మంచుకొండల్లో మృత్యు బీభత్సం

0
210

ఇంత నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించినందుకు ఎవరిని తప్పుపట్టాలి? లద్దాఖ్‌లో చురుగ్గా ఉన్న మన బాహ్య గూఢచార సంస్థలతో పాటు రక్షణ మంత్రిత్వ శాఖ గూఢచార వ్యవస్థనూ తప్పుపట్టాలి. గల్వాన్‌ లోయలో సంభవించింది ఒక విధంగా కార్గిల్ పునరావృతం కావడమే. ఇది ఎంత మాత్రం క్షమార్హం కాదు. ఎందుకంటే మన ఉపగ్రహాలు నిత్యం ఈ లోయలోని పరిస్థితులపై ఛాయా చిత్రాలను పంపుతూనే ఉన్నాయి.

భారత్, చైనాలు ఒక కొత్త, వివాదాస్పద యుగం ఆరంభంలో ఉన్నాయా? అలానే కన్పిస్తోంది. తొలుత చైనీస్ సైనికులు భారత భూభాగాల్లోకి చొరబడ్డారు. ఈ చొరబాటును ఎవరూ కనిపెట్ట లేదు. గల్వాన్ లోయలోని కొన్ని కీలక ప్రదేశాలను చైనీయులు ఆక్రమించు కున్నారు. మే 5-6 తేదీల్లో భారత్, చైనా సైనిక దళాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణతో ఈ చొరబాటు వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత జూన్ 15-16 రాత్రి చైనా సైనిక దళాలు మన సైనికులతో తీవ్రంగా ఘర్షణ పడ్డాయి. మన సైనికులు 20 మంది చనిపోగా 80 మంది క్షతగాత్రులయ్యారు. పదిమందిని చైనీయులు ఖైదీలుగా తీసుకుని జూన్ 18న విడుదల చేశారు.

భారత్-చైనా సరిహద్దు లేదా వాస్తవాధీన రేఖ (ఎల్ఏసి) 1962 యుద్ధం నాటినుంచీ ఉద్రిక్తంగానే ఉన్నప్పటికీ, 1975 అనంతరం ఇంతమంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి. నాలుగున్నర దశాబ్దాల పాటు సరిహద్దుల్లో శాంతిని కాపాడడం సామాన్య విషయం కాదు. మోదీ పాలనలో ఆ శాంతి భగ్నమయింది.

భారత్-చైనా సంబంధాలపై మోదీ ప్రభుత్వం గత ఆరేళ్ళుగా చెబుతున్న కథనాలు పూర్తిగా అసత్యాలు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ చైనాకు అభిమానాస్పదుడయ్యారు. ముఖ్యమంత్రి మోదీని చైనాలో పర్యటనకు బీజింగ్ నాలుగుసార్లు ఆహ్వానించింది. ప్రధానమంత్రిగా కూడా మోదీ ఐదుసార్లు చైనాలో పర్యటించారు. రెండు దేశాల మధ్య పెంపొందుతున్న ప్రత్యేక సంబంధాలకు ఈ పర్యటనలు నిదర్శనాలని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు జిన్ పింగ్ ల మధ్య ప్రత్యేక సౌహార్ద సంబంధాలున్నాయనీ, అవి ఊహాన్ ( 2018), మహాబలిపురం (2019) సదస్సులలో ప్రతిబింబించాయని కూడా పదేపదే చెప్పారు. ఇవన్నీ తప్పుడు కథనాలు. జూన్ 15-16 రాత్రి ఘటనలు ఈ సత్యాన్ని ధ్రువీకరించాయి.

ఈ హింసాత్మక ఘటనల అనంతరం భారత్ రాజీ వైఖరినే చూపసాగింది. మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక బలహీన ప్రకటన విడుదల చేసింది. ‘సరిహద్దుల్లో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా సైన్యం ప్రయత్నించిన ఫలితంగానే హింసాత్మక ఘర్షణలు సంభవించాయి. ఎల్ఏసికి భారత్ వైపునే భారత సైన్యం కార్యకలాపాలు సాగుతున్నాయనీ, చైనా సైన్యం కూడా తమ వైపుకే పరిమితం కావాలని భారత్ ఆశిస్తున్నదని’ ఆ ప్రకటన పేర్కొన్నది. ఈ ప్రకటనకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రతిస్పందిస్తూ ‘గల్వాన్‌ లోయ ప్రాంతంపై సార్వభౌమత్వం ఎప్పుడూ చైనాదే’ అని పేర్కొన్నది. చైనా విదేశాంగ మంత్రి భారత్ ప్రకటనకు అభ్యంతరం తెలుపుతూ రెచ్చగొట్టేచర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు.

ఈ ఏడాది మేలో చైనా సైన్యం వ్యవహరించిన తీరుతెన్నులపై పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గల్వాన్‌ లోయలో జరిగిన చొరబాట్లను నిశితంగా పరిశీలిస్తే వాటికి చాలా నెలల ముందునుంచే చైనా సైన్యం పథక రచన చేస్తున్నట్టు అర్థమవుతుందని పలువురు పేర్కొన్నారు. బహశా 2019 ఆగస్టు నుంచే చైనా సైన్యం ఈ చొరబాట్లకు సంసిద్ధమయిందని వారు భావిస్తున్నారు. 2019 ఆగస్టులోనే జమ్మూ కశ్మీర్ రాజ్యాంగ ప్రతిపత్తిని మోదీ ప్రభుత్వం మౌలికంగా మార్చివేసిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుని తీరాలి. లద్దాఖ్‌లో తమకు సార్వభౌమత్వం ఉన్నదని పేర్కొంటున్న విస్తృత భూభాగాలను చైనా ఆక్రమించుకోవడాన్ని మన ప్రభుత్వం ఉపేక్షించడమో లేదా జరగలేదన్నట్టుగా కొట్టి వేయడమో చేసింది (ఈ రెండోదే వాస్తవం కావచ్చు). పాకిస్థాన్‌తో అనుసంధానానికై గిల్గిత్‌- బాల్టిస్థాన్ ప్రాంతం (ఇది లద్దాఖ్ లో భాగం) గుండా ఒక విశాల రహదారిని చైనా నిర్మిస్తోంది. కానీ, ఎల్ఏసికి భారత్ వైపున డిబిఓ రోడ్ తో అనుసంధానానికి ఒక ఫీడర్ రోడ్‌ను నిర్మించడం పట్ల బీజింగ్ ఆక్షేపణ తెలిపింది! ఆక్సాయిచిన్ భారత్‌లో అంతర్భాగం అన్న హోం మంత్రి ప్రకటనను కూడా బీజింగ్ తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నది.

అయితే చైనా ఉద్దేశాలను భారత్ సందేహించలేదు. ఇంత నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించినందుకు ఎవరిని తప్పుపట్టాలి? లద్దాఖ్‌లో విస్తృత స్థాయిలో చురుగ్గా ఉన్న మన బాహ్య గూఢచార సంస్థలతో పాటు రక్షణ మంత్రిత్వ శాఖ గూఢచార వ్యవస్థనూ తప్పుపట్టాలి. గల్వాన్‌ లోయలో సంభవించింది ఒక విధంగా కార్గిల్ పునరావృతం కావడమే. ఇది ఎంత మాత్రం క్షమార్హం కాదు. ఎందుకంటే ఇది ఉపగ్రహాల యుగం. మన ఉపగ్రహాలు నిత్యం లోయలోని పరిస్థితులపై నింగినుంచి ఛాయా చిత్రాలను పంపుతూనే ఉన్నాయి. కార్గిల్‌లో మన శత్రువు లక్ష్య స్పష్టత లేని పాకిస్థాన్ కాగా, గల్వాన్‌లో మన విరోధి జిత్తుల మారి చైనా. ఇదే కార్గిల్, గల్వాన్‌ మధ్య తేడా.

2013 డెప్సాంగ్ ఘటనల్లో చైనాకు భారత్ ఒక గుణపాఠం నేర్పింది. అక్కడ నుంచి చైనా పూర్తిగా ఉపసంహరించుకున్నది. 2017లో డోక్లామ్ (భూటాన్) లో భారత సైన్యం శక్తి సామర్థ్యాలు, బలహీనతల గురించి చైనా విలువైన పాఠాలను నేర్చుకున్నది. ట్రై జంక్షన్ ప్రాంతం నుంచి చైనా సైనిక దళాలు వెనక్కి పోవడం తమ విజయమని భారత సైన్యం భావించింది. అయితే డోక్లామ్ పీఠభూమిలో చైనా నిర్మించిన సైనిక స్థావరాల విషయమై భారత్ ఎటువంటి ఆక్షేపణ తెలుపలేదు. ఫలితంగా చైనా ఇప్పటికీ డోక్లామ్ పీఠభూమిలో తిష్ఠ వేసే వున్నది!

డోక్లామ్‌లో నేర్చుకున్న పాఠాలను చైనా ఇప్పుడు గల్వాన్‌ లోయకు వర్తింపచేస్తోంది. సమీప భవిష్యత్తులోనే పోంగ్యాంగ్ సరస్సు ప్రాంతానికి, ఫింగర్ 4, ఫింగర్ 8 ప్రాంతాలకు (ఇవి వాస్తవాధీనరేఖ కు కిందకు వస్తాయని చైనా అంటోంది) కూడా అనువర్తింపచేసే అవకాశం ఎంతైనా వున్నది.

నిజానికి గల్వాన్‌ లోయను కోల్పోవడాన్ని నివారించేందుకు మనకు ఒక అవకాశం లభించింది. జూన్ 6న కార్ప్స్ కమాండర్ల స్థాయి చర్చలు ముగిసిన వెంటనే నరేంద్ర మోదీ జిన్‌పింగ్‌కు ఫోన్ చేసి చర్చల ఫలితాలను ఉభయ దేశాలు ఆమోదిస్తున్నట్టుగా ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేసేందుకు ఒప్పించివుండవలసింది. మోదీ అలా చేసి వున్నట్లయితే జూన్ 15-16 విషాద ఘటనలు చోటుచేసుకునేవి కావు. అలా చేయకపోవడం మోదీ ఘోర తప్పిదం.

21 వ శతాబ్ది చైనా-భారత్ నాయకత్వంలో వర్ధిల్లే ఆసియా శతాబ్ది కావాలన్న నరేంద్రమోదీ స్వప్నం ఇక పూర్తిగా ముగిసిపోయినట్టేనని చెప్పక తప్పదు. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను మోదీ సరిగ్గా అర్థం చేసుకోలేదని గల్వాన్‌ ఘటనలతో స్పష్టమయింది. మరి మోదీని జిన్ పింగ్ సరిగ్గా అర్థం చేసుకున్నారా అనేది ఊహాగానాలకు తావిచ్చే అంశమే. ఈ నాయకులిరువురూ మళ్ళీ సన్నిహిత మిత్రులు కాలేరు. అయితే తమ విధులను యథావిధిగా నిర్వహిస్తూ సాధారణ సంబంధాలను కొనసాగించేందుకు అవకాశమున్నది. ‘ఒక సమయంలో ఒక అడుగు ముందుకు’ తరహా ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ఆస్కారమున్నది. గతంలో నరసింహారావు, వాజపేయి, మన్మోహన్ సింగ్ కూడా అలానే చైనా ప్రభుత్వాధినేతలతో ఒప్పందాలు కుదుర్చుకుని భారత్, చైనాల మధ్య (వాస్తవాధీనరేఖ భాగంగా ఉన్న) 4056 కిలో మీటర్ల సరిహద్దు వెంబడి శాంతిని పరిరక్షించారు. రెండు సహస్రాబ్దాల క్రితం ఋషి తిరువళ్ళువర్ ఒక సత్యాన్ని చెప్పారు: ‘స్వీయశక్తిని, మిత్రుల శక్తిని, ప్రత్యర్థి శక్తిని పరిగణనలోకి తీసుకొని మీ కార్యాచరణ నిర్ణయించుకోండి’ అన్నారాయన. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఉపదేశాన్ని పాటించడం శ్రేయస్కరం.

పి. చిదంబరం
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Courtesy Andhrajyothy

Leave a Reply