంగతి వారికి తెలియక బ్యాంకుల నుంచి తాము తీసుకున్న రుణాల మీదనే పంటల బీమా చేయించుకుంటున్నారు. కౌలు రైతులూ పంటల బీమా పొందడానికి అర్హులే అయినా, వారిలో ఎంతమందికి ఆ సౌకర్యం లభించిందో కాగ్‌ నివేదిక తెలపలేదు. పంట నష్టం సంభవించిన 45 రోజుల్లో బీమా మొత్తం చెల్లించాల్సి ఉన్నా, బీమా సంస్థలు 1069 రోజులకైనా సొమ్ము చెల్లించని సందర్భాలు ఉన్నాయని కాగ్‌ తొమ్మిది రాష్ట్రాల్లో అధ్యయనం చేసి తేల్చింది.

ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకంలోని నిబంధన లోపం బీమా సంస్థలకు ఎంతగానో లాభించింది. 2016-17, 2017-18 సంవత్సరాల్లో 11 బీమా కంపెనీలు అందుకున్న ప్రీమియాలు రూ.47,408 కోట్లు, అవి చెల్లించిన క్లెయిములు రూ.31,613 కోట్లు! ఈ లెక్కన వాటికి ఫసల్‌ బీమా పథకం ద్వారా రూ.15,795 కోట్ల లాభం వచ్చిందన్నమాట. ఈ విధంగా రైతుల బదులు ప్రైవేటు బీమా కంపెనీలు బాగుపడుతున్నాయనే విమర్శలు మిన్నంటడంతో, కేంద్రం ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకాన్ని సంస్కరించే అవకాశాలున్నాయి. అలాగే బ్యాంకుల వద్ద వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులకు పంటల బీమా పథకాన్ని తప్పనిసరిగా వర్తింపజేయాలన్న నిబంధననూ తొలగించవచ్చు. ఏదిఏమైనా ఇలాంటి పైపై మెరుగులతో పని కాదని ప్రభుత్వం గుర్తించాలి. అన్నదాతలకు సంపూర్ణంగా మేలుచేసే విధంగా పంటల బీమా పథకాన్ని తీర్చిదిద్దాలి!

(Courtacy Eenadu)

Leave a Reply